=సైన్స్ విద్యార్థుల కోత ప్రయోగాలపై నిషేధం
=లెక్చరర్లే ప్రాణుల్ని కోసి బోధించాలి
=లేనిపక్షంలో రేఖా చిత్రాల వినియోగం
=ప్రభుత్వ నిర్ణయంతో మార్కులకు గండి
సైన్స్ విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందా? చిత్రపటాలతో బోధిస్తే చాలనుకుంటోందా? ప్రభుత్వాదేశాలను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తోంది. ఇంటర్మీడియట్ బైపీసీలో విద్యార్థులు వివిధ ప్రాణులపై చేయాల్సిన కోత ప్రయోగాలను ఈ ఏడాది నుంచి నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఏడాది నుంచి లెక్చరర్లే కోత ప్రయోగం చేసి విద్యార్థులకు వివరించాల్సి ఉంది. లేనిపక్షంలో చిత్రరూపాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉంది.
నర్సీపట్నం, న్యూస్‌లైన్: కొన్ని పాఠ్యాంశాలు వింటే చాలు అర్థమవుతాయి. మరికొన్ని పాఠ్యాంశాల బోధన ప్రయోగాలతోనే ముడిపడి ఉంటాయి. ఇంటర్‌లో బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లోని రసాయన, భౌతిక, జీవశాస్త్రాల్లో ప్రయోగాలు తప్పనిసరి చేయడం వెనుక ఉద్దేశమిదే. ఏటా నిర్ధిష్ట పీరియడ్లలో విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ముందు ప్రత్యేకంగా ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. రసాయన శాస్త్రం సహా జీవశాస్త్రంలో ప్రత్యేకంగా జీర్ణవ్యవస్థ, మరికొన్ని అవయవాల పనితీరును వివరించేందుకు కప్ప, బొద్దింక, వానపాము వంటి ప్రాణులపై విద్యార్థులు కోత ప్రయోగాలు చేసేవారు.
లెక్చరర్ పర్యవేక్షణలో వీటిని కోసి అన్ని అవయవాల పనితీరును క్షుణ్ణంగా అర్థం చేసుకునే వారు. తాజాగా విద్యార్థులు ప్రాణులను కోయరాదంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వీటిని అధ్యాపకులే కోసి వివరించాలని సూచించింది. లేనిపక్షంలో గతంలో ఇచ్చిన చిత్ర పటాల ద్వారా విద్యార్థులకు వివరించాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు సులభంగా వచ్చే మార్కులకు గండి పడే అవకాశముంది.
ఇంతవరకు కేవలం కోత ప్రయోగాలతో బోధించే విధానం ఉండటం వల్ల ప్రభుత్వ కళాశాలల్లో పూర్తిస్థాయిలో చిత్ర పటాలు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో లెక్చరర్లతో ప్రయోగాలు చేయిస్తే విద్యార్థులకు కొంతమేర నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల ప్రభావం విద్యార్థుల భవిషత్తుపై పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇదేం ‘ప్రయోగం’?
Published Fri, Dec 13 2013 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement