ఉదయం 5కే ‘ఇంటి’గంట!
చిన్నారులకు చలి కష్టాలు..
ఉదయం 8 కల్లా స్కూళ్లు తెరిచేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు
చలిలో వణుకుతూ బడిబాట పడుతున్న పిల్లలు
తొమ్మిది గంటలకే స్కూళ్లు తెరవాలన్న నిబంధన అమలుపై విద్యాశాఖ నిర్లక్ష్యం
హైకోర్టు ఆదేశాలు సైతం గాలికి వదిలేస్తున్న పాఠశాలలు
సాక్షి, హైదరాబాద్: ఉదయం 8 గంటలకే స్కూల్.. అంటే 7.45 గంటలకల్లా స్కూల్లో ఉండాలి. ఇంకేముంది ఉదయం 5 గంటలకే ఇంటి గంట మోగుతుంది.. వంటింట్లో హడావుడి మొదలవుతుంది. చిన్నారులను నిద్రలేపి.. రెడీ చేసి స్కూల్‌కు పంపే వరకు అంతే! సాధారణ సమయంలో అయితే ఫరవాలేదు.. కానీ ఇది చలికాలం. నిద్ర లేచేందుకు పిల్లలు మారాం చేస్తుంటారు. బలవంతంగా లేపి తయారు చేసినా అంత పొద్దున్నే పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకోరు. అయిష్టంగా అయినా బడి సంచులు భుజానికి తగిలించి తల్లిదండ్రులు వారిని స్కూళ్లకు పంపుతున్నారు. చలిలో వణుక్కుంటూ ఆ చిన్నారులు పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు.
పెద్ద పిల్లలు కాస్త ఓర్చుకుంటున్నా.. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ నుంచి ఐదో తరగతి వరకు చదివే చిన్నారులు ఇంట్లో నుంచి ఉదయం 7 గంటలకల్లా వణుక్కుంటూనే స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. చిన్నపిల్లలకు అంత ఉదయమే స్కూలు అవసరమా అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నా.. అధికారులకు పట్టడం లేదు. యాజమాన్యాల్లో మార్పు రావడం లేదు. విద్యాశాఖ నిర్ణయించిన వేళల ప్రకారం ఉదయం 9 గంటల తర్వాతే పాఠశాలలు ప్రా రంభం కావాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని, గత సెప్టెంబర్ 25న హైకోర్టు చెప్పినా అధికారుల చెవికెక్కడం లేదు.
రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఒకే తరహా వేళలను అమ లు చేయడంలో విద్యాశాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో 24 వేల ప్రైవేటు స్కూళ్లలో 54 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 25 లక్షల మంది నర్సరీ నుంచి ఐదో తరగతి చదువుతున్న వారే ఉన్నారు. వారంతా ప్రస్తుతం చలిలో స్కూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నా విద్యాశాఖకు పట్టడం లేదు. ఏమంటే ప్రభుత్వ స్కూళ్లు 9 గంటల తర్వాతే ప్రారంభమవుతున్నాయని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.
ఒక్కో స్కూలు.. ఒక్కో టైం : ఒక్కో స్కూల్లో ఒక్కో రకమైన సమయం.. ఓ స్కూళ్లో ఉదయం 7:30 గంటలకే తరగతులు ప్రారంభమైతే.. మరొక స్కూల్లో 8 గంటలకు.. ఇంకొక స్కూల్లో 8:15 గంటలకే తరగతులు ప్రారంభిస్తున్నారు. దీంతో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ.. ఇలా ఐదో తరగతి వరకు చదివే చిన్నారులు ఉదయం స్కూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడతున్నారు. పిల్లలే కాదు.. వారిని తయారు చేసి స్కూళ్లకు పంపించేం దుకు తల్లిదండ్రులు కూడా తంటాలు పడాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని కార్పొరేట్ స్కూళ్లు మొదలుకొని గ్రామీ ణ ప్రాంతాల్లోని చిన్నపాటి ప్రైవేటు స్కూళ్లు కూడా ఉదయం 8 గంటల వరకే తరగతులను ప్రారంభించేస్తున్నాయి. విద్యాశాఖ నేతృత్వంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన విద్యా విషయక కేలండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు అన్నీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకే పనిచేయాలి. దీన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని గత సెప్టెంబరులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్లను, విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు!