పాఠశాలల పునఃప్రారంభంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. చతుర్దశి, అమావాస్య సాకుతో ఇప్పటికీ తలుపులు తెరవని పరిస్థితి. నిర్లక్ష్యపు నీడలో బాలికల గురుకుల పాఠశాల గది తాళానికి వేసిన సీలు అలాగే .. నిరుపేద విద్యార్థులనే చులకన భావమో.. ప్రశ్నించే సాహసం చేయలేరన్న ధీమానో తెలియదు కానీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులపై ప్రభుత్వ ఉదాసీనత, స్థానిక అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆళ్లగడ్డ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల పరిస్థితి ఇందుకు నిదర్శనంగా ఉంది.
ఆళ్లగడ్డ టౌన్: వేసవి సెలవుల అనంతరం గత సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని పాఠశాలల్లో.. మరీ ముఖ్యంగా ప్రయివేటు పాఠశాలలు రెండు రోజులు ముందుగానే విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఆళ్లగడ్డ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ పరిస్థితి ఏ మాత్రం లేకపోవడం గమనార్హం. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు రోజులైనా వంట శాల, భోజనశాల తలుపులకు వేసిన సీలు కూడా తీయకపోవడం ఇందుకు నిదర్శనం.
పట్టణ శివారులోని వక్కిలేరు వాగు సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మిగతా స్కూళ్లతోపాటే ఈనెల 15న ప్రారంభమైంది. అయితే రెండు రోజులు పూర్తయినా విద్యార్థుల చడీచప్పుడు కనిపించలేదు. ఉపాధ్యాయులు మాత్రం వచ్చి వారి సమయం వరకు కూర్చొని వెళ్తున్నారు తప్పితే పరిస్థితిని పట్టించుకోవడం లేదు. 5 నుంచి 10వ తరగతి వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 420 మంది బాలికలు చదువుతున్న ఈ పాఠశాలలో ఈ పరిస్థితి ఉండడం గమనార్హం. దీంతో అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులతో వచ్చి ఇక్కడి పరిస్థితిని చూసి తిరిగి వెళ్లిపోతున్నారు.
సీలు కూడా తొలగించలేదు..
గత ఏడాది పాఠశాల చివరి రోజున పాఠశాల అధికారి, సిబ్బంది సమక్షంలో వంటశాల, భోజనశాల గదులకు వేసిన తాళాలు వేసి సీలు వేశారు. సాధారణంగా స్కూలు పునఃప్రారంభ సమయానికి రెండు రోజుల ముందుగానే వీటిని తీసి శుభ్రం చేస్తారు. అవసరమైన మేరకు సరుకులు సమకూర్చుకుని వంటకు సిద్ధమవుతారు. అయితే ఇక్కడ కనీసం తలుపులకు వేసిన సీలు కూడా తొలగించకపోవడం చూసి విద్యార్థులను స్కూలులో వదిలేందుకు వచ్చిన వారి తల్లిదండ్రులు ఇంత నిర్లక్ష్యమా అంటూ నివ్వెరపోతున్నారు.
పాఠశాలలో మరమ్మతులు, రంగులు వేయడం కొనసాగుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల వారు సోమవారం వచ్చి ఇళ్లకు వెళ్లి పోయారు. మంగళవారం ఆదోని నుంచి వచ్చిన 6వ తరగతి విద్యార్థిని మాత్రం ఏం చేయాలో దిక్కు తోచక దిగాలు గా అలాగే పాఠశాల గేటు వద్ద కూర్చుని ఉండడం కనిపించింది. ఒక రోజు ఆలస్యంగా వచ్చినా స్కూల్లో ఈ పరిస్థితి ఉందని, మళ్లీ ఆదోనికి వెళ్లి మళ్లీ రావడం ఎలా కుదురుతుందని విద్యార్థిని తండ్రి శాంతిరాజ్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ సుశీలను వివరణ కోరగా చతుర్ధశి, అమావాస్య ఉండడంతో తెరవలేదని సెలవిచ్చారు.
చదువు సాగేదెట్టా..
Published Wed, Jun 17 2015 9:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement