సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రామ పంచాయతీల్లో నిధులు లేక పనులు జరగక సర్పంచ్‌లు అయోమయానికి గురవుతున్నారు. గ్రామాన్ని ప్రగతిబాట పట్టించాలన్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. పంచాయతీరాజ్ చట్టం నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలపై ప్రతి యేటా ఆడిట్ జరగాల్సి ఉంటుంది. 2012-13కు సంబంధించి ఇంకా లెక్కలు తేలకపోవడంతో పంచాయతీకి నిధుల విడుదల నిలిచిపోయింది. 13వ ఆర్థిక సంఘం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి(బీఆర్‌జీఎఫ్) తదితర పద్దుల ద్వారా పంచాయతీలకు నిధులు విడుదల కావాల్సి ఉంది. దీంతో ఇన్నాళ్లూ చెక్‌పవర్ కోసం ఒత్తిడి చేసిన కొత్త సర్పంచ్‌లు, తాజాగా ఆడిట్ త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
జిల్లాలో 1,066 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో 35 మేజర్ పంచాయతీలున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీల వారీగా డిసెంబర్ 31లోగా ఆడిట్ పూర్తి కావాల్సి ఉంది. ఆడిట్‌ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అటు పంచాయతీ, ఇటు జిల్లా పరిషత్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డివిజన్ల వారీగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లతో సమావేశాలు కూడా నిర్వహించారు. మరో 450 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇంకా ఆడిట్ ప్రారంభం కావాల్సి ఉంది. గడువులోగా ఆడిట్ పూర్తవుతుందని అధికారులు చెప్తున్నా చాలాచోట్ల సమస్యలు ఎదురవుతున్నాయి. సుమారు రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలోనే పంచాయతీల పాలన కొనసాగింది.
గతంలో పనిచేసిన సర్పంచ్‌లు ఇంకా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు రికార్డులు అప్పగించలేదు. దీంతో ఆడిట్ సకాలంలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులకు అప్పగించారు. నిర్ణీత గడువులోగా ఆడిట్ జరగకుంటే సర్పంచ్‌లపై అనర్హత వేటు వేయడంతో పాటు, ఎగ్జిక్యూటివ్ అధికారులపై చర్యలుంటాయని పంచాయతీరాజ్ చట్టం స్పష్టం చేస్తోంది. 13వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఇప్పటికే జిల్లాకు రూ.13 కోట్లు విడుదలయ్యాయి. మరో రూ.13 కోట్లు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆడిట్ నివేదికలు సమర్పిస్తేనే బీఆర్‌జీఎఫ్ నిధులు కూడా పంచాయతీల ఖాతాల్లోకి వెళ్తాయి. దీంతో నిధులున్నా వినియోగించుకునే పరిస్థితి లేదని సర్పంచ్‌లు వాపోతున్నారు.
రికవరీకి సన్నాహాలు
బీఆర్‌జీఎఫ్ నిధుల వినియోగానికి సంబంధించి పలుచోట్ల అవకతవకలు జరిగినట్లు ఆడిట్ నివేదికల్లో వెల్లడవుతోంది. జగదేవ్‌పూర్, చేగుంట వంటి మండలాల్లో పనులు పూర్తి కాకుండానే నిధులు డ్రా చేసినట్లు గుర్తించారు. వీటిని తిరిగి రాబట్టేందుకు(రికవరీ) అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. స్పందించని వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆడిట్ పూర్తయిన పంచాయతీల్లో ఎంత మొత్తం రికవరీ చేయాల్సి వుందనే సమాచారాన్ని ఇచ్చేందుకు అధికారులు విముఖత చూపుతున్నారు. ఆడిట్‌లో లోపాలను గుర్తిస్తే మరో మారు విచారణ జరుపుతామని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు.
పైసా.. కైసా?
Published Mon, Dec 2 2013 11:34 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement