తూకివాకం–విప్పమానుపట్టెడ మార్గంలో అనధికారిక రీచ్‌ల వద్ద ఇసుక తరలింపు
రేణిగుంట మండలంలో ఇసుక మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా స్వర్ణముఖీ నదిలోని అనధికారిక రీచ్‌ల నుంచి ఇసుకను నిరాటంకంగా తరలిస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు పలుమార్లు దాడులు జరిపి కేసులు బనాయించినా మార్పు కనిపించడం లేదు. పంట పొలాల్లోనే ఇసుకను తోడేస్తున్నారు. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం నెలకొంది.
సాక్షి, రేణిగుంట : మండలంలోని స్వర్ణముఖీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఏర్పేడు దుర్ఘటన నేపథ్యంలో కొంతకాలం పాటు మెరుపుదాడులతో అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. అనంతం పర్యవేక్షణ లోపించడంతో మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రేణిగుంట మండలం కొట్రమంగళం, గాజులమండ్యం, వెంకటరెడ్డి కండ్రిగ, జీపాళెం, కొత్తపాళెం, జీవాగ్రం తదితర గ్రామాల నుంచి నిత్యం వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నాయి.
నకిలీ పర్మిట్లతో..
నకిలీ పర్మిట్లతో కొట్రమంగళం ప్రాంతం నుంచి నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుకను తిరుపతికి తరలించి సొమ్ముచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారులు అడపాదడప దాడులు నిర్వహిస్తున్నా వీరు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. అధికారికంగా ఇసుక రీచ్‌లు నడుస్తున్నా చాలా వరకు సరైన పర్మిట్లు లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపు జరుగుతోంది.
ఇసుక అక్రమ రవాణా అరికట్టే బాధ్యత వీరిది..
ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు అధికారిక రీచ్‌ల నుంచి ఇసుక తరలింపు పర్యవేక్షణకు మండలస్థాయి కమిటీ ఉంది. వీరిలో తహసీల్దార్‌తోపాటు, పోలీసు అధికారులు, ఎంపీడీఓ, గ్రామ రెవెన్యూ అధికారి, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు సభ్యులుగా ఉంటారు. అయితే క్షేత్రస్థాయిలో కేవలం రెవెన్యూ, పోలీసు అధికారులనే బాధ్యులను చేస్తున్న పరిస్థితి.
తరలింపు నిబంధనలివీ..
అధికారికంగా ప్రభుత్వం అనుమతించిన ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ప్రజా అవసరాల నిమిత్తం తరలించడానికి ట్రాక్టర్ యజమానులు కొన్ని నిబంధనలు పాటించాలి. అధికారిక రీచ్‌లలో అదనపు రేట్లు ప్రజా అవసరాల నిమిత్తం ప్రభుత్వం మండలంలో నాలుగు చోట్ల అధికారిక రీచ్‌లను ఏర్పాటు చేసింది. అయితే ఇసుకాసురులు ప్రభుత్వం విధించిన నియమాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరైన పర్మిట్లు లేకపోగా అధిక ధరలకు అమ్ముకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. అయితే అన్నీ తెలిసినా అధికారులు ఎందుకు మిన్నకుంటున్నారో అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇసుక అక్రమ రవాణాను నివారించండి
మండలంలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ పూర్వస్థితికి చేరింది. కొందరు నకిలీ పర్మిట్లు సృష్టించి ఇసుకను అనధికారికంగా తరలిస్తున్నారు. ఇసుకను ఉచితం చేసినా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు ట్రాక్టర్ల యజమానులు విక్రయించడం లేదు. రెవెన్యూ, పోలీసు అధికారులు నిఘా పెట్టాలి.
– ప్రభాకర్, రేణిగుంట
చర్యలు తీసుకుంటాం
ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఎవరైనా నా దృష్టికి తీసుకొస్తే పోలీసు అధికారుల సహకారంతో తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలు మార్లు దాడులు చేసి కేసులు పెట్టాం. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినా చర్యలు తప్పవు.
– నరసింహులునాయుడు, తహసీల్దార్, రేణిగుంట
Comments
Please login to add a commentAdd a comment