అమ్ముడుపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు
- ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఆరోపణ
- సిగ్గులేని కేంద్ర మంత్రులు ప్యాకేజీలు అడుగుతున్నారు
- తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ కాదు
సాక్షి, ఏలూరు/విజయవాడ: సమైక్య ఉద్యమాలు ఉవ్వెత్తున జరుగుతుంటే సీమాంధ్ర ఎంపీలు ప్యాకేజీలకు అమ్ముడు పోయారని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఆరోపించారు. తాము కోరినప్పుడు రాజీనామాలు చేయకుండా పార్లమెంటులో పోరాడతామని చెప్పి మోసం చేశారన్నారు. సిగ్గులేని సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్యాకేజీలు అడుగుతున్నారని విమర్శించారు. కొందరు ఎమ్మెల్యేలు సైతం అధిష్టానానికి అమ్ముడుపోయారని, పైకిమాత్రం సమైక్య ముసుగు వేసుకున్నారన్నారు. అలాంటి వారిని వదలిపెట్టబోమన్నారు.ఎంపీలను, కేంద్ర మంత్రులను నిలదీయాలని, సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఉన్న ప్రజాప్రతినిధులను సాంఘికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన ఇప్పుడు జరగదన్నారు. 2014 ఎన్నికలు కీలకమన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా ఉయ్యూరులో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సమైక్యాంధ్ర సకల జనుల రైతు గర్జన సభలో అశోక్‌బాబు మాట్లాడారు. విభజన చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పదని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినా అది పాస్ కాదని చెప్పారు. బిల్లు పెడితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పారు.
రాష్ట్ర విభజన అంశం అసెంబ్లీకి వస్తే సీమాంధ్రలోని ఎమ్మెల్యేలంతా దాన్ని వ్యతిరేకించాలన్నారు. జీవోఎంకు సంబంధించిన 11అంశాలూ రాజ్యాంగ విరుద్ధమైనవేనన్నారు. తెలంగాణవాదులు రాజకీయ రౌడీయిజం చేస్తున్నారని అశోక్‌బాబు ఆరోపించారు. హైదరాబాద్‌లో పొలిటికల్ రౌడీయిజం నడుస్తోందని, రాజధానిని వదులుకునే సమస్యేలేదని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా పర్వాలేదని, కానీ ఆంధ్రా వాళ్లు తమను దోచేశారని తెలంగాణవాళ్లు ప్రచారం చేస్తున్న సమయంలో విడిపోవడం దారుణమని పేర్కొన్నారు. విడిపోయిన తర్వాత ఆంధ్రాప్రాంతం తమను దోచేసిందని తెలంగాణ ప్రభుత్వం పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చితే చరిత్రలో విలన్లుగా మిగిలిపోతామన్నారు. తెలంగాణను కర్ణుడితో పోల్చుతూ సోనియాను కుంతీదేవిగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ అనే కర్ణుడిని బతికించుకునేందుకు సోనియా పాట్లు పడుతున్నారన్నారు.
తెలుగుజాతిని విడగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి (కావూరు సాంబశివరావు) రెండు నెలలు ఉండే పదవి కావాలో, రెండుసార్లు గెలిపించిన ప్రజలు కావాలో తేల్చుకోవాలని, పదవే కావాలంటే ఆయన రాజకీయ జీవితానికి సమాధి కడతామని చెప్పారు. జీఓఎం నివేదిక కేంద్ర కేబినెట్‌కు వెళుతుందని అప్పుడు మన కేంద్ర మంత్రులు ఇద్దరు అక్కడే ఉంటారని, మన చావుకు శాసనం రాస్తుంటే వారు సంతకం ఎలా పెడతారో అడుగుతామని చెప్పారు. ఈ నెల 24వ తేదీన ఉద్యోగ, రైతు, విద్యార్థి సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంధ్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.