=అవినీతి భాగోతంపై అసెంబ్లీలో చర్చ
=నలుగురు అధికారులపై చర్యలు?
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : గుడ్లవల్లేరు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రైతు శిక్షణా భవనాల పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలు ఈ ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గతంలో అవినీతి నిరోధక శాఖ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విచారణలో గుంటూరుతో పాటు గుడ్లవల్లేరు వ్యవసాయ మార్కెట్ యార్డు పేరు ఈ భాగోతంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో లేవనెత్తారు. మార్కెటింగ్ శాఖ మంత్రి ముఖేష్ గౌడ్ ఈ విషయమై వివరణ ఇస్తూ ఇందుకు బాధ్యులైన నలుగురు అధికారులపై చర్యలు తీసుకోనున్నామని సమాధానమిచ్చారు. వివరాల్లోకి వెళితే...
గుడ్లవల్లేరు రైతు శిక్షణా కేంద్రం భవన నిర్మాణానికి 2008లో రూ. 10 లక్షల అంచనా వ్యయంతో నిధులు మంజూరయ్యాయి. అయితే ముడి సరుకుల ధరలు పెరిగాయన్న సాకుతో పనుల డిజైన్‌తో సంబంధం లేకుండా రెట్టింపు స్థాయిలో అంచనాలను తయారుచేసి మార్కెటింగ్‌శాఖకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఉన్నతాధికారులు అంచనా ఖర్చు, తదితర వివరాలను పరిశీలించకుండానే 2010లో రూ. 20 లక్షల నిధులు మంజూరు చేశారు. పైగా ఓ వైపు అంచనాలను పెంచుతూనే మరోవైపు ప్రస్తుతం ఉన్న అంచనాలకన్నా తక్కువ మొత్తంలోనే ప్రతిపాదనలు పంపి ప్రభుత్వానికి ఆదా చేసినట్లు చూపుతూ రికార్డులను నిర్వహించారు.
2011లో భవన నిర్మాణం పూర్తయిపోయింది. అయితే 2013లో ఏసీబీ సాధారణ తనిఖీలు నిర్వహించడంతో ఈ భవన నిర్మాణంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయన్న విషయం బట్టబయలయ్యింది. దాదాపు పనులు జరిగిన మూడేళ్ల కాలంలో ప్రామాణికమైన ధరల్ని నిర్ధారిస్తూ ఎన్నడూ అధికారులు నివేదిక తయారు చేయలేదని ఏసీబీ విచారణలో తేటతెల్లమైంది. ముడి సరుకులు పెరిగిపోయాయని అంచనాలను వేసి, ప్రభుత్వానికి లాభం చేకూర్చినట్లుగా అధికారులు వ్యవహరించిన హాస్యాస్పదమైన తీరును ఏసీబీ తన నివేదికలో తప్పుపట్టింది.
కేవలం నిర్వాహకులకు మేలు చేసేందుకే ఈ శాఖలోని ఉన్నత స్థాయి ఇంజినీరింగ్ అధికారులు ఎంతో ఉదాసీనంగా ఇష్టానుసార అంచనాలతో నిధుల్ని కేటాయించినట్లు ఏసీబీ అధికారులు నివేదిక ఇచ్చారు. నిబంధనల్ని తుంగలో తొక్కి, నిర్మాణ పనులకు నిధుల్ని కేటాయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరారు. గుడ్లవల్లేరుతో పాటు గుడివాడ తదితర మార్కెట్ యార్డుల్లో జరిగిన నిర్మాణాలపై విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయటపడతాయని రైతులు చెబుతున్నారు.
మళ్లీ తెర మీదకు ‘మార్కెటింగ్’ అవినీతి
Published Mon, Jan 6 2014 1:09 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM
Advertisement
Advertisement