ఎవరి జేబుల్లోకి రవాణా! | pocket | Sakshi
Sakshi News home page

ఎవరి జేబుల్లోకి రవాణా!

Published Sat, Feb 7 2015 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

pocket

వీరఘట్టం : ధాన్యం కొనుగోలు కేంద్రాల  పేరుతో మాయ చేస్తున్నారు. కేంద్రాల సిబ్బందితో ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు కన్నం పెడుతున్నారు. మిల్లర్లు నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేసిన ప్రభుత్వ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి లోడింగ్, రవాణా చార్జీల భారం నుంచి తప్పించుకుంటున్నారు. దాంతో ఆ భారం ప్రభుత్వంపై పడుతోంది. ధాన్యం కొనుగోలుకు కేంద్రాల్లోని సిబ్బంది సవాలక్ష నిబంధనలు అమలు చేస్తుండటంతో ధాన్యం అమ్ముడు కాక రైతుల వద్దే నిల్వ ఉండిపోతున్నాయి.
 
  ఈ పరిస్థితి అవకాశంగా తీసుకున్న మిల్లర్లు నేరుగా రైతుల కళ్లాలకు వెళ్లి నచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల రైతులు సరైన ధర లభించక నష్టపోతున్నారు.  ఈ ధాన్యాన్నే ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేసినట్లు అక్కడి ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు సిబ్బందితో కుమ్మక్కై రికార్డుల్లో నమోదు చేయిస్తున్నారు.
 
 అక్కడ నుంచి మిల్లర్లు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి అదనపు చమురు వదులుతోంది. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం 121 కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఇప్పటి వరకు 70 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. రైతులు తీసుకొచ్చే  ధాన్యం గ్రేడింగ్ చేసి తక్కువ ధర చెల్లిస్తుండడంతో రైతులు కొనుగోలు కేంద్రానికి రావడం మానే శారు. తమ వద్దకు వస్తున్న మిల్లర్లకే నేరుగా అమ్ముకుంటున్నారు.
 
 రికార్డుల్లో మాయ
 నిబంధనల ప్రకారం రైతుల నుంచి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా జరిగిన లావాదేవీలకే ప్రభుత్వం నిర్ణీత లోడింగ్, రవాణా చార్జీలు చెల్లిస్తుంది. మిల్లర్లు, వ్యాపారులు నేరుగా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి ఇది వర్తించదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు  తరలించేందుకు వీలుగా పౌరసరఫరాల శాఖ ముందుగానే ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లను నియమించింది. వీరు కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు ధాన్యం రవాణా చేయాలి. కొనుగోలు కేంద్రం నుంచి 16 కి.మీ లోపు దూరానికి టన్నుకు రూ.300 ఆపరేటర్లకు చెల్లిస్తారు. 16 కి.మీ దాటి రవాణా చేస్తే కి.మీ.కు రూ3.40 చొప్పున చెల్లిస్తారు. అయితే మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి ఆపరేటర్లకు రవాణా చార్జీలు చెల్లించేస్తున్నారు.
 
 హమాలీ చార్జీల పేరుతో..
 అలాగే రైతులు కేంద్రానికి తెచ్చే ధాన్యాన్ని దించి తూకం వేసి తిరిగి లారీలకు లోడ్ చేసేందుకు హమాలీలకు క్వింటాకు రూ. 4.72 చొప్పు ప్రభుత్వం ఇస్తుంది. ధాన్యం కేంద్రానికి రాకపోయినా వచ్చినట్లు నమోదు చేస్తుండటం వల్ల లోడింగ్ చార్జీలు కూడా చెల్లించినట్లు నమోదు చేయాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 2,13,088 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం హమాలీలకు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వాస్తవంగా రూ.5 లక్షలకు మించి చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. రైతు కళ్లాల నుంచి ధాన్యం నేరుగా మిల్లులకు వెళుతున్నందున లోడింగ్, అన్‌లోడింగ్ చార్జీలను కూడా మిల్లర్లు, రైతులే భరిస్తున్నారు. కేంద్రాల్లో మాత్రం హమాలీలకు చెల్లిస్తున్నట్లు నమోదు చేస్తున్నారు. ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతోందన్నది కేంద్రాల సిబ్బందికే తెలియాలి.
 
 మౌలిక వసతులు లేక..
 మౌలిక సౌకర్యాలు లేక ఇప్పటికీ చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన కేంద్రాల్లో ధాన్యాన్ని ఒక్క జైనా నిల్వ చేసేందుకు సదుపాయం కూడా లేదు. మార్కెట్ యార్డుల్లో తప్ప వేరే ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రక్షించడం పెద్ద సమస్యగా మారింది. దీంతో రికార్డుల్లో కొనుగోలు చేసినట్లు రాసుకొని మిల్లుకు నేరుగా తరలిస్తే రవాణా చార్జీలు మిగులుతుండటంతో పాటు తమకు రిస్కు ఉండదనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.                                                                                                                                                                                                      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement