సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న వినాయక నగర్ వాసులు
స్వర్ణముఖి నదీ పోరంబోకు భూ ఆక్రమణ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. అమాయకులకు మాయమాటలు చెప్పి స్థలాలు అమ్మేసిన అధికార పార్టీ నాయకులు మరో పన్నాగం పన్నారు. మామూళ్లు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారని పుకార్లులేపారు. బాధితులను ఆందోళనకు దిగమని చెప్పారు. అధికారులను అడ్డుకోమన్నారు. రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేయమని ఉసిగొల్పారు. మళ్లీ వారి మాటలు నమ్మిన బాధితుల్లో కొందరు ఒకడుగు ముందుకేసి అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలకు సూత్రధారులుగా భావించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద మంగళవారం కూడా స్వర్ణముఖి నదీ పోరంబోకు భూముల్లో ఉద్రిక్తత నెలకొంది.
సాక్షి, చిత్తూరు, తిరుపతి: స్వర్ణముఖి నదీ పోరంబోకు భూముల్లో ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు అధికార పార్టీకి చెందిన భూరాబందులు కొత్త ఎత్తుగడ వేశాయి. ఇళ్లు కోల్పోయిన బాధితులను రెవెన్యూ అధికారులపైకి రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పాయి. తిరుపతి రూరల్ మండలం అవిలాల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 360లో 178 ఎకరాల స్వర్ణముఖి నదీ పోరంబోకు భూమిని కొందరు ఆక్రమించారు. ప్లాట్లుగా మార్చిదలకు అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఇదే విషయమై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సబ్‌కలెక్టర్ మహేష్‌కుమార్ స్పందించడం.. రెవెన్యూ అధికారులు సోమవారం జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. మళ్లీ మంగళవారం అధికారులు వస్తారని భావించిన భూకబ్జాదారులు అమాయకులైన బాధితులను రెచ్చగొట్టారు. నిర్మాణాల సమయంలో కొందరు అధికారులు మామూళ్లు తీసుకుని, తిరిగి తొలగించే సమయంలో వారే ఉన్నారని చెప్పారు.
అమాయక ప్రజలు అక్రమార్కుల కుట్రలను పసిగట్టలేకపోయారు. వారి మాటలు విని మంగళవారం రెవెన్యూ అధికారులను నిలదీశారు. కొందరు అధికారులపై దాడులకు దిగారు. ఈ దాడిలో వీఆర్‌ఏ రమణ తలకు తీవ్ర గాయమైంది. ఆయనను ఆస్పత్రికి తరలించారు. దీంతో రెవెన్యూ అధికారులు దాడిచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా వినాయక నగర్ వాసులు కొందరు మంగళవారం సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారులను నిలదీశారు. ప్రస్తుతం తాము ఎక్కడికి వెళ్లాలని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మించుకున్న నివాసాలకు విద్యుత్, నీటి సరఫరా, ఇంటిపన్ను,ఆధార్, ఓటరు కార్డులు ఉన్నాయని తెలియజేశారు. ఇన్నాళ్లు గుర్తించని ఆక్రమణలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా? అంటూ ప్రశ్నించారు. సబ్ కలెక్టర్ తక్షణం స్పందించి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.
ఎవరి నుంచి కొనుగోలు చేశారు?
నదీ పోరంబోకు భూమిని ఎవరి నుంచి కొనుగోలు చేశారు? వారి వివరాలు చెప్పాలని రెవెన్యూ అధికారులు వినాయక నగర్ వాసులను అడిగారు. వారి వివరాలు తెలియజేస్తే.. బాధితులకు తిరిగి సొమ్ము ఇప్పిస్తామని, నివాసాలు కోల్పోయిన అర్హులకు ప్రభుత్వ పథకాల ద్వారా నివాసాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అయితే వారి వివరాలు చెప్పేందుకు బాధితులు నిరాకరించి వెనుదిరిగారు.
ముగ్గురిపై కేసు నమోదు
స్థలాన్ని పేదలకు అక్రమంగా సొమ్ము చేసుకున్న దుర్మార్గులు స్థానికులను బెదిరించి రెచ్చగొట్టారని, దాడికి ఉసిగొల్పారని వీఆర్‌ఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తిరుచానూరు స్టేషన్‌కు తరలించి కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment