
సరస్వతీపుత్రిక ఆర్థిక పోరాటం
- లక్ష్మీకటాక్షం లేని జయలక్ష్మి
ఆమెది చదువు కోసం ఆరాటం. కానీ లక్ష్మీ కటాక్షమే లేదు. సర్కారు బడిలో చదువుకున్నా టెన్త్‌లో అత్యున్నత ప్రతిభచూపి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన జయలక్ష్మికి ఇప్పుడు పై చదువు పరీక్షగా మారింది. కుటుంబం గడవడమే కష్టమైన పరిస్థితుల్లో ఉన్నత చదువు ఎలాగో ఆమెకు దిక్కుతోచడం లేదు. ఆదుకునే హస్తం ఉంటే చదువు కోవాలన్నది ఆమె కోరిక.
కొత్తకోట(రావికమతం) : ఆమె పేరులోనే విజయం ఉన్నా లక్ష్మీ కటాక్షం మాత్రం లేదు. చదువులో సత్తాచాటినా ఆర్థిక పరిస్థితులు ఆమె ముందరి కాళ్లకు బంధం అవుతున్నాయి. ఇది కొత్తకోట గ్రామానికి చెందిన ఉండా జయలక్ష్మి దీనగాథ. కటిక పేదరికం...పైగా తండ్రికి పక్షవాతం. కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఇక ఆమె చదువుసాగడం ఎలా. పదోతరగతితో 9.8 పాయింట్లు సాధించిన జయలక్ష్మి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధిం చింది.
ఆర్థిక పరిస్థితి అనుకూలించక పోవడంతో ‘పైచదువులు మనకెందుకులే తల్లీ’ అంటూ కుటుంబ సభ్యులు చెబుతుం టే ఆమె కన్నీటిపర్యంతమవుతోంది. ఉండాకొండబాబు, సత్యవతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి మంచంపట్టగా తల్లి సంపాదనే వారికి ఆధారం. ఊర్లోనే ప్రభుత్వ పాఠశాల ఉండడంతో పదో తరగతి వరకు గడిచిపోయింది. ఓ వైపు అరకొర ఆదాయం, మరోవైపు తండ్రికి వైద్యంతో ప్రస్తుతం కుటుం బం గడవడమే కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె పై చదువు ప్రశ్నార్థకంగా మారింది.
ఓ వైపు పాఠశాల ప్ర ధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు ఉన్నత చదువులు చదివించాలని సూ చిస్తున్నారు. జయలక్ష్మికి మంచి భవిష్యత్తు ఉందని చెబుతున్నా ఎలా సర్ధుకుపోవాలో అర్థంకాక ఆ పేద తల్లి తల్లడిల్లిపోతోంది. దాతలెవరైనా సాయం చేస్తే తప్ప జయలక్ష్మి చదువు కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఏదైనా ఆపన్న హస్తం చేయూతనిస్తుందేమోనని ఆ కుటుంబం ఎదురు చూస్తోంది.