ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ | Satyayesubabu Of The SP Of The District Said That The Problems Of The Public Will Be Solved | Sakshi
Sakshi News home page

నూతన టెక్నాలజీతో నేరాల నియంత్రణ

Published Sun, Jul 28 2019 7:29 AM | Last Updated on Sun, Jul 28 2019 7:29 AM

Satyayesubabu Of The SP Of The District Said That The Problems Of The Public Will Be Solved - Sakshi

నేరాల నియంత్రణ విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో అఫెండర్‌ సర్వేలెన్స్‌ సిస్టం అమలు చేస్తుండటంతో స్థానిక నేరస్తులు మాత్రమే పట్టుబడుతున్నారు. బయటి నేరస్తులు తిరుగుతున్నా గుర్తించలేని పరిస్థితి ఉంది. అందువల్ల త్వరలో ఫింగర్‌ ప్రింట్స్‌ ఇన్వెస్టిగేషన్‌ సిస్టం టెక్నాలజీని తీసుకొస్తున్నాం. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8లక్షల మంది నేరస్తుల వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించి రాత్రి సమయాల్లో అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తే కొత్త నేరస్తులు పట్టుబడే అవకాశం ఉంది. అదేవిధంగా రాత్రి సమయాల్లో గస్తీ పెంచుతున్నాం. 

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తున్నాం. ప్రజలు న్యాయం కోసం పోలీసుస్టేషన్‌ల చుట్టూ తిరగకూడదు. ఒక్కసారి అర్జీ ఇస్తే.. ఆ సమస్య పరిష్కారం అయిందో లేదో నేనే చూస్తా.. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. అని జిల్లా ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు తెలిపారు. పోలీసుశాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలను  శనివారం సాక్షి ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

సాక్షి: జిల్లాలో ‘స్పందన’ తీరు ఎలా ఉంది? 
ఎస్పీ: ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. పోలీసుశాఖలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నాం. ప్రతి సోమవారం అన్ని పోలీసుస్టేషన్‌లలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు(ఎస్‌హెచ్‌ఓ) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ అందుబాటులో ఉండాల్సిందే. సమాచారం లేకుండా అందుబాటులో లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం.  
సాక్షి: ఎక్కువశాతం రెవెన్యూ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఎలా పరిష్కారం చేస్తున్నారు.? 
ఎస్పీ: జిల్లా వ్యాప్తంగా స్పందన కార్యక్రమంలో వస్తున్న అర్జీలలో ఎక్కువ శాతం భూ సమస్యలే ఉంటున్నాయి. తమ భూమి, స్థలాన్ని ఆక్రమించారని, తమ పొలంలోకి పోనియకుండా దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారని, తమకు తెలియకుండా వేరే వ్యక్తులు రిజిస్ట్రేషన్‌(డబుల్‌ రిజిస్ట్రేషన్‌) చేసుకుంటున్నారని బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. వీటిలో పోలీసుశాఖ నుంచి ఎంత వరకు న్యాయం చేయగలమో అంత వరకు చేస్తున్నాం. అయితే రెవెన్యూ సంబంధిత సమస్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఆస్కారం ఉండడంతో వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. భవిష్యత్‌లో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలు పరిష్కారించాలని భావిస్తున్నాం.  
సాక్షి : ఫిర్యాదుల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 
ఎస్పీ: ఫిర్యాదుల స్వీకరణలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా పోలీసుశాఖ నెంబర్‌వన్‌ స్థానంలో ఉంది. అలాగే  ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల్లో కూడా అగ్రస్థానంలో ఉన్నాం. జూలై 1 నుంచి స్పందన కార్యక్రమం అమలైంది. ఇప్పటి వరకు మొత్తం 937 ఫిర్యాదులు రాగా.. 888 సమస్యలను పరిష్కరించాం. స్పందన కార్యక్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు కూడా నమోదు చేస్తున్నాం. దీనివల్ల ఎఫ్‌ఐఆర్‌ నమోదు సంఖ్య పెరుగుతోంది. అలాగే స్పందన కార్యక్రమంలో అర్జీలు తీసుకున్న వెంటనే వారికి సీసీటీఎన్‌ఎస్‌ ద్వారా రిసిప్టులు అందజేస్తున్నాం. ఎప్పటిలోగా సమస్య పరిష్కారిస్తాం. తర్వాత ఎవర్ని సంప్రదించాలనే అంశం అందులో ఉంటుంది. ఫిర్యాదుదారుల సెల్‌ఫోన్‌ నెంబర్‌లు కూడా స్వీకరించి కంట్రోల్‌ రూం, డయల్‌ 100 సిబ్బంది ద్వారా సంబంధిత అర్జీదారులకు ఫోన్‌ చేసి సమస్య పరిష్కారం అయిందా.. లేదా అనే అంశంపై ఆరా తీస్తున్నాం. దీనివల్ల తప్పుడు లెక్కలకు ఆస్కారం ఉండదు.  
సాక్షి: నగరంలో ట్రాఫిక్‌ సమస్యల చాలా తావ్రంగా ఉంది? మీరేమంటారు? 
ఎస్పీ: ట్రాఫిక్‌ ఇబ్బందులపై ఫోకస్‌ పెట్టాం. ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ను బలోపేతం చేస్తున్నాం. వీలైనంత ఎక్కువ మంది సీఐలు, ఎస్‌ఐలను కేటాయిస్తున్నాం. కిందిస్థాయి సిబ్బందిని కూడా పంపిస్తున్నాం. అయితే కార్పొరేషన్‌ అధికారులు సహకరిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సెల్లార్‌లలో ప్రస్తుతమున్న షాపులను ఖాళీ చేయించి పార్కింగ్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల రోడ్లపై పార్కింగ్‌ వాహనాల సంఖ్య తగ్గుతుంది. ట్రాఫిక్‌ ఇబ్బందులు గాడిలో పడుతాయి.  

సాక్షి: జిల్లాలో దొంగతనాలు అధికమయ్యాయి. ఎలా అడ్డుకుంటారు? 
ఎస్పీ: నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో అఫెండర్‌ సర్వేలెన్స్‌ సిష్టం అమలు చేస్తున్నారు. దీనివల్ల జిల్లాకు సంబంధించిన నేరస్తులు మాత్రమే పట్టుబడుతారు. బయట నేరస్తులు తిరుగుతున్నా గుర్తించలేని పరిస్థితి ఉంది. కావున త్వరలో ఫింగర్‌ ప్రింట్స్‌ ఇన్వెస్టిగేషన్‌ సిష్టం టెక్నాలజీని తీసుకొస్తున్నాం. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది నేరస్తుల వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించి రాత్రి సమయాల్లో అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తే కొత్త నేరస్తులు పట్టుబడే అవకా>శముంది. దీనికి తోడు రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం.  

సాక్షి: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 
ఎస్పీ: స్పందన కార్యక్రమంలో బాధితుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది. దీన్ని ఆసరగా చేసుకొని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల నిరుద్యోగ అభ్యర్థులు ఇలాంటి విషయంలో నమ్మి మోసపోవద్దు. ఉద్యోగాలనేవి పూర్తిగా ప్రభుత్వ స్థాయిలో జరుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement