శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: ముచ్చింతల్, పెద్దతూప్ర గ్రామాల శివారులో ఎగువ భాగంలోని వరదనీటిని పాల్మాకుల చెరువులోకి చేరవేసే రెండు వాగులు అన్యాక్రాంతమయ్యాయి. కొన్నేళ్లుగా ఈ వాగుల్లో చేపడుతున్న ఇసుక తవ్వకాలు, ఫిల్టర్ ఇసుక తయారీతో సాగునీటి వనరులు దెబ్బతినే పరిస్థితి తలెత్తింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు కట్ట తెగి వరదంతా సమీప పొలాలను ముంచెత్తింది. పెద్దతూప్ర శివారులో ఉన్న ఎల్లంబాయి వాగులోకి మహేశ్వరం మండలం కల్వకోల్, చిన్నతూప్ర వైపు నుంచి వరదనీరు వస్తోంది. ఎంకమ్మగూడెం, అమీర్‌పేట్ వైపు నుంచి వరద నీరు ముచ్చింతల్ వాగులోకి చేరుతోంది. ఈ రెండు వాగులు ముచ్చింతల్ సమీపంలో కలిసి అక్కడి నుంచి పాల్మాకుల చెరువులోకి వరదనీరు వెళ్తుంది. ఎంకమ్మగూడెం, ముచ్చింతల్ వాగులను అనుసరించి ఉన్న పొలాలను కొందరు అక్రమార్కులు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. వాల్టా చట్టానికి తూడ్లు పొడుస్తూ యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో సాగునీటి వనరులు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జోరుగా ఇసుక ఫిల్టర్లు..
రెండు వాగులను అనుసరించి ఉన్న పొలాల వద్ద ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసి పొలాలను అక్రమార్కులు తవ్వేస్తున్నారు. వానాకాలంలో కురిసిన వర్షాలతో కొన్ని రోజులు ఇసుక తవ్వకాలకు అడ్డంకిగా మారినా.. ఇటీవల ఫిల్టరు ఇసుక తయారీ జోరందుకుంది. రాత్రి వేళల్లో ఫిల్టర్ ఇసుక తయారు చేస్తూ లారీల్లో రవాణా చేస్తున్నారు. ఇసుకకు స్థానికంగా డిమాండ్ ఉండడంతో అక్రమార్కుల వ్యాపారం మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలుగా వర్ధిల్లుతోంది. ఇసుక తవ్వకాలు, ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. వాగు సమీపంలోని మట్టిని నీటితో వడపోసి ఇసుకను తీస్తున్నారు. ఇందుకోసం వాగులోని నీళ్లను, ఉచిత కరెంటును వినియోగిస్తున్నారు. మట్టి, ఇసుక తవ్వకాల కోసం ఏకంగా జేసీబీలను వినియోగిస్తున్నారంటే ఎంతగా బరి తెగిస్తున్నారో అవగతమవుతుంది. మరో వైపు వాగులపై ఏర్పాటు చేసిన చెక్‌డ్యాంలను కూల్చివేయడం గమనార్హం.
వాగు మార్గమే మారింది..
ఇసుక తవ్వకాలతో ఎల్లంబాయి వాగు మార్గమే మారిపోయింది. వాగు పక్కన భారీ గోతులు తీసి మట్టి, ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదనీరు రావడంతో వాగు కట్ట తెగిపోయింది. దీంతో వరదనీటి ప్రవాహ మార్గం మారి నీరంతా పొలాల్లోంచి పాల్మాకుల చెరువులోకి చేరింది. సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ చూసినా భారీ గోతులు కనిపిస్తున్నాయి. ముచ్చింతల్, ఎల్లంబాయి వాగులు అనుసంధానమయ్యే చోట వాగు విస్తీర్ణం కుంచించుకుపోవడమే కాకుండా వాగును మట్టితో పూడ్చివేశారు. దీంతో వరదనీటి ప్రవాహ మార్గం మారి పొలాలు దెబ్బతింటున్నాయి. మరో వైపు పొలాల్లో తవ్వకాలు చేపట్టడంతో ఏళ్ల నాటి చెట్లు, వృక్షాలు నేలకొరిగిపోతున్నాయి. తవ్వకాలలో ఏర్పడిన భారీ గుంతలు ప్రమాదకరంగా మారాయి. వాగుల పరిసరాల్లో సంచరించడానికి వీలులేనంతగా గుంతలు ఏర్పడ్డాయి. అక్రమార్కులు ఇంతలా రెచ్చిపోతున్నా సంబంధిత అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లైనా లేకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుచిక్కని విషయం.
సెలయేర్లలో ఇసుకాసురులు!
Published Fri, Jan 10 2014 3:21 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement