Swarnamukhi River
-
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ
-
స్వర్ణముఖి నది వద్ద సీఎం వైఎస్ జగన్ దృశ్యాలు
-
పెన్నా నది పరవళ్లు.. సువర్ణముఖి చిందులు
సాక్షి, రామగిరి(శ్రీ సత్యసాయి జిల్లా): ఎగువ ప్రాంతం కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నమ్మ పరవళ్లు తొక్కుతూ పేరూరు చేరింది. దీంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇప్పటి వరకూ ఒకటిన్నర టీఎంసీ దిగువకు వదిలినా పేరూరు డ్యాంకు ఇన్‌ఫ్లో ఏమాత్రం తగ్గలేదని, అందుకే నీటిని ఏకధాటిగా వదలుతున్నట్లు డీఈ వెంకటరమణ తెలిపారు. భారీ వర్షాలతో మూడు దశాబ్దాల తర్వాత పేరూరు డ్యాం నిండుకుండను తలపించగా... గత నెలలో తొలిసారి పేరూరు డ్యాం గేట్లు ఎత్తారు. తాజాగా సోమవారం మరోసారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండగా.. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పలు గ్రామాల ప్రజలు డ్యాం వద్దకు వస్తున్నారు. సువర్ణముఖి చిందులు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి మరువ పారిన చెరువులు అగళి: 20 రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు అగళి మండలంలోని మధూడి, ఇరిగేపల్లి, కోడిపల్లి, రావుడి, వడగుంటనపల్లి చెరువుల్లో చేరడంతో నాలుగు దశాబ్దాల తర్వాత అవన్నీ మరువ పారాయి. దీంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి మరువపారుతున్న ప్రాంతాల్లో జలకాలాటలు ఆడారు. (క్లిక్: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!) -
స్వర్ణముఖి నదిలో ముగ్గురు చిన్నారుల గల్లంతు
సాక్షి, తిరుపతి: స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గల్లంతవ్వగా, ఒకరిని స్థానికులు రక్షించారు. గల్లంతైన మరో ముగ్గురు ధోని(17), గణేష్(15), యుగంధర్(14) కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నికిత్ సాయి అనే బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. రేణిగుంట మండలం జీ పాలెం వద్ద ఘటన చోటుచేసుకుంది. హరిజనవాడకు చెందిన చిన్నారులుగా గుర్తించారు. చదవండి: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. చివరికి.. ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి ఆరా.. చిన్నారుల గల్లంతుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరా తీశారు. ఇంఛార్జ్ కలెక్టర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేతో మాట్లాడారు. గల్లంతయిన చిన్నారులను రక్షించేందుకు తక్షణం గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలని మంత్రి ఆదేశించారు. ఘటనపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. సంఘటన స్థలానికి చేరుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.. ముగ్గురు యువకులు గల్లంతు కావడం బాధాకరమన్నారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బలగాలు పిలిచామన్నారు. -
నివర్ తుఫాన్: 26 విమానాలు రద్దు..
సాక్షి, చెన్నై : నివర్ తీవ్ర తుఫాను ప్రభావంతో తమిళానాడు రాజధాని చెన్నైలో భారీ వర్షం కురిసింది. తుఫాను కారణంగా చెన్నై విమానాశ్రయంలో 26 విమానాలను రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఏటీఆర్ చిన్న విమానం, చెన్నై విమానాశ్రయంలోని టుటికోరిన్, ట్రిచీతోపాటు సేలంకు 12 విమానాలు ఇప్పటికే రద్దు చేశారు. మామల్లపురం చుట్టుపక్కల తీరప్రాంత ప్రజలు, ఫిషింగ్ ప్రాంత ప్రజల భద్రత కోసం అధికారులు ఎత్తైన మైదానాలు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఉపయోగించే పడవలు, ఫిషింగ్ నెట్స్ యంత్రాలను 30 మీటర్ల దూరంలో అధికారులు సురక్షితంగా ఉంచారు. తిరుపోరూర్లోని, తిరుక్కలుక్కున్ పరిసరాల్లోని ఉన్న 23 సరస్సులు, 23 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కోయంబత్తూరులో సముద్రంలో అయిదు అడుగుల ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయి. నిండుకుండను తలపిస్తున్న స్వర్ణముఖి నెల్లూరు : నెల్లూరు జిల్లా వాకాడులోని వైఎస్సార్ స్వర్ణముఖి బ్యారేజ్ నిండుకుండను తలపిస్తుంది. నివర్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వరద నీరు, తెలుగు గంగ నుంచి నీటిని విడుదల చేయడంతో స్వర్ణముఖి బ్యారేజ్ నిండుకుండను తలపిస్తుంది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. స్వర్ణముఖి నది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారేజి నీటితో స్వర్ణముఖి పరిధిలోని చెరువులు మొత్తం నిండాయని బ్యారేజ్ అధికారులు తెలిపారు. గతంలో బ్యారేజీ కుడికాలువకు గంగన్న పాలెం వద్ద తెగిపోవడంతో ఆ ప్రాంతం ముందస్తుగా కట్టకు మరమ్మతులు చేస్తున్నారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల భారీగా కురుస్తున్న వర్షాలతో సముద్రంలోకి వేటకి వచ్చిన 124 తమిళనాడు బోటులు పొర్టులో పార్కింగ్ చేశారు. (నివర్ ఎఫెక్ట్: ఏపీలో కుండపోత వర్షాలు) -
సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ అందుకే అలస్యం
-
ముదిరిన భూ వివాదం
స్వర్ణముఖి నదీ పోరంబోకు భూ ఆక్రమణ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. అమాయకులకు మాయమాటలు చెప్పి స్థలాలు అమ్మేసిన అధికార పార్టీ నాయకులు మరో పన్నాగం పన్నారు. మామూళ్లు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారని పుకార్లులేపారు. బాధితులను ఆందోళనకు దిగమని చెప్పారు. అధికారులను అడ్డుకోమన్నారు. రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేయమని ఉసిగొల్పారు. మళ్లీ వారి మాటలు నమ్మిన బాధితుల్లో కొందరు ఒకడుగు ముందుకేసి అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలకు సూత్రధారులుగా భావించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద మంగళవారం కూడా స్వర్ణముఖి నదీ పోరంబోకు భూముల్లో ఉద్రిక్తత నెలకొంది. సాక్షి, చిత్తూరు, తిరుపతి: స్వర్ణముఖి నదీ పోరంబోకు భూముల్లో ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు అధికార పార్టీకి చెందిన భూరాబందులు కొత్త ఎత్తుగడ వేశాయి. ఇళ్లు కోల్పోయిన బాధితులను రెవెన్యూ అధికారులపైకి రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పాయి. తిరుపతి రూరల్ మండలం అవిలాల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 360లో 178 ఎకరాల స్వర్ణముఖి నదీ పోరంబోకు భూమిని కొందరు ఆక్రమించారు. ప్లాట్లుగా మార్చిదలకు అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఇదే విషయమై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సబ్‌కలెక్టర్ మహేష్‌కుమార్ స్పందించడం.. రెవెన్యూ అధికారులు సోమవారం జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. మళ్లీ మంగళవారం అధికారులు వస్తారని భావించిన భూకబ్జాదారులు అమాయకులైన బాధితులను రెచ్చగొట్టారు. నిర్మాణాల సమయంలో కొందరు అధికారులు మామూళ్లు తీసుకుని, తిరిగి తొలగించే సమయంలో వారే ఉన్నారని చెప్పారు. అమాయక ప్రజలు అక్రమార్కుల కుట్రలను పసిగట్టలేకపోయారు. వారి మాటలు విని మంగళవారం రెవెన్యూ అధికారులను నిలదీశారు. కొందరు అధికారులపై దాడులకు దిగారు. ఈ దాడిలో వీఆర్ఏ రమణ తలకు తీవ్ర గాయమైంది. ఆయనను ఆస్పత్రికి తరలించారు. దీంతో రెవెన్యూ అధికారులు దాడిచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా వినాయక నగర్ వాసులు కొందరు మంగళవారం సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారులను నిలదీశారు. ప్రస్తుతం తాము ఎక్కడికి వెళ్లాలని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మించుకున్న నివాసాలకు విద్యుత్, నీటి సరఫరా, ఇంటిపన్ను,ఆధార్, ఓటరు కార్డులు ఉన్నాయని తెలియజేశారు. ఇన్నాళ్లు గుర్తించని ఆక్రమణలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా? అంటూ ప్రశ్నించారు. సబ్ కలెక్టర్ తక్షణం స్పందించి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఎవరి నుంచి కొనుగోలు చేశారు? నదీ పోరంబోకు భూమిని ఎవరి నుంచి కొనుగోలు చేశారు? వారి వివరాలు చెప్పాలని రెవెన్యూ అధికారులు వినాయక నగర్ వాసులను అడిగారు. వారి వివరాలు తెలియజేస్తే.. బాధితులకు తిరిగి సొమ్ము ఇప్పిస్తామని, నివాసాలు కోల్పోయిన అర్హులకు ప్రభుత్వ పథకాల ద్వారా నివాసాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అయితే వారి వివరాలు చెప్పేందుకు బాధితులు నిరాకరించి వెనుదిరిగారు. ముగ్గురిపై కేసు నమోదు స్థలాన్ని పేదలకు అక్రమంగా సొమ్ము చేసుకున్న దుర్మార్గులు స్థానికులను బెదిరించి రెచ్చగొట్టారని, దాడికి ఉసిగొల్పారని వీఆర్ఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తిరుచానూరు స్టేషన్‌కు తరలించి కేసు నమోదుచేసి విచారిస్తున్నారు. -
అక్రమాలకు అడ్డేది?
సాక్షి, తిరుపతి: తిరుపతి పరిసర ప్రాంతాల్లో అక్రమార్కులకు అడ్డే లేకుండా పోతోంది. భూబకాసురులు స్వర్ణముఖి నదిని రోజురోజుకు కొద్దికొద్దిగా ఆక్రమించి అమ్ముకుంటున్నా అధికారులు చూస్తుండిపోతున్నారు. విషయం తెలిసి వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించిన అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకురావడంతో వారు వెనుకడుగు వేసినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి రూరల్, తిరుచానూరు పరిధిలోని స్వర్ణముఖి నది పోరంబోకు భూములున్నాయి. అందులో సర్వే నంబర్ 360లో 178 ఎకరాలు ఉంది. ఈ భూమిని 2012 నుంచి ఆక్రమించడం ప్రారంభించారు. ఆ సమయంలో రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రారంభించిన ఆక్రమణలు ఈ ఐదేళ్ల కాలం నదిని దాదాపు పూర్తిగా ఆక్రమించేశారు. జేసీబీలు, టిప్పర్లతో కొంతకొంతగా పూడ్చుకుంటూ వస్తున్నారు. బరితెగించిన టీడీపీ నేతలు స్వర్ణముఖి నది స్థలంలో నాడు 50 నివాసాలు అక్రమంగా నిర్మిస్తే ప్రస్తుతం సుమారు 300కు పైగా నిర్మాణాలు వెలిశాయి. ఈ ఆక్రమణలను ఎప్పటికప్పుడు ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొస్తున్నా రెవెన్యూలో పనిచేసే ఇద్దరు అధికారుల సహకారంతో ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్నికల హడావుడిలో ఉండగా టీడీపీ నేతలు మరింతగా రెచ్చిపోయారు. నదిని దాదాపు పూర్తిగా పూడ్చివేశారు. అందులో రాత్రికి రాత్రే తాత్కాలిక షెడ్లు నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని నాలుగు రోజుల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్ స్వర్ణముఖి నది ప్రాంతంలో పర్యటించారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ఆ ప్రాంతంలో స్వర్ణముఖి నది పోరంబోకు భూమి అని బోర్డు కూడా ఏర్పాటుచేయించారు. స్థానిక నాయకుడే కీలకం స్వర్ణముఖి నది పోరంబోకు భూముల్లో స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్న ఓ నాయకుడు ఈ ఆక్రమణలకు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇతను స్వర్ణముఖి నదిని అమ్మడం ద్వారా సుమారు రూ.30 కోట్లకు పడగలెత్తినట్లు తెలిసింది. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో దామలచెరువు వద్ద విలువైన భూములను కొనుగోలు చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇక్కడ ఆదాయం రుచిమరిగిన ఓ రెవెన్యూ అధికారి తిరిగి ఇదే ప్రాంతానికి బదిలీపై వచ్చారు. ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు చోటా నాయకుల కారణంగానే స్వర్ణముఖి నది పూర్తిగా ఆక్రమణకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఆక్రమణలపై ఎవరైనా వచ్చి అడిగితే.. వారికీ రెండు ప్లాట్లు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి నోరెత్తకుండా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోతే స్వర్ణముఖి నది కనుమరుగవ్వక తప్పదని స్థానికంగా ఉన్న పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. పట్టించుకోని అధికారులు నదిలో ఎటువంటి ఆక్రమణలు జరగడానికి వీల్లేదని సబ్ కలెక్టర్ హెచ్చరించారు. రెవెన్యూ అధికా రులను అప్రమత్తం చేశారు. స్వర్ణముఖి నదిలో ఆక్రమణాలు జరిగితే వెంటనే సమాచారం ఇవ్వమని ఆదేశించారు. ఇద్దరు రెవెన్యూ అధికారులు టీడీపీ నేతలకు తొత్తులుగా మారిపోయారు. యథావిధిగా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు. అందుకు టీడీపీ నాయకుల ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. నదిని ఆక్రమించి అమ్ముకుంటున్నా చూసీ చూడనట్లు ఉండమని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆ ఇద్దరు అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. దీంతో ప్రతిరోజూ స్వర్ణముఖి నదిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. -
ఆగని ఇసుక దందా
రేణిగుంట మండలంలో ఇసుక మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా స్వర్ణముఖీ నదిలోని అనధికారిక రీచ్‌ల నుంచి ఇసుకను నిరాటంకంగా తరలిస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు పలుమార్లు దాడులు జరిపి కేసులు బనాయించినా మార్పు కనిపించడం లేదు. పంట పొలాల్లోనే ఇసుకను తోడేస్తున్నారు. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం నెలకొంది. సాక్షి, రేణిగుంట : మండలంలోని స్వర్ణముఖీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఏర్పేడు దుర్ఘటన నేపథ్యంలో కొంతకాలం పాటు మెరుపుదాడులతో అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. అనంతం పర్యవేక్షణ లోపించడంతో మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రేణిగుంట మండలం కొట్రమంగళం, గాజులమండ్యం, వెంకటరెడ్డి కండ్రిగ, జీపాళెం, కొత్తపాళెం, జీవాగ్రం తదితర గ్రామాల నుంచి నిత్యం వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నాయి. నకిలీ పర్మిట్లతో.. నకిలీ పర్మిట్లతో కొట్రమంగళం ప్రాంతం నుంచి నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుకను తిరుపతికి తరలించి సొమ్ముచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారులు అడపాదడప దాడులు నిర్వహిస్తున్నా వీరు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. అధికారికంగా ఇసుక రీచ్‌లు నడుస్తున్నా చాలా వరకు సరైన పర్మిట్లు లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపు జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా అరికట్టే బాధ్యత వీరిది.. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు అధికారిక రీచ్‌ల నుంచి ఇసుక తరలింపు పర్యవేక్షణకు మండలస్థాయి కమిటీ ఉంది. వీరిలో తహసీల్దార్‌తోపాటు, పోలీసు అధికారులు, ఎంపీడీఓ, గ్రామ రెవెన్యూ అధికారి, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు సభ్యులుగా ఉంటారు. అయితే క్షేత్రస్థాయిలో కేవలం రెవెన్యూ, పోలీసు అధికారులనే బాధ్యులను చేస్తున్న పరిస్థితి. తరలింపు నిబంధనలివీ.. అధికారికంగా ప్రభుత్వం అనుమతించిన ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ప్రజా అవసరాల నిమిత్తం తరలించడానికి ట్రాక్టర్ యజమానులు కొన్ని నిబంధనలు పాటించాలి. అధికారిక రీచ్‌లలో అదనపు రేట్లు ప్రజా అవసరాల నిమిత్తం ప్రభుత్వం మండలంలో నాలుగు చోట్ల అధికారిక రీచ్‌లను ఏర్పాటు చేసింది. అయితే ఇసుకాసురులు ప్రభుత్వం విధించిన నియమాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరైన పర్మిట్లు లేకపోగా అధిక ధరలకు అమ్ముకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. అయితే అన్నీ తెలిసినా అధికారులు ఎందుకు మిన్నకుంటున్నారో అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను నివారించండి మండలంలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ పూర్వస్థితికి చేరింది. కొందరు నకిలీ పర్మిట్లు సృష్టించి ఇసుకను అనధికారికంగా తరలిస్తున్నారు. ఇసుకను ఉచితం చేసినా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు ట్రాక్టర్ల యజమానులు విక్రయించడం లేదు. రెవెన్యూ, పోలీసు అధికారులు నిఘా పెట్టాలి. – ప్రభాకర్, రేణిగుంట చర్యలు తీసుకుంటాం ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఎవరైనా నా దృష్టికి తీసుకొస్తే పోలీసు అధికారుల సహకారంతో తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలు మార్లు దాడులు చేసి కేసులు పెట్టాం. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినా చర్యలు తప్పవు. – నరసింహులునాయుడు, తహసీల్దార్, రేణిగుంట -
స్వర్ణముఖినదిలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
నాయుడుపేటటౌన్: స్వర్ణముఖినదిలో నీటి ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లి.. ఇసుక కోసం తవ్విన భారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడునగర్, బేరిపేట, కుమ్మరివీధికి చెందిన మూడో తరగతి విద్యార్థిని తుమ్మూరు మల్లీశ్వరి(8), రెండో తరగతి చదువుతున్న కలపాటి విలియమ్ అగస్టస్ అలియాస్ జాకా (7)తోపాటు అదే ప్రాంతానికి చెందిన వారి స్నేహితులు మన్విత, దాదాఖలందర్ మరో బాలుడితో కలిసి స్వర్ణముఖినది వద్దకు వెళ్లారు. నదిలో కొద్దిమేరకు నీరు ప్రవహిస్తుండటంతో ఐదుగురు కలిసి నదిలో నడిచి కొద్దిదూరం వెళ్లారు. రెవెన్యూ కార్యాలయం సమీపంలో స్వర్ణముఖి నదిలో భారీగా ఇసుక తవ్వకాలు చేపట్టిన తర్వాత పెద్ద గుంత ఏర్పడి ఉండటంతో అందులో పడిపోయారు. వీరిలో ఇద్దరు పిల్లలు బయటపడి అక్కడి నుంచి పరుగులు పెట్టి వెళ్లిపోయారు. ముగ్గురు నీటి గుంతలో మునిగిపోతూ పెద్దఎత్తున కేకలు పెట్టారు. దీంతో సమీపంలో ఓ చోట కూర్చొని ఉన్న యువకులు గమనించి మన్విత అనే బాలికను కాపాడారు. మరో ఇద్దరు చిన్నారులు మల్లీశ్వరి (8), విలియమ్ అగస్టస్ (7)గుంతలో మునిగి మృతిచెందారు.అనుకోని విషాదాన్ని నింపిన ఈ సంఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈసమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. -
స్వర్ణముఖి నదిలో బాలుడి గల్లంతు
తిరుచానూరు (చిత్తూరు జిల్లా) : తిరుచానూరు మండలం యోగిమల్లవరం గ్రామం వద్ద స్వర్ణముఖి నదిలో సోమవారం ఓ బాలుడు గల్లంతయ్యాడు. యోగిమల్లవరం గ్రామానికి చెందిన బాలాజీ(13) అనే ఎనిమిదవ తరగతి విద్యార్థి స్కూల్ ఇంటర్వెల్ సమయంలో గ్రామానికి పక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ జారిపడి మునిగిపోయాడు. బాలుడి కోసం అధికారులు, గ్రామస్తులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
స్వర్ణముఖికి పెరిగిన వరద ఉధృతి
-
స్వర్ణముఖికి పెరిగిన వరద ఉధృతి
నెల్లూరు : భారీ వర్షాలు నేపథ్యంలో స్వర్ణముఖి నదికి బుధవారం వరద ఉధృతి పెరిగింది. జిల్లాలోని నాయుడుపేటలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్యలు తడ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు. అయితే భారీ వర్షాల కారణంగా పెళ్లకూరు మండలంలోని 7 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సదరు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అతి భారీ వర్షాలు - స్తంభించిన జనజీవనం
చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తుపాన్ ప్రభావం కావలి వద్ద 20 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం ఉప్పొంగుతున్న స్వర్ణముఖీ నది పలు చెరువులకు గండ్లు, తమిళనాడుకు వస్తున్న పలు రైళ్లు ఆలస్యం చిత్తూరు : వాయుగుండం ప్రభావంతో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాల్లోని చెరువులు గండ్లు పడ్డాయి. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల ధాటికి రహదార్లు కొట్టుకుపోవడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. అలాగే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సముద్రం ముందుకు దూసుకువచ్చింది. కడప జిల్లా రైల్వే కోడూరులో 22.4 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. రాజంపేటలోని చక్రాలమడుగుకు గండిపడటంతో జాతీయ రహదారిపైకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. వరద నీటిలో నలుగురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. అలాగే రెండు జేసీబీలు, మూడు ట్రాక్టర్లు ప్రవాహా ఉధృతికి కొట్టుకుపోయాయి. భారీ వరద నీరు రావడంతో తుండుపల్లిలో ఆదినారాయణరెడ్డి కుంచా ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లు తెరిచారు. చిత్తూరు జిల్లాలో సోమలలో పలు చెరువులకు గండిపడ్డాయి. కొండచరియలు విరిగిపడి తిరుమల రెండో ఘాట్ రోడ్డుపై రాకపోకలు స్థంభించాయి. స్వర్ణముఖి నది ఉధృత ప్రవాహానికి ఓ కారు కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు ఆకాశగంగ నిండింది. మరో నాలుగు మీటర్లు వరద పెరిగితే గోగర్భం జలాశయం గేట్లు ఎత్తివేయ్యాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నెల్లూరు జిల్లా కావలిలో 20 మీటర్ల మీర సముద్రం ముందుకు వచ్చింది. ప్రకాశం జిల్లాలో చిన్నగంజాం పల్లెపాలెం వద్ద సముద్రం ఐదు మీటర్లు ముందుకు వచ్చింది. రానున్న 24గంటల్లో భారీ అతి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. తమిళనాడు నుంచి ఏపీకి వస్తున్న పలు రైళ్లు ఆలస్యంగా నడస్తున్నాయి. -
ఏటి పండగ సంబరాలు షురూ..
స్వర్ణముఖిలోకి తరలివస్తున్న జనం నాయుడుపేట టౌన్: సంక్రాంతి సంబరాల్లో కీలకమైన ఏటి పండగ సంబరాలు నాయుడుపేటలో స్వర్ణముఖి నది ఒడ్డున శుక్రవారం నుంచి ప్రారంభమయ్యూరుు. నగర పంచాయతీ చైర్పర్సన్ మైలారి శోభారాణి, మాజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నయ్య, నాయకులు శిరసనంబేటి విజయభాస్కర్‌రెడ్డి, గూడూరు రఘునాథరెడ్డి, కౌన్సిలర్లు తదితరులు హాజరై భారీ బెలూన్ను ఆవిష్కరించారు. నాయుడుపేట వాసులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్దసంఖ్యలో నది వద్దకు చేరుకుని సందడి చేస్తున్నారు. చిన్ననాటి స్నేహితులు, కొత్తగా పెళ్లైన వారు కుటుంబసభ్యులతో కలిసి ఏటి వద్దకు చేరుకుని వివిధ రకాల ఆటలతో ఆనందంగా గడుపుతున్నారు. ముస్లింలు సైతం తరలివచ్చి మతసామరస్యాన్ని చాటుతున్నారు. నదిలో స్వల్పంగా నీటి ప్రవాహం ఉండటంతో పలువురు ఈత కొడుతున్నారు. మరోవైపు మహిళలు గొబ్బెమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. జాయింట్విల్, కొలంబస్ తదితర రంగులరాట్నాలు చిన్నారులు, యువత, మహిళలను విశేషంగా ఆకర్షిస్తున్నారుు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగర పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. మంచినీటి ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. శని, ఆదివారాల్లోనూ పండగ సందడి కొనసాగనుంది.