- కదలని హంద్రీ-నీవా
- ఆరు నెలల్లో చేసింది రూ.24 కోట్ల పనులే
- అందులో రూ.4.51 కోట్ల బిల్లులు పెండింగ్
బి.కొత్తకోట: జిల్లా రైతాంగానికి వరప్రసాదిని అయిన ఏవీఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు నత్తకంటే నిదానంగా సాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో అంతోఇంతో ముందుకుసాగాయి. ప్రస్తు తం నామమాత్రంగానే సాగుతున్నాయి. కేవలం 10 శాతం పనులే నడుస్తున్నాయి.
మదనపల్లె సర్కిల్ పరిధిలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 32 ప్యాకేజీల్లో మెకానికల్, ఎత్తిపోతల, ప్రధాన, బ్రాంచ్ కెనాళ్ల, ఉపకాలువల పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ అటకెక్కాయి. ప్రభుత్వం నిర్ధిష్టమైన చర్యలకు ఆదేశాలివ్వకపోవడంతో అధికారులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. 2013 డిసెంబర్ నాటికే ప్రాజెక్టు గడువు ముగిసింది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యత ఏమిటో ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులే చెబుతున్నాయి. నిధులు నిలిచిపోవడంతో పనులు చేపట్టలేక అధికారులు చేతులెత్తేశారు.
ఆరు నెలల్లో రూ.24 కోట్ల పనులే..
ప్రాజెక్టు రెండో దశ పనుల్లో భాగంగా మదనపల్లె సర్కిల్ పరిధిలో రూ.2,906.41కోట్ల పనులు చేయాల్సి ఉంది. ఈ సెప్టెంబర్ నాటికి రూ.2,178.89కోట్ల పనులు పూర్తి చేశారు. ఈ పను లు ఇప్పటికే పూర్తి కావాలి. అయితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలతో పనులు మందగించాయి. ప్రస్తుతం దాదాపుగా పనులు నిలిచిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.24.59 కోట్ల పనులు మాత్రమే చేశారు. వీటికి ప్రభుత్వం రూ.4.51 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంచింది. 720 కిలోమీటర్ల కాలువలకు 611 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. ప్రధాన కాలువ 205 కిలోమీటర్లలో 159.57 కిలోమీటర్లు పూర్తి చేశారు.
ఆ ప్యాకేజీలను పట్టించుకునే దిక్కులేదు..
మదనపల్లె సర్కిల్ పరిధిలోని 9 ప్యాకేజీల్లో పనులు చేపట్టని ఏజెన్సీలపై ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోంది. ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. ఒక్కో ఏజెన్సీకి 10 నుంచి 20 నోటీసులిచ్చినా కదలికలేదు. మొదటి దశ పనులపై సమీక్షించిన ప్రభుత్వం రెండో దశ పనులపై ఆదేశాలివ్వడంలో జాప్యం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. అందుకే 9 ప్యాకేజీలను రద్దు చేయాలన్న అధికారుల ప్రతిపాదనలను పట్టించుకోవడంలేదని అధికారులు అంటున్నారు.
భూ సేకరణదీ అదే దారి
ప్రాజెక్టు కోసం 22,947 ఎకరాలు సేకరించాలన్నది లక్ష్యం. ఇందులోనూ జాప్యం కనిపిస్తోంది. ప్రాజెక్టు పనులు చేపట్టి తొమ్మిదేళ్లు గడిచినా 17,960 ఎకరాలను మాత్రమే సేకరించారు. 4,987 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కాలువల నుంచి రైతుల భూములకు నీరందేలా ఉప కాలువలను తవ్వాలి. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్లు వీటి జోలికి పోవడం లేదు. ఒకటి రెండు చోట్ల మినహాయిస్తే ఎక్కడా జరగడం లేదు. వ్యయాన్ని పెంచాలన్న డిమాండ్‌తో పనులు చేయడంలేదు.