కర్ణుడు, మారీచుడు, శల్యుడు.. రాజకీయ నేతలపై సత్యవాణి ధ్వజం
-
మెడపై కత్తిపెట్టి జై తెలంగాణ అనమంటున్నారు..
-
అనకపోతే విద్రోహులుగా చూస్తున్నారు
-
కేసీఆర్ తమ్ముడూ.. బతుకమ్మను కూడా ఒక ప్రాంత చట్రంలో ఇరికించింది మీ కూతురు కాదా?
-
కర్రీ సెంటర్ అంటే నీకు అంత చులకన భావమా?
-
నువ్వు మీ భార్య చేతి కూర తినవా?
సాక్షి, హైదరాబాద్: మెడపై కత్తిపెట్టి జై తెలంగాణ అనాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, అనకపోతే విద్రోహులు అంటూ ముద్ర వేస్తున్నారని హిందూవాహిని నాయకురాలు సత్యవాణి పేర్కొన్నారు. అందరికీ అమ్మ అయిన బతుకమ్మను కూడా మీ కూతురు ఒక ప్రాంత చట్రంలో ఇరికించడం తెలంగాణ సంస్కృతా? అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణలోని తల్లులు, సోదరులు, సోదరీమణులు ప్రేమ, ఆప్యాయతలు కనబరుస్తారని కానీ విద్యావంతులు, వివేకం ఉన్న పార్లమెంట్ సభ్యులైన తమరు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సదస్సులో ఆమె ప్రసంగం ఉద్యోగులను విశేషంగా ఆకట్టుకుంది. రాజకీయ ప్రతినిధులను మూడు రకాలుగా విభజించి కర్ణుడు, మారీచుడు, శల్యునితో పోల్చారు. ‘‘ప్రధానమంత్రికి అన్నీ ఉన్నా డైనమిజం లేదు.
అధికారంలో ఉండి ఏం లాభం? ప్రజలకు న్యాయం చేయనప్పుడు..? పదవి ఇచ్చారు కదా అని కర్ణుని మాదిరిగా మౌనంగా ఉంటే ఎలా? ఇంత ఆందోళన జరుగుతున్నా మౌనం వీడకుంటే ఎలా? కేంద్ర మంత్రులు, ఎంపీలు మారీచుల్లా మారారు. మరొకరు శల్యుడిలా శల్యసారథ్యం చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఆనాటి మహాభారత సంగ్రామానికీ ఈనాటి సమైక్యాంధ్ర సంగ్రామానికి చాలా పోలికలు కనబడుతున్నాయి. ఆనాడు కౌరవులు హస్తినలో సూది మొన మోపేంత జాగా కూడా ఇవ్వమని ప్రకటిస్తే పాండవులు వెళ్లి ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించుకున్నారు. నగరాన్ని చూడ్డానికొచ్చిన దుర్యోధనుడు మయసభను, భవనాలను చూసి అసూయ పడి అహంకారంతో కురుక్షేత్రానికి కాలుదువ్వాడు. ఇప్పుడూ రాష్ట్రంలో అదే పరిస్థితి కనిపిస్తోంది.
టిఫిన్ సెంటర్లు, కర్రీపాయింట్ పెట్టుకోండని వ్యాఖ్యానించడం ఎంత వరకు సబబు? కేసీఆర్.. మీ భార్య చేసిన కూరలు తినకుండానే బతుకుతున్నావా? టిఫిన్ సెంటర్లు, కర్రీపాయింట్లు నీకంత తేలిగ్గా కనబడుతున్నాయా తమ్ముడూ? ఒక్కసారి ఆలోచించుకో! కోదండరాముడి పేరు పెట్టుకున్న కోదండరాం.. దయచేసి పిల్లల్లో విద్వేష భావాలు రెచ్చగొట్టొద్దు’’ అని సత్యవాణి అన్నారు. ‘‘అవసరమైతే మీరు 15 ఏళ్లు పాలించుకోండి.. కానీ రాష్ట్రాన్ని విడగొట్టవద్దు’’ అని కోరారు. శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తాను వారికి నివేదిక ఇస్తూ ‘‘మహాభారతంలో శ్రీకృష్ణుని రాయబారం ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ రాయబారం నడుస్తోందని అన్నాను. జస్టిస్ శ్రీకృష్ణ స్పందిస్తూ ‘ఆ శ్రీకృష్ణ రాయబారం ఫెయిల్ అయింది. ఈ శ్రీకృష్ణ కమిటీ రాయబారం ఫెయిల్ కాదు అని అనుకుంటున్నా’ అని చెప్పారు. కానీ ఆ రాయబారం కూడా ఫెయిల్ అయింది’’ అని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీని ప్రధాని కావద్దని అన్నందుకే ఆమె కక్ష కట్టినట్లు ఉందని వ్యాఖ్యానించారు.