ఏటి పండగ సంబరాలు షురూ..
స్వర్ణముఖిలోకి తరలివస్తున్న జనం
నాయుడుపేట టౌన్: సంక్రాంతి సంబరాల్లో కీలకమైన ఏటి పండగ సంబరాలు నాయుడుపేటలో స్వర్ణముఖి నది ఒడ్డున శుక్రవారం నుంచి ప్రారంభమయ్యూరుు. నగర పంచాయతీ చైర్‌పర్సన్ మైలారి శోభారాణి, మాజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నయ్య, నాయకులు శిరసనంబేటి విజయభాస్కర్‌రెడ్డి, గూడూరు రఘునాథరెడ్డి, కౌన్సిలర్లు తదితరులు హాజరై భారీ బెలూన్‌ను ఆవిష్కరించారు. నాయుడుపేట వాసులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్దసంఖ్యలో నది వద్దకు చేరుకుని సందడి చేస్తున్నారు.
చిన్ననాటి స్నేహితులు, కొత్తగా పెళ్లైన వారు కుటుంబసభ్యులతో కలిసి ఏటి వద్దకు చేరుకుని వివిధ రకాల ఆటలతో ఆనందంగా గడుపుతున్నారు. ముస్లింలు సైతం తరలివచ్చి మతసామరస్యాన్ని చాటుతున్నారు. నదిలో స్వల్పంగా నీటి ప్రవాహం ఉండటంతో పలువురు ఈత కొడుతున్నారు. మరోవైపు మహిళలు గొబ్బెమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు.
జాయింట్‌విల్, కొలంబస్ తదితర రంగులరాట్నాలు చిన్నారులు, యువత, మహిళలను విశేషంగా ఆకర్షిస్తున్నారుు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగర పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. మంచినీటి ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. శని, ఆదివారాల్లోనూ పండగ సందడి కొనసాగనుంది.