పల్లె వాకిట పెద్ద పండుగ | sankranti festival in srikakulam | Sakshi
Sakshi News home page

పల్లె వాకిట పెద్ద పండుగ

Published Mon, Jan 13 2014 2:50 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

పల్లె వాకిట పెద్ద పండుగ - Sakshi

పల్లె వాకిట పెద్ద పండుగ

 భారతదేశంలో హరప్పా, మహంజెదారో కాలం నుంచి ఇంటి ముందు రంగవల్లులు వేయడం ఆనవాయితీ. ముగ్గును శ్రీ అని, లక్ష్మీదేవి అని భావిస్తుంటారు. మొదట్లో స్వస్తిక్ ఆకారంతో ప్రారంభమై వివిధ రూపాలు సంతరించుకుందనే ఆధారాలున్నాయి. లక్ష్మీదేవి కొలువు ఆకారం వేయడం, తర్వాత దశలో చోటు చేసుకున్నాయి. అప్పట్లో ముగ్గులను అల్పనగా పిలిచేవారు. వివిధ ప్రాంతాల్లో ఒక్కోపేరుతో పిలుస్తుంటారు. తమిళనాడు, కేరళలో కోలమ్, కర్ణాటక లో రంగవల్లి, మహారాష్ట్రలో రంగోలీ, బెంగాల్‌లో అల్పన, గుజరాత్‌లో సాతిజ్, మన రాష్ట్రంలో ముగ్గు అని పిలుస్తారు. సంక్రాంతి పండుగ రోజుల్లో ముగ్గుకు ఉన్న ప్రత్యేక త అంతాఇంతాకాదు. ఇళ్లముందు రంగు రంగుల ముగ్గులు వేయడానికి యువతులు పోటీ పడతారు. 
 - న్యూస్‌లైన్, పాలకొండ
 
 సంక్రాంతి అతిథులు
 సంప్రదాయాలు, ఆచారాల మేళవింపు సంక్రాంతి. పాత, నవతరాల వారధి ఈ పండుగ. పెద్దపండుగ వచ్చిందంటే గ్రామాల్లో సందడే సందడి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు మరింత ప్రత్యేకత సంతరించుకుంటాయి. కేవలం సంక్రాంతి పండుగ రోజుల్లో మాత్రమే కనిపించే అరుదైన అతిథులు తెలతెలవారుతుండగానే దర్శనమిస్తుంటారు. వీరిలో హరిదాసులు, గంగిరెద్దుల వారు, బుడబుక్కల వారు ముఖ్యులు. వీరు కనిపిస్తేనే అసలైన పండుగు వచ్చినట్టు గ్రామీణులు భావిస్తారు.                       - న్యూస్‌లైన్, పాలకొండ
 
 గూటికి చేరిన వలస పక్షులు
 ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: బతుకు తెరువు కోసం వలస వెళ్లిన శ్రమ జీవులంతా గూటికి చేరుతున్నారు. సంక్రాంతి పండుగను స్వగ్రామంలో కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి జరుపుకోవడానికి స్వగ్రామాలకు వస్తున్నారు. దీంతో పల్లెల్లో రెండు రోజుల ముందే సంక్రాంతి సందడి నెలకొంది. రాత్రి.. పగలు శ్రమించి పని చేసే శ్రమజీవులంతా ఈ నాలుగు రోజలు పనులకు విశ్రాంతిచ్చి కుటుంబ సభ్యులు, బంధువులతో ఆనందంగా గడుపడుపుతారు. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి సంక్రాంతి కల తప్పింది. అయినా కష్టం.. నష్టంతో సంబంధం లేకుండా పెద్ద పండుగను జరుపుకోవడానికి పల్లెలు సిద్ధమయ్యాయి. వలస కార్మికులతోపాటు, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, విద్య నిమిత్తం స్థిరపడిన వారంతా ఇళ్లకు చేరుతున్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఎచ్చెర్ల మండంలోని పూడివలస, ఇబ్రహింబాద్ గ్రామాల్లో ఆదివారం ‘న్యూస్‌లైన్’ పర్యటించింది. చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లిన వారంతా స్వగ్రామాలకు చేరుతుండడం కనిపించింది. అలాగే ఇళ్లకు రంగులు వేయడం, శుభ్రం చేయడం, షాపింగ్ చేయటం, యువకులు,వృద్ధులు, మహిళలు ఒకచోటు చేరి కబుర్లు చెప్పుకోవటం కనిపించింది. అలాగే పండుగ కోసం పిండి వంటలు చేసే పనిలో ఉన్న మహిళలు తారసపడ్డారు. పూడివలసలో ఎక్కువగా తాపీ మేస్త్రీలున్నారు. వీరు ఎక్కువగా చెన్నై, హైదరాబాద్‌లో ఉంటుంటారు. వీరిలో చాలా మంది ఇప్పటికే గ్రామానికి చేరుకున్నారు.  
 
 సంప్రదాయానికి పెద్దపీట
 గార,న్యూస్‌లైన్ : సంక్రాంతి.. సంప్రదాయానికి ప్రతీక. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కూడా పల్లె ప్రజలు పండుగ వేళ సంప్రదాయానికి పెద్దపీట వేస్తున్నారు. మహిళలు ఇష్టమైన గాజులు వేసుకోవడంలో బిజీగా ఉండగా.. పండుగ రోజుల్లో కొత్త రుచులు తినేందుకు వీలుగా అరెసలు, జంతికలు, చేగోడి, గారెలు, బూరెలు ఇతర పిండి వంటలు తయారు చేసే పనిలో మరికొందరు పోటీపడుతున్నారు. సంక్రాంతి పండుగలో నూతన వస్త్రాలదే అగ్రస్థానం. స్థోమతను బట్టీ అందరూ బట్టలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కోట్లాది రూపాయల వస్త్రాలను ప్రజలు కొనుగోలు చేశారు. మరికొందరు ఇళ్లను అందంగా రంగులతో తీర్చిదిద్దారు. యువతులు ముగ్గులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. మరికొందరు గొబ్బమ్మలను పెట్టే పనిలో ఉన్నారు. 
 
 రైతన్నల సందడి
 శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్ సంక్రాంతి.. రైతుల పండుగ... ఆరుగాలం శ్రమించి.. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండిన పంటను ఇంటికి చేర్చే పనిలో  పండుగ పూట రైతన్న బిజీగా ఉన్నాడు. వరి నూర్పులు చేసేందుకు పోటీ పడుతున్నారు. కుటుంబ సభ్యులంతా వరినూర్పుల్లో బిజీగా కనిపిస్తున్నారు. పండిన పంటను విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో పెద్ద పండుగను ఘనంగా జరుపుకోవాలని భావిస్తున్నారు.
 
 పెద్ద పండగకు ఆత్మీయ ఆహ్వానం
 ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా సంక్రాంతి పండుగ జరుపుకోవడంలో ఉన్న ఆనందం వేరు. ఇంటిల్లిపాది సమిష్టిగా పండుగను జరుపుకోవడం, ఆనందదాయక క్షణాలను ఆస్వాదించడం ఓ వేడుక. - లోలుగు అప్పలనాయుడు, గ్రామ పెద్ద, అంపిలి, పాలకొండ మండలం
 
 కుటుంబ సభ్యులంతా ఒకే చోటుకు
 సంక్రాంతి పండుగ వచ్చిదంటే కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట చేరుతారు. ఎక్కడెక్కడ నుంచో బంధువులు, స్నేహితుల రావడం మరుపురాని అనుభూతి. పెద్ద పండగ జరుపుకోవడంలో ఉన్న ఆనందం చెప్పలేనిది.- శాసపు గోవిందరావు, మాజీ సర్పంచ్, గోపాలపురం, పాలకొండ మండలం 
 
  బాధలన్నీ పక్కన పెట్టి..
 బాధలన్నీ పక్కనపెట్టి ఆహ్లాదంగా ఉండడం సంక్రాంతి పండుగకు ఉన్న గొప్పదనం. కష్టాలు, సమస్యలు, ఆవేదనలు, నివేదనలు నిత్యం ఉండేవే. ఉపశమనం కోసం జరుపుకొనేవి పండుగలు. మంచి వాతావరణంలో అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో ప్రతిక్షణాన్ని మనకు అనువుగా మలుచుకోవాలి.        - పాలవలస ఇందుమతి, 
 జెడ్పీటీసీ మాజీ  సభ్యురాలు, పాలకొండ 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement