అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తామని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. క్యాంప్ ఆఫీస్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకిస్తామని తెలిపారు. బిల్లును వ్యతిరేకించి ఓటింగ్ కోసం పట్టుబడతామన్నారు. దీనికోసం ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ బాధ్యతలను ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, గంటా శ్రీనివాస్, శైలజానాథ్లకు అప్పగించామని తెలిపారు.
రాయల తెలంగాణ అనే అంశాన్ని పక్కకు పెట్టి, సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్యంగా కలిసిరావాలని సూచించారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా విభజన బిల్లుపై అసెంబ్లీలో అభిప్రాయాలు చెప్పేలా రాష్ట్రపతి ఇచ్చిన గడువు సరిపోకుంటే పెంచేందుకు కూడా మరింత సమయం కోరతామన్నారు. విభజన బిల్లును వ్యతిరేకించిన అనంతరం ఆ బిల్లును పార్లమెంటుకు పంపరాదని రాష్ట్రపతిని కోరాలని మంత్రులు తెలిపారు. ఒకవేళ ఆ బిల్లును రాష్ట్రపతి పంపితే దానిపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులతో మాట్లాడి వారి పదవులకు రాజీనామా చేయాలా?...లేకపోతే పార్లమెంటులో బిల్లును వ్యతిరేకించాలా?...అన్నదానిపై చర్చించాలన్నారు. ఈ విషయాలనే సీఎంతో భేటీలో చర్చించామన్నారు.