హరిదాసుల సంకీర్తనలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. ముంగిట రంగవల్లులు..గొబ్బెమ్మలు..ఎడ్ల బండ్ల పందేలు..పిండివంటల ఘుమఘుమలు..కొత్త అల్లుళ్లకు మర్యాదలు, మరదళ్ల సరదాలతో పల్లె సంక్రాంతి శోభ సంతరించుకుంది. జిల్లాలోని అనేక పల్లెల్లో ఇలాంటి దృశ్యాలతో కోలాహల వాతావరణం నెలకొంది. భోగి, సంక్రాంతి, కనుమ పండగలను ఘనంగా జరుపుకునేందుకు అందరూ సిద్ధమయ్యారు. ఎక్కడ చూసినా ప్రజలు పండగ ఏర్పాట్లలో మునిగితేలే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచే జిల్లాలో పలుచోట్ల భోగిమంటలు వేశారు.
నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్ : హిందువుల పెద్ద పండగైన సంక్రాంతిని పురస్కరించుకుని జిల్లాలోని పట్టణాలు, పల్లెలు కొత్తకళను సంతరించుకున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపార రీత్యా స్థిరపడిన వారందరూ పండగ సందర్భంగా సొంతూరికి చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారితో పల్లెలు కళకళలాడుతున్నాయి. కొత్తఅల్లుళ్లను ఆహ్వానించి సకల మర్యాదలు చేయడంలో అత్తామామలు, బావలను ఆటపట్టించడంలో మరదళ్లు నిమగ్నమయ్యారు.
యువతులు ఇళ్ల ముందు పోటీలు పడి మరీ అందమైన రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. చిన్నారులు గాలిపటాలు ఎగరవేయడంతో పాటు స్నేహితులతో కలిసి వివిధ ఆటపాటలతో గడుపుతున్నారు. మరోవైపు కోడి పందేలు, ఎడ్లబండ్లు, పడవల పోటీలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలుచోట్ల ఈ పందేలు జోరుగా జరుగుతున్నాయి. పోలీసులు ఆంక్షలు విధించినా పల్లెల్లో చెరువుగట్లపైనా, పొలాల్లోని పొదల చాటున కోడిపందేలు నిర్వహిస్తున్నారు. కనుమ పండగ నాడు కోవూరులో భారీ ఎత్తున ఎడ్లబండ్ల పోటీల నిర్వహణకు రంగం సిద్ధమైంది.
పట్టణాల్లో సర్వం సిద్ధం
సంక్రాంతి సంబరాలకు పట్టణాలు సిద్ధమయ్యాయి. నెల్లూరులోని పలు ప్రాంతాలు ఇప్పటికే కళకళలాడుతున్నాయి. ముంగిట ముందు రంగవల్లులు తీర్చిదిద్దడంలో యువతులు ఆసక్తి చూపుతున్నారు. భోగిమంటలు వేసేందుకు వీలుగా వివిద కూడళ్లలో తాటాకుల విక్రయం జోరుగా సాగుతోంది. వంటకాల కోసం సామాన్ల కొనుగోలు చేసే వారితో చిన్నబజారు, స్టోన్‌హౌస్‌పేట, పప్పులవీధి తదితర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. దుస్తులు కొనుగోలు చేసే వారితో వస్త్ర దుకాణాలు కిక్కిరిస్తున్నాయి.
పల్లెల్లో ఘుమఘుమలు
నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్ : పల్లెల్లో ఎక్కడ చూసినా పిండి వంటలు ఘుమఘుమలాడుతున్నాయి. రెండు..మూడిళ్ల వారు ఓచోట కూర్చుని నిప్పట్లు(అరిసెలు), లడ్డూలు, కొబ్బరివడలు, ఉప్పు చక్కలు, మనుబూలు తదితర వంటకాల తయారీలో నిమగ్నమై కనిపిస్తున్నారు. ఇంటిల్లిపాది కూర్చుని నిప్పట్లు తయారుచేసుకుంటున్నారు. గతంలో నిప్పట్ల కోసం బియ్యాన్ని రోకళ్లతో దంచేవారు. ఇప్పుడు పిండి దంచేందుకు కూలీలు కరువవడంతో మిల్లులపై ఆధారపడుతున్నారు.
పట్టణాల్లో రెడీమేడ్ వంటలు
పల్లెల్లో తప్ప చాలా చోట్ల పొయ్యిలు వెలగడం లేదు. పిండివంటలన్నీ రెడీమేడ్ అయిపోయాయి. నెల్లూరులో ప్రత్యేకించి పండగల సమయంలో పిండి వంటల కోసం దుకాణాలు వెలిశాయి. ఇప్పటికే ఉన్న స్వీట్ల దుకాణాల్లో పిండివంటలన్నీ అందుబాటులో ఉంటున్నాయి. కొందరు ఇళ్లలో తయారు చేసి ఆర్డర్ల మీద సరఫరా చేస్తున్నారు. స్టోన్‌హౌస్‌పేట, సాలివీధి, బంగ్లావీధి ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి కన్పిస్తున్నాయి. కొన్నింటిని పీసుల లెక్కన, మరి కొన్నింటిని కిలోల ప్రాతిపదికన విక్రయిస్తున్నారు. అరిసెలు కిలో రూ. 120, కజ్జికాయ ఒకటి రూ.7, లడ్డు కిలో రూ.120, కొబ్బరివడ కిలో రూ.120, మురుకులు, పప్పుచెక్కలు రూ.140 విక్రయిస్తున్నారు.
ఆర్డర్లతో బిజీ..బిజీ
శ్రీనివాసులు, పిండి వంటల విక్రయదారుడు
సంక్రాంతి పండగ వచ్చిందంటే బిజీ బిజీగా గడపాల్సి వస్తోంది. డిసెంబర్ నుంచే పిండివంటలకు ఆర్డర్లపై ఆర్డర్లు వస్తున్నాయి. కిలోల లెక్కన ఆర్డర్లపై అమ్మకాలు జరుపుతున్నాం. గిరాకీ బాగానే ఉంటోంది. ఎక్కువ ఆర్డర్లు తీసుకుంటే అమ్మకాలు జరపలేకున్నాం. పిండివంటలు కావాల్సిన వారు 92916 63858 నంబరులో సంప్రదించవచ్చు.
సమయం సరిపోవడం లేదు
కిషోర్, మౌనిక, స్టోన్‌హౌస్‌పేట
చిన్నతనం నుంచి మా ఇంట్లో అమ్మానాన్న, బంధువులు అందరం కలిసి పిండివంటలు చేసుకునేవాళ్లం. ప్రస్తుతం మేం ఉద్యోగరీత్యా నెల్లూరులో ఉండాల్సి వస్తోంది. దీంతో సమయం సరిపోవడం లేదు. అందుకే రెడీమేడ్‌గా దొరికే పిండి వంటలను కొనుగోలు చేశాం.
దుస్తులు సైతం రెడీమేడ్
పండగ రోజులు వచ్చాయంటే పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు దర్జీలు బిజీబిజీగా ఉండేవారు. ప్రస్తుత రోజుల్లో రెడీమేడ్ దుస్తులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గుడ్డ కొనడం, దాన్ని కుట్టించడం, రోజుల పాటు దర్జీల చుట్టూ తిరగడం వంటిని పక్కన పెడుతున్నారు. ఈ క్రమంలో రెడీమేడ్ వస్త్ర దుకాణాలు జనంతో కిటకిటలాడుతున్నాయి.
సంక్రాంతి సందడి
Published Mon, Jan 13 2014 4:17 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement