దూసి ర్యాంపులో ఆగని ఇసుక అక్రమ రవాణా
ర్యాంపు మూసివేస్తూ కలెక్టరు ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు
శ్రీకాకుళం: ఇసుకాసురలు పేట్రేగిపోతున్నారు. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ పనిని కానిచ్చేస్తున్నారు. పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇసుక ముఠా దూసి గ్రామానికి వరద ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నా స్థానికులు ప్రశ్నించలేకపోతున్నారు. అడిగితే దాడి చేయడం లేదంటే సంక్షేమ పథకాలు అందకుండా వేధింపులకు గురిచేయడం సర్వసాధారణమైపోయింది. అధికార పార్టీ నాయకుల అడ్డగోలు దోపిడీపై జిల్లా ఉన్నతాధికారులే తూతూమంత్రపు చర్యలతో సరిపెడితే సామాన్యులం తామేమి చేయగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆమదాలవలస మండలం దూసి ర్యాంపులో 40 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి నాలుగు నెలల క్రితం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే సొంత తమ్ముడే దూసి ర్యాంపుపై కన్నేశాడు. గుంటూరు ముఠాతో చేతులు కలిపి యథేచ్ఛగా దోపిడీకి తెరతీశాడు. ప్రభుత్వం విధించిన పరి మితిని మించి ఇసుక అక్రమ తరలింపు నిన్నా మొన్నటి వరకూ కొనసాగుతూనే ఉంది. దీనిపై ‘సాక్షి’ కథనం ఇవ్వడంతో తాత్కాలికంగా తెరపడింది. అయితే నాగావళి వరద వస్తుందని ఊహించిన ఈ ముఠా ముందస్తుగా వేల మీటర్ల ఇసుక తవ్వేసి నది ఒడ్డున గుట్టలుగా వేసింది. ఇక ర్యాంపులో ఎలాంటి తవ్వకాలు కానీ, ఇసుక రవాణా కానీ చేయకూడదని స్పష్టం చేస్తూ జిల్లా కలెక్టరు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
కానీ వాటిని బేఖాతరు చేస్తూ రాత్రిపూట ఆ ఇసుకను లారీలకు ఎత్తేసి ఆ ముఠా నిర్భయంగా తరలించేస్తోంది. మిగిలిన ఇసుకనైనా సీజ్ చేసి ప్రజావసరాలకు ఉపయోగించాల్సిన అధికారులు అటువైపు వెళ్లడానికే భయపడిపోతున్నారు. ఈ విషయమై ఆమదాలవలస తహసీల్దారు తారకేశ్వరి వద్ద ప్రస్తావించగా.. స్థానిక వీఆర్‌వోను అలెర్ట్ చేశామని చెప్పారు. అయితే ర్యాంపు వద్దకు వెళ్లడానికి పోలీసు సహాయం కోసం బుధవారం ఉదయం నుంచి ఫోన్‌లో ఎస్సైను సంప్రదించడానికి ప్రయత్నించామని, కానీ స్పందన రాలేదన్నారు. ఈ విషయమై సీఐ డి.నవీన్‌కుమార్ వివరణ కోరగా... ఎస్సై స్థానికంగానే ఉన్నారని, అయితే రెవెన్యూ అధికారులు ఎవ్వరూ తమను రక్షణ కోరలేదని సమాధానం ఇచ్చారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టరు ఇచ్చిన ఆదేశాలు కూడా సరిగా అమలుకాలేదంటే ఎమ్మెల్యే గారి ‘చిట్టి’ తమ్ముడి హవా ఏమిటనేదీ అర్థం చేసుకోవచ్చు.
మరో దోపిడీకి ఏర్పాట్లు!
ఇప్పటికే 20 మీటర్ల లోతున ఇసుక తవ్వేసి దూసి ర్యాంపును దోచుకున్న సదరు ముఠా... మరోచోట దోపిడీకి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. దూసి రైల్వేస్టేషన్‌కు సమీపంలోని రైల్వే క్వార్టర్ల పక్క నుంచి కొత్తగా మార్గం చేసుకొంటోంది. ఇప్పటికే భారీ లారీల వల్ల ప్రాణభయంతో ఉన్న స్థానికులు ఇప్పుడు ఏకంగా నివాసాల మధ్యనుంచే మార్గం ఏర్పాటు చేస్తున్నా నోరెత్తలేని పరిస్థితి.