శ్రీరాంపూర్, న్యూస్‌లైన్: సింగరేణిలో మట్టి బంగారమవుతోంది.. అక్రమంగా మట్టి దందా చేసే వారికి కాసులు కురిపిస్తోంది. ఫలితంగా సింగరేణికి కోట్లలో నష్టాన్ని తెచ్చిపెడుతున్నారు. ప్రభుత్వ గనులు, భూగర్భ శాఖ నిబంధనలను విరుద్ధంగా సింగరేణి అధికారులు ఓసీపీ మట్టిని బయటికి తీసుకుపోవడానికి అనుమతి ఇస్తున్నారు. కంపెనీ అధికారులకు అధికారం లేకున్నా అనుమతి ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో భవిష్యత్తులో బ్యాక్‌ఫిల్లింగ్‌కు పనికి వచ్చే కోట్ల రూపాయల మట్టి బయటికి తరలిపోతోంది. కంపెనీ అధికారుల నిర్వాహకం వల్లే ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది.
వ్యాపార కేంద్రంగా శ్రీరాంపూర్ ఓసీ
శ్రీరాంపూర్‌లో ఉన్న ఏకైక ఓపెన్‌కాస్టు గని మట్టి వ్యాపారానికి కేంద్రంగా మారింది. నిత్యం వందలాది లారీల మట్టి బయటికి వెళ్తోంది. ఓపెన్ కాస్టులో బొగ్గును తీయడానికి ముందు పైన ఉన్న మట్టిని తొలగిస్తారు. ఈ మట్టి తీయడానికి ప్రత్యేక ఓబీ కాంట్రాక్టర్ ఉంటాడు. ఓసీపీలో మట్టి ఎంత వచ్చిన దాన్ని దాచి బొగ్గు నిల్వలు అయిపోయాక ఏర్పడ్డ ఖాళీల్లో నింపాలి. దీన్నె బ్యాక్‌ఫిల్లింగ్ అంటారు. ఇది ప్రభుత్వ నిబంధన. అయితే అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. బయటి వ్యక్తులు కూడా మట్టిని తీసుకుపోవడానికి అనుమతి ఇస్తున్నారు. దీంతో మంచిర్యాల, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సింగరేణి మట్టి వ్యాపారం జోరుగు సాగుతోంది. మట్టి వ్యాపారం చేసే కాంట్రాక్టర్లు ఓపెన్ కాస్టు భూనిర్వాసితులను ముందు పెట్టి వారి ఇంటి అవసరాలకు, ఇతర అవసరాలకని జీఎం లేదా ఓసీపీ ప్రాజెక్ట్ అధికారికి దరఖాస్తు చేస్తున్నారు. వారు అడిగిందే తడవుగా అధికారులు అనుమతిస్తున్నారు. దీంతో మట్టిని కాంట్రాక్టర్లు ఇళ్ల, భవన నిర్మాణాలకు, భూముల ఫ్లాటింగ్ అవసరాలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో లారీ టిప్పు సుమారు రూ.1500 నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతోంది.
నిత్యం వందలాది లారీలు గోదాముల నిర్మాణానికి..
ఎస్సార్పీ1 గనికి, ఊరు శ్రీరాంపూర్‌కు మధ్య కరీంనగర్‌కు చెందిన ఓ బడా కాంట్రాక్టరు ధాన్యం గోదాములు నిర్మిస్తున్నాడు. కోట్ల విలువైన ఈ గోదాముల నిర్మాణంలో బేస్‌మెంట్, లోతుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేయడం కోసం ఓసీపీ మట్టిని వినియోగిస్తున్నారు. నిత్యం వందలాది లారీలు ఇక్కడికి మట్టి చేరవేస్తున్నాయి. అంతే కాకుండా సింగరేణి షేల్ (బొగ్గుతో వచ్చే వ్యర్థ పదార్థం) కూడా సరఫరా అవుతున్నది. ఓ కోల్ ట్రాన్సుపోర్టు కాంట్రాక్టరు, మరో వ్యక్తికి వీటిని తీసుకుపోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు.
సింగరేణి అధికారులకు అర్హత లే కున్నా..
ఇదిలా ఉంటే మట్టిని కంపెనీ బయటికి తీసుకుపోవడానికి అనుమతి ఇవ్వడానికి సింగరేణి అధికారులకు ఎలాంటి అనుమతి లేదు. ప్రభుత్వ మైనింగ్, భూగర్భ శాఖ అధికారులే నిబంధనలకు ఇది విరుద్ధం. కాని అధికారులు పట్టించుకోకుండా వ్వవహరించడం అనుమానాలకు తావిస్తోంది. అంతేగాకుండా ఓసీపీలో బ్యాక్‌ఫిల్లింగ్ కోసం పైన వచ్చిన మట్టినే తిరిగి నింపాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంట్రాక్టర్లకు అప్పన్నంగా అప్పగించిన అధికారులు భవిష్యత్‌లో బ్యాక్‌ఫిల్లింగ్‌కు మట్టిని ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉంది.
చెడిపోతున్న రోడ్లకు ఎవరు బాధ్యతులు..
ఎస్సార్పీ 1 నుంచి రాయల్ గార్డెన్ వరకు సింగరేణి రూ.33 లక్షలు వెచ్చించి షేప్ నిధులతో వేసిన థార్ రోడ్డు గోదాముల నిర్మాణానికి మట్టి చేరవేస్తున్న లారీలతో పూర్తిగా చెడిపోయింది. నస్పూర్, షిర్కే కాలనీ కార్మికులకు నిత్యం గనులకు డ్యూటీలకు వెళ్లడానికి ఇదే రోడ్డు దిక్కు. రాత్రి పగలు నడుస్తున్న లారీలతో దుమ్ము, ధూళీతో రోడ్డుపై వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సార్లు మట్టిలో బైక్‌లు జారీ పడి గాయాలపాలవుతున్నారు.
సింగరేణి కి అధికారం లేదు.
- ప్రదీప్‌కుమార్, ఏడీ, గనుల, భూగర్భ శాఖ
మట్టిని బయటికి ఇవ్వడానికి సింగరేణి అధికారులకు ఎలాంటి అధికారం లేదు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. బ్యాక్ పిల్లింగ్ కోసం మాత్రమే ఓసీపీ మట్టిని వినియోగించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు.
ఇంటి అవసరాల కోసమంటేనే అనుమతి..
- జె.సూర్యదాస్, ప్రాజెక్ట్ అధికారి
ఇంటి అవసరాల కోసం మట్టి కావాలని కోరిన నిర్వాసితులకు మాత్రమే అనుమతి ఇస్తున్నాం. పక్కదారి పట్టిందని తెలిస్తే అనుమతులు రద్దు చేస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగేటట్లు వ్యవహరిస్తే చర్య తీసుకుంటాం.
మట్టి దందా
Published Sun, Dec 22 2013 2:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement