
బిల్లును వ్యతిరేకిస్తే విభజన ఆగిపోతుంది: సిఎం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)ను గట్టిగా వ్యతిరేకిస్తే విభజన ఆగిపోతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు చెప్పారు. సీఎంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. బిల్లును పూర్తిగా అద్యయనం చేయండని సీఎం వారికి చెప్పారు. ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం రావొచ్చునన్నారు.
క్లాజుల వారీగా మనకున్న అభ్యంతరాలను సభలో నమోదు చేద్దాం అని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చకు పూర్తిగా సహకరించాలని కోరారు. అన్ని అంశాలను పరిశీలించి తమ అభిప్రాయాలు చెప్పాలని సీఎం వారికి సలహా ఇచ్చారు.
ఇదిలా ఉండగా, శాసన సభలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తామని సీమాంధ్ర మంత్రి కాసు కృష్ణా రెడ్డి చెప్పారు. సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాలని పిలుపు ఇచ్చారు.