కాణిపాకం ఏరియల్ వ్యూ బహుదా నదిలో పూడ్చిపెట్టిన మృతదేహం
చిత్తూరు ,కాణిపాకం: ప్రసిద్ధ కాణిపాకం ఆలయం వద్ద భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నాలుగు వందల మందికి పైగా పోలీసులు పహరా కాశా రు. ఈక్రమంలో పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణిస్తే కనీస సమాచారం కూడా ఇవ్వకుండా లాడ్జి యజమాని ఆ మృతదేహాన్ని తీసుకు వెళ్లి సమీపంలోని ఓ చెరువులో ఖననం చేశారు. దారి పొడవునా సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఉన్నా నాలుగు రోజుల వరకు పోలీసులకు లాడ్జిలో వ్యక్తి మరణించిన ఘటన తెలియకపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
సీసీ కెమెరాల్లో ఫుటేజీ ఎలా తొలగించారు?
కాణిపాకం గ్రామంలో పోలీసు స్టేషన్‌ను అనుసంధానం చేస్తూ నలభైకి పైగా సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటితో పాటూ చుట్టుపక్కల ఉన్న లాడ్జిల్లో సైతం మరో రెండు వందల వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని అనుక్షణం పోలీసు సిబ్బంది పహారా కాసే విధంగా అనుసంధానం చేశారు. వీటిలో ఎప్పటికప్పుడు దృశ్యాలు రికార్డు చేస్తుంటారు. అయినా భద్రత మాత్రం గాలిలో దీపంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుటేజీ కూడా కనిపించకుండా పోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతన్నాయి.
బ్రహ్మోత్సవాల సమయంలో..
వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 40 వేల నుంచి 50 వేల మంది వరకు భక్తులు ఆలయానికి వచ్చారు. ఇలాంటి తరుణంలో పగడ్బందీగా రక్షణ చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సుబ్బారావు సమీక్ష సమావేశంలో వెల్లడించారు. రథోత్సవం, పుష్పపల్లకి, తెప్పోత్సవం వంటి కార్యక్రమాలకు రెండువందల మందికి పైగా పోలీసులను ఇక్కడ బందోబస్తుకు నియమించారు. ఇక రథోత్సవం రోజున.. అత్యాధునిక సదుపాలయాలతో కూడిన కమాండ్ కంట్రోల్ వాహనంతో అడుగడుగునా పోలీసులు పహారా కాశారు. అయితే పోలీసు స్టేషన్‌కు ఐదువందల మీటర్లు దూరంలో ఉన్న ఒక ప్రైవేటు లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందితే.. ఆ మృతదేహాన్ని పట్టపగలు బైక్‌పై తరలిస్తే.. గుర్తించలేకపోయారు. దీనిపై తీవ్ర స్థాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లాడ్జిల్లో నిబంధనలకు పాతర
కాణిపాకం కేంద్రంగా 50కి పైగా ప్రయివేటు లాడ్జి్జలు ఉన్నాయి. వీరికి అడపాదడపా పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తూ.. నిబంధలను గుర్తు చేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. లాడ్జిలో రూం కేటాయించే ముందు ప్రతి వ్యక్తి ఫొటో, ఆధార్ నంబర్లను కచ్చితంగా పోలీసు యాప్‌లో అప్ లోడ్ చేయాల్సి ఉంది. అలాగే అధికారుల కోసం ఒక రిజిస్టర్.. ప్రత్యేకంగా మరో రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇవేమీ లాడ్జి యజమానులు పాటించడం లేదు. దీనిపై పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
స్థానికంగా లాడ్జిలో వ్యక్తి మరణించగా అతడిని గుట్టు చప్పుడు కాకుండా బహుదా నది పరివాహక ప్రాంతంలో పూడ్చి వేసిన విషయంపై కేసు నమోదైంది. దీనిపై స్థానిక వీఆర్‌ఓకు సమాచారం అందింది. వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాం. ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు శవ పంచనామ నిర్వహించి చర్యలు తీసుకుంటాం.– ఆదినారాయణ, చిత్తూరు వెస్ట్ సీఐ
Comments
Please login to add a commentAdd a comment