ఇంద్రకీలాద్రిపై టెం‘డర్’
సెక్యూరిటీ టెండర్ మాటేమిటి?
కాంట్రాక్టర్ల కేసులతో గతంలో రూ.90 లక్షల నష్టం
కాంట్రాక్టర్లతో సిబ్బంది లాలూచి
దేవస్థానం ఆదాయానికి గండి
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వ్యాపారం చేయడానికి ఒక్కసారి కాలుపెట్టిన కాంట్రాక్టర్ తిరిగి కిందకు వెళ్లడానికి ఇష్టపడరు. అలాగే దేవస్థానానికి చెల్లించాల్సిన సొమ్మును నిజాయితీగా చెల్లించి వ్యాపారం చేసుకోవడానికి వారికి మనస్సు ఒప్పదు. దీంతో దేవస్థానంలోని సిబ్బందితో లాలూచి పడి కొత్త కాంట్రాక్టర్లను రానీయకుండా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కోర్టుకే పరిమితమైన సెక్యురిటీ టెండర్
ఇంద్రకీలాద్రిపై సెక్యురిటీ బాధ్యతలను ఓపీడీఎస్ సంస్థ నిర్వహిస్తోంది. దేవస్థానంలోనే ఏఈవో స్థాయి అధికారికి దగ్గర బంధువుతో ఈ సంస్థలోని ముఖ్యవ్యక్తులకు బంధుత్వం ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో టెండర్ గడువు పూర్తికావడంతో జనవరి నుంచి అమలులోకి వచ్చే విధంగా డిసెంబర్‌లో తిరిగి టెండర్ పిలిచారు.
దీంతో ఓపీడీఎస్ కంటే ఏజిల్ అనే మరో సంస్థ తక్కువ రేటుకు సిబ్బందిని నియమించేందుకు ముందుకు వచ్చింది. చివరకు ఈ విషయం మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ నేతల వరకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న సంస్థనే కొనసాగించాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో ఈవో ఈ విషయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్‌కు తెలియచేయడంతో కమిషనర్ టెండర్‌ను రద్దు చేశారు. ఓపీడీఎస్ మరికొంతకాలం కొనసాగేందుకు వీలుగా ఆ సంస్థ ప్రతినిధులు న్యాయస్థానానికి వెళ్లినట్లు సమాచారం.న్యాయస్థానంలో దేవస్థానం తరపున పిటీషన్ వేయడానికి కమిషనర్‌కు లేఖ రాశారు. అక్కడ నుంచి సమాధానం రాకపోవడంతో ప్రస్తుతానికి కొత్తవారికి అవకాశం లేకుండా ఓపీడీఎస్ సంస్థనే నెలకు రూ.11 లక్షలు చెల్లిస్తూ కొనసాగిస్తున్నారు. కొత్త సంస్థకు అవకాశం ఇస్తే ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. అయితే దీని వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని సమాచారం.
అన్నదానం క్లీనింగ్ సిబ్బందికాంట్రాక్టు పెండింగ్
దుర్గగుడిలో అన్నదానంలో క్లీనింగ్ సిబ్బందిని నియమించే కాంట్రాక్టు గత మార్చిలోనే ముగిసిపోయింది. దీనికి ఏడాదికి రూ.15 లక్షల వరకు చెల్లిస్తారు. అయితే ఇప్పటి వరకు ఈ టెండర్లు పిలిచేందుకు సిబ్బంది ఫైల్ సిద్ధం చేయలేదని తెలిసింది. దేవస్థానంలోకి క్రిందస్థాయి సిబ్బంది, కాంట్రాక్టర్‌లు మిలాఖత్ అవ్వబట్టే టెండర్ పిలవడంలో జాప్యం జరుగుతోందని సమాచారం.
గతంలోనూ ఇదే తంతు..
దేవస్థానంలో నలుగురైదుగురు కాంట్రాక్టర్లు తిష్ట వేసుకుని కూర్చున్నారు. వీరు తప్ప కొత్తవార్ని రానీయరు. గతంలో అమ్మవారికి భక్తులు సమర్పించే చీరలు, రవికెలు సేకరించుకునే కాంట్రాక్టు, దసరా ఉత్సవాల్లో ఇతర శాఖల సిబ్బందికి టిఫిన్లు, భోజనాల సరఫరా కాంట్రాక్టులను కొత్తవారికి దక్కకుండా కోర్టుల నుంచి స్టే తీసుకువచ్చారు. చీరల కాంట్రాక్టర్‌తో అధికారులు లాలూచీ పడటం వల్ల దేవస్థానానికి సుమారు రూ.90 లక్షల వరకు నష్టం వచ్చిన విషయం తెలిసిందే.
అలాగే కాంట్రాక్టర్లు మధ్య కీచులాటతో పాటు భోజనాలు సరిగా సరఫరా చేయకపోవడంతో విసుగు చెందిన పోలీసు అధికారులు భోజనాలకు బదులుగా రోజుకు రూ.100 సిబ్బందికే ఇచ్చివేయాలని ఈవోకు చెప్పి ఒప్పించారు.
కాంట్రాక్ట్ కొనసాగించేందుకు సలహాలు
కాంట్రాక్టర్లతో లీజెస్, లీగల్ విభాగం సిబ్బంది లాలూచి పడతారనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్ తన కాంట్రాక్టును ఏ విధంగా కొనసాగించుకోవాలో వీరే సలహా లు ఇచ్చి కోర్టులో ఏ అంశాలపై వెళ్లాలో కూడా రహస్యంగా చెబుతారు. అలాగే ఏ లాయర్లను నియమించుకోవాలనేది కూడా చెబుతున్నట్లు సమాచారం. దీంతో కాంట్రాక్టర్లు తమకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకుని దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నారు.