సీమ అభివృద్ధిపై బాబు వివక్ష
రాయలసీమ అభివృద్ధి వేదిక
సబ్ కమిటీ కన్వీనర్ జి.ఓబులు
అనంతపురం అర్బన్: అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల కేటాయింపులో రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివక్ష చూపుతూ అన్యాయం చేస్తున్నారని రాయలసీమ అభివృద్ధి వేదిక సబ్ కమిటీ కన్వీనర్ జి.ఓబులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం గణేనాయక్ భవన్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.ఇంతియాజ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హంద్రీనీవాకు రూ.200 కోట్లు కేటాయించి, పట్టిసీమకు రూ.1,300 కోట్లు కేటాయించడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. చిత్తూరు మెడికల్ కళాశాలలో రాయలసీమ విద్యార్థులకు సీట్లు రాకుండా 120 జీవోని విడుదల చేయడం, చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేసేందుకు పిలిచిన కండలేరు టెండర్‌ని రద్దు చేయడం వివక్ష చూపడమే అన్నారు.
కడపలో ఉక్కు కర్మాగారం అయితేనేమి, రూ.760 కోట్ల మన్నవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు ఇవ్వడం చూస్తే రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారనేది స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. ప్రస్తుత బడ్జెట్‌లో హంద్రీ-నీవా, గాలేరి-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించి రెండేళ్లలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని హెచ్చరించారు. అందులో భాగంగా ఈ నెల 15న ఉభయ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్’ చేపడుతున్నామన్నారు.