ఈవీఎంలు భద్రం | Save EVMs | Sakshi
Sakshi News home page

ఈవీఎంలు భద్రం

Published Fri, May 9 2014 12:07 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

ఈవీఎంలు భద్రం - Sakshi

ఈవీఎంలు భద్రం

  • పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్లు
  •  అభ్యర్థులు,అధికారుల సమక్షంలో సీళ్లు
  •  బలగాలతో మూడంచెల భద్రత
  •  16న కౌంటింగ్‌కు ఏర్పాట్లు
  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : అభ్యర్థుల జాతకాలు నిక్షిప్తమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లను పోలింగ్ అనంతరం సిబ్బంది సంబంధిత స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. అక్కడ వాటిని భద్రపరిచారు. భీమిలి, విశాఖ-తూర్పు, విశాఖ-ఉత్తరం నియోజకవర్గాలవి ఏయూ ఇంజినీరింగ్ కాలేజి న్యూ క్లాస్ కాంప్లెక్స్‌లో ఉంచారు.

    విశాఖ-దక్షిణం సెగ్మెంట్‌వి జైల్‌రోడ్డులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో, విశాఖ-పశ్చిమానివి జ్ఞానాపురంలోని సోఫియా జూనియర్ కాలేజిలోని, గాజువాకవి మింది వద్ద ఉన్న బీహెచ్‌పీవీ ఎయిడెడ్ తెలుగు మీడియం స్కూల్‌లో, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలవి ఏయూ మెయిన్ బిల్డింగ్‌లో, నర్సీపట్నంవి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఉంచారు.

    మాడుగుల, యలమంచిలి నియోజకవర్గాలవి ఏయూ కెమికల్ ఇంజినీరింగ్ బ్లాక్‌లోను, పెందుర్తివి ఏయూ మెరైన్ ఇంజినీరింగ్ బిల్డింగ్‌లో, పాయకరావుపేట నియోజకవర్గానివి స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో, అరకు, పాడేరు నియోజకవర్గాలవి రుషికొండ ప్రాంతంలో ఉన్న గాయత్రీ విద్యా పరిషత్ కాలేజిలో ఉంచారు. ఆయా కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపును కూడా చేపట్టనున్నారు. బుధవారం పోలింగ్ అనంతరం ఈవీఎంలను అర్ధరాత్రికి ఆయా మండలాల తహశీల్దార్ కార్యాలయాలకు చేర్చారు.

    పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకు కొనసాగడంతో తీసుకురావడం ఆలస్యమైంది. బ్యాలెట్ యూనిట్‌లు, కంట్రోలు యూనిట్‌లను పూర్తి స్థాయిలో పరిశీలించి ఆర్‌వో సిబ్బంది పీవోల నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్ని ఓట్లు పోలయ్యాయన్న వివరాలు సేకరించారు. మొరాయించిన ఈవీఎంల స్థానే ఉపయోగించిన కొత్తవాటి వివరాలు నమోదు చేసుకుని వాటిని పెట్టెల్లో పెట్టి సీళ్లు వేశారు. ఉదయాన్నే ప్రత్యేక వాహనాల్లో పటిష్ట బందోబస్తు మధ్య విశాఖలోని ఆయా కేంద్రాలకు తరలించారు.  
     
    మూడంచెల భద్రత : ఏయూ ఇంజినీరింగ్ కాలేజి నూతన భవనంలో భద్రపర్చిన ఈవీఎంలను అబ్జర్వర్ అనీల్‌కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు తనిఖీ చేశారు. వారి సమక్షంలో ఆయా గదులకు సీల్ వేయించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు సివిల్ పోలీసులు మోహరించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, అబ్జర్వర్లు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు, పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల డైరీ స్క్రూటినీ నిర్వహించారు. అభ్యర్థులు ఎన్నికల నిర్వహణలో జరిగిన లోటుపాట్లను, సలహాలను, సూచనలను అబ్జర్వర్లకు తెలియజేశారు.
     
    16న కౌంటింగ్‌కు ఏర్పాట్లు : ఓట్ల లెక్కింపు అన్ని నియోజకవర్గాలకు ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 16న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియను ఆ రోజు మధ్యాహ్నం 12, ఒంటి గంట సమయానికల్లా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరు వేరుగా కౌంటింగ్ చేపడుతున్నారు. ఎంపీ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు, మరో హాల్‌లో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేయడం ద్వారా మధ్యాహ్నం 12 గంటల కల్లా లెక్కింపు పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement