అవధానం చేస్తున్న లలిత్ ఆదిత్య
సాక్షి, రాజమహేంద్రవరం: లలితాదిత్యుడు మధ్యందిన మార్తాండుడిలా జాజ్వల్యమానంగా ప్రకాశించాడు. పృచ్ఛకవరేణ్యుల అక్షర అస్త్రశ్రస్తాలను అతి లాఘవంగా ఎదుర్కొన్నాడు. పద్యాలను ఛందోబద్ధంగా మాత్రమే కాదు, రసరమ్య గీతాలుగా, భావస్ఫోరకంగా చెప్పి పండితుల ఆమోదాన్ని, ఆశీస్సులను అందుకున్నాడు. ఆదికవి నన్నయ భట్టారకుడు, తిరుపతి వేంకట కవులు, కవిసార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి వంటి హేమాహేమీలు నడయాడిన గడ్డ మీద.. అమెరికాలో జన్మించి, అక్కడే చదువు‘సంధ్య’లు సాగిస్తున్న ఈ నూనూగు మీసాల నూత్నయౌవనంలో ఉన్న కుర్రాడు మంగళవారం శతావధానం విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ మహత్తర ఘటన తెలుగు సాహితీ జగత్తుకు గర్వకారణంగా నిలిచిపోతుందని పలువురు సాహితీవేత్తలు ఈ సందర్భంగా ముక్తకంఠంతో పేర్కొన్నారు.. ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల, శుభోదయం ఇన్‌ఫ్రా సంయుక్త ఆధ్వర్యాన కళాశాలలో ఆదివారం ప్రారంభమైన శతావధానం నిర్వాహకుల అంచనాలకంటే ముందుగానే ఉదయం 11.43 గంటలకు ముగిసింది.
ఘంటానాదం చేస్తున్న ధూళిపాళ
శతావధానంలోని అంశాలు
మూడు నిషిద్ధాక్షరులు, 24 సమస్యలు, 24 దత్తపదులు, 24 వర్ణనలు, 19 ఆశువులు, నాలుగు ఘంటావధానాలు, మూడు అప్రస్తుత ప్రసంగాలు వెరసి.. 101 అంశాలపై పృచ్ఛకులు సంధించిన ప్రశ్నలకు యతిప్రాసలు చెడకుండా, రసాత్మకంగా లలిత్ ఆదిత్య పద్యాలను అలవోకగా అందించాడు. ‘శ్చి’, స్త్వం’ వంటి ప్రాసలతో పద్యాలు చెప్పవలసివచ్చినా అదరలేదు.. బెదరలేదు. ‘శిష్యవాత్సల్యము చెలువుమీర’ అవధాన ప్రాచార్య డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి అవధానిని ప్రోత్సహిస్తూ, పృచ్ఛకులను కవ్విస్తూ, రసజ్ఞులను మెప్పిస్తూ అంతటా తానే అయి, అన్నీ తానే అయి అవధాన క్రతువు నిర్వహించారు. అవధానిని ‘అవధాన శరచ్చంద్ర’ బిరుదుతో సత్కరించారు.
25 నిమిషాల్లో 75 పద్యాలు
మూడు రోజులుగా పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు తాను పద్యరూపంగా ఇచ్చిన సమాధానాలను సాయంత్రం జరిగిన మహాధారణలో లలిత్ ఆదిత్య 25 నిమిషాలలో చదివాడు. ‘గురువులయ్యె గురువుల దీవెనల్, లఘువులయ్యె నాదు శ్రమల్’ అని గురువులను స్తోత్రం చేశాడు. ఇది సరికొత్త రికార్డు అని మహాదేవమణి శిష్యుని ఆలింగనం చేసుకున్నారు. మహామహోపాధ్యాయులు, సంస్కృత శతావధానులు కొలువు తీరిన సభలో ఆదిత్య మహాధారణకు కరతాళధ్వనులు ఆగకుండా మోగాయి.
పూరి, గారె, వడ, దోసెలతో వాతావరణ కాలుష్యంపై పద్యం చెప్పమని సరసకవి డాక్టర్ ఎస్‌వీ రాఘవేంద్రరావు కోరగా.. అవధాని ఇలా చెప్పారు.
‘పూరి’త మయ్యె ముజ్జగము భూస్థితి భంగ రసాయనంబులన్
దూరినభ్యాదతన్‌గొనగ ‘దోసి’ళు లొగ్గిన వారు లేరు పొం
‘గారె’ను బాష్పముల్ కువలయాంగనకున్ కలుషమ్ము మీరగా
ఆరయచిత్తకంధి ‘వడ’వాగ్నిగ రేగెను దిర్నివారమై..
పండితుల ప్రశంసలు
ధార, ధారణ, పూరణ అవధానానకి ప్రాణాలు. శీలసంపద లేని పాండిత్యం, హారతి లేని పూజ, పూలు తలలో లేని మగువ కొప్పు, ధారణ లేని అవధానం వ్యర్థం. ధారణలో లలిత్ సందీప్ అసామాన్యమైన ప్రతిభ చూపాడు.
– ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి
అత్యద్భుత ప్రతిభ
లలిత్ ఆదిత్యుని ప్రతిభ అద్భుతం. దేవీదత్తం, ఉపాసనాసిద్ధి పొందిన లక్షణాలు అవధానిలో కనిపిస్తున్నాయి.
– మహామహోపాధ్యాయ
శలాక రఘునాథశర్మ పురాకృత సుకృతం
పద్యవిద్యలో లలిత్ ఆదిత్య సాధించిన ప్రతిభ పురాకృత సుకృతం. గురువుల ఆశీస్సులను మెండుగా అందుకున్న లలిత్ ఆదిత్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాను.
– చింతలపాటి శర్మ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత
Comments
Please login to add a commentAdd a comment