కుక్క కరిస్తే సానుభూతి.. మృగాడు కాటేస్తే..
కుక్క కరిస్తే సానుభూతి.. మృగాడు కాటేస్తే..
Published Tue, Mar 4 2014 3:39 PM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM
సాటి మనిషిని కుక్క కరిస్తే సానుభూతి చూపించే ఈ సమాజం.. ఓ మృగాడి కాటుకు బలైన ఓ మహిళను అతిహీనంగా చూస్తోందనే కోణంపై బాలీవుడ్ 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' అమీర్ ఖాన్ దేశంలోని సామాజిక సమస్యపై మరోసారి 'సత్యమేవ జయతే-2' రూపంలో తన అస్త్రం ఎక్కుపెట్టారు. ప్రతి 22 నిమిషాలకు ఓ అత్యాచారం నమోదవుతున్న ఈసమాజంలో ప్రభుత్వాలకు, అధికారులకు పట్టింపు లేదని సత్యమేవజయతే ద్వారా కొన్ని అంశాలు వెల్లడయ్యాయి. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో ఐదుగురు మహిళలకు ఎదురైన అనుభవాల్ని ఈ కార్యక్రమంలో వెలుగులోకి తెచ్చారు.
అత్యాచారం జరిగిన తర్వాత పోలీసుల తీరు, వైద్య పరీక్షల నిర్వహించే సమయంలో ఎదురైన సంఘటనలు చాలా బాధాకరమని తనకు ఎదురైన అనుభవాల్ని ఓ మహిళ పంచుకున్నారు. న్యాయం కోసం చేస్తున్న తన పోరాటానికి ఓ దశాబ్దం కాలం పట్టిందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురైతే.. ప్రామాణికమైన వైద్య పరీక్ష లేకపోవడం దారుణం. బాధితురాలిని అనుమానస్పదంగా చూడాలని పాఠ్యపుస్తకాల్లోనే ఉండటం అత్యంత శోచనీయమని ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఘోరమైన విషయమేమింటంటే మెడికల్ ద్వితీయ సంవత్సరం పుస్తకాల్లో కేవలం నాలుగు మార్కుల కోసం కేటాయించిన సిలబస్ ఉండటం చూస్తే ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాలకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోంది.
ఇక తన భార్యపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసిన భర్తపై పోలీసుల దౌర్జన్యం, వేధింపులను ఈ కార్యక్రమం ద్వారా సమాజం దృష్టికి తీసుకొచ్చారు. ఢిల్లీలో ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేటట్టు చేసింది. దర్యాప్తులో లోపాలు, వైద్యపరీక్షలో లోటుపాట్ల ఆసరాతో నిందితులు తప్పించుకుంటాన్నరని...కోర్టులో జాప్యం, పోలీసుల తీరు, ఇతర అంశాల కారణంగా అత్యాచార ఘటనలు దేశంలో ఎన్నో వెలుగులోకి రాలేకపోతున్నాయని బాధితులు చెప్పారు. అత్యాచార ఘటనలపై 'సత్యమేవ జయతే' ద్వారా అమీర్ ఖాన్ స్పందించిన తీరు అన్నివర్గాలను ఆకట్టుకుంది. అధికారులు, ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సత్యమేవ జయతే లాంటి కార్యక్రమాలు స్పూర్తిని కలిగిస్తాయని ఆశిద్దాం!
Advertisement