ధాన్యం అమ్మకాలకు ‘పాసుపుస్తకం’ కొర్రీ | seeds | Sakshi
Sakshi News home page

ధాన్యం అమ్మకాలకు ‘పాసుపుస్తకం’ కొర్రీ

Published Mon, Apr 20 2015 4:10 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM

seeds

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పాసుపుస్తకం కొర్రీతో కనీస మద్దతు ధర కూడా రైతులు పొందలేకపోతున్నారు. మద్దతు ధర కంటే రూ.2వేలు నష్టానికే అమ్ముకుంటున్నారు. అతి తక్కువ ధరకే మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతన్నను దోపిడీ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లర్లతో కుమ్మక్కవడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్న ఆరోపణలున్నాయి.
 
 కొడవలూరు :  రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర కంటే ఎక్కువకే అమ్ముకునేలా చేస్తామని చెప్పి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు రైతులను కేంద్రాల దరిచేరకుండా చేస్తున్నారు. అనవసరపు కొర్రీలు పెట్టి ధాన్యం అతి తక్కువ ధరకే మిల్లర్లకు అమ్ముకునేలా చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మాలంటే పట్టాదారు పాసుపుస్తకం తప్పనిసరి చేశారు.
 
  జిల్లాలో యాభై శాతం మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు లేవు. వీరంతా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేక పుట్టికి రూ.రెండు వేల నష్టానికి మిల్లర్లకే అమ్ముకుంటున్నారు. గతంలో కొనుగోలు కేంద్రంలో అమ్మాలంటే పాసుపుస్తకం లేకపోయినా అడంగల్, శిస్తు రసీదు, వీఆర్వో ధ్రువీకరణ ఉంటే సరిపోయేది.
 
 ఈసారి మాత్రం పాసుపుస్తకంతో వస్తేనే కొనుగోలు చేస్తామని కేంద్రాల్లో తేల్చి చెబుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల ఆదేశాలని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ ధాన్యం పుట్టి రూ.11,900 ఉండగా, మిల్లర్లు అదే రకాన్ని కేవలం రూ.9,800కు కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్ల ధర బాగా తక్కువగా ఉండటంతో కేంద్రాల్లో అమ్ముకునేందుకే రైతులు మొగ్గుచూపుతున్నారు. అయితే పాస్‌బుక్ తప్పనిసరైన కారణంగా విధిలేని పరిస్థితుల్లో మిల్లర్లనే ఆశ్రయిస్తున్నారు.
 
 90 శాతం ధాన్యం మిల్లర్ల పర
 జిల్లాలో తొలి పంట సమయంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల దాకా ధాన్యం దిగుబడి వస్తుంది. ఈ ధాన్యమంతా కూడా నెల్లూరు జిలకర, 1010 రకాలే అయినందున ఏ గ్రేడ్ కిందే లెక్క. జిల్లాలో 53 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటికే 80 శాతం వరి కోతలు పూర్తవగా కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి దాకా కేవలం 15 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన ధాన్యమంతా మిల్లర్ల పరమైంది. దీనికి ప్రధాన కారణం అనవసరపు కొర్రీలతో రైతులను కేంద్రాల దరి చేరకుండా చేయడమే.
 
 గొతాల కొరత
 మరోపక్క గోతాల కొరత రైతులను వెంటాడుతోంది. పాసుపుస్తకం ఉన్న రైతులు కేంద్రాలకు వచ్చినా గోతాలు లేని కారణంగా రోజుల తరబడి తిప్పుతున్నారు. అన్ని రోజులు ధాన్యాన్ని భద్రపరచుకోలేక రైతులు మిల్లర్లనే ఆశ్రయించాల్సి వస్తోంది.
 
 అధికారులు, మిల్లర్లు కుమ్మక్కు వల్లే:
 చాలా మంది రైతులకు పాసుపుస్తకాలు లేవు. వీరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనడం లేదు. పాసుపుస్తకం తెమ్మంటున్నారు. ప్రత్యామ్నాయం ఏమీ లేదంటున్నారు. దీనికి సంబంధించి అధికారులను ప్రశ్నించగా పాస్‌బుక్ ఉండాల్సిందేనంటున్నారు. ఎప్పుడూలేని విధంగా ఈ సారి కొత్త నిబంధన తెర మీదకు తెచ్చారంటే మిల్లర్లతో అధికారులు కుమ్మక్కై ఉంటారు.
 -పెనాక నాగశ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి
 
 అడంగల్ తెచ్చినా తిరస్కరించారు..
 పాసుపుస్తకం కోసం ధరఖాస్తు చేసిఉంటే ఇంకా రాలేదు. అడంగల్, శిస్తు రసీదులు తెచ్చి ధాన్యం కొనమని కేంద్రానికి వస్తే కుదరదని తిప్పి పంపేశారు. కేంద్రాలు కేవలం పేరుకే పెట్టారు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు.
 -దేవరపల్లి సంతోషమ్మ, సంఘబంధం అధ్యక్షురాలు
 
 రాష్ట్రవ్యాప్తంగా ఆ నిబంధనే అమలు..
  పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు పాసుపుస్తకం ఉంటేనే కొనుగోలు చేయాలని చెప్పారు. ఇతరత్రా ఏమి ఉన్నా తిప్పి పంపమని స్పష్టంగా తెలిపారు. రైతుల ఇబ్బందులను కూడా వారి దృష్టికి తీసుకుపోయాం. వారు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో పొందుపరచిన నిబంధనల్లో పాసుపుస్తకం అనివార్యమైనందున పాస్‌బుక్ ఉంటేనే కొనుగోలు చేయాలని పదేపదే చెప్పారు. అందువల్ల అలాగే చేస్తున్నాం.
 - రుక్మిణి, డీఆర్‌డీఏ ఏపీఎం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement