
చంద్రబాబు హామీలన్నీ గాలికి..
ప్లాంట్‌పై బాబుకు పట్టింపు ఉంటే ఎన్డీఏకు మద్దతు ఉపసంహరించుకోవాలి
బ్లాస్ట్ ఫర్నేస్–3ను నిలిపివేయడం ఉద్యోగుల గొంతు కోయడమే
ఓ ప్రకటనలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజం
విశాఖ సిటీ : ‘భయపడినంతా అయింది. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్–3ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతుకోయడమే. తెలుగు జాతికిది అతిపెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు ఇచి్చన హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయి’.. అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు.
ఆయన ఇంకా ఏం పేర్కొన్నారంటే.. కేంద్రంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నా.. స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహం. టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టింది. ఏమాత్రం పట్టింపు ఉన్నా.. చంద్రబాబు తక్షణం ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలి. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైజాగ్ స్టీల్‌ను కంటికి రెప్పలా కాపాడారు.
మూత వేయడమే పరిష్కారం కాదని ఆయన అనేకసార్లు చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలోగానీ, ఎన్‌ఎండీసీలో గానీ విలీనంచేసి, ఇనుప ఖనిజ గనులు కేటాయిస్తే లాభాల్లోకి తీసుకురావచ్చని సూచించారు. ఐదేళ్లుగా మౌనంగా ఉన్న కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మూసివేతకు సాహసం చేస్తోందంటే చంద్రబాబు స్వప్రయోజనాలు, ఆయన వైఖరే కారణం అనడంలో సందేహంలేదు. విశాఖ ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రాజీనామా చేసి పోరాటానికి సిద్ధంకావాలి.
ఉత్తరాంధ్ర తలను నరకడంగా భావించే ఈ దుర్మార్గాన్ని ప్రజలంతా ఎండగట్టాలి. చంద్రబాబు ప్రజా సంపదను అమ్మకానికి పెడుతుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి విశాఖ స్టీల్‌ను రక్షించే దాకా పోరాటం సాగిస్తుంది. వైజాగ్ స్టీల్ అనేది రాష్ట్ర ప్రజల ఉద్వేగాలు, ఆత్మగౌరవంతో ముడిపడినది. ఇప్పుడు పోరాడకపోతే వైజాగ్ స్టీల్ అనే రాష్ట్ర గౌరవ చిహ్నం శాశ్వతంగా కనుమరుగైపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment