ashock babu
-
కనీస వేతనం రూ.15 వేలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 15 వేలుగా, గరిష్ట వేతనం రూ.1.35 లక్షలుగా నిర్ధారించాలని ఏపీఎన్జీవోలు పదో వేతన సవరణ సంఘానికి ప్రతిపాదించా రు. ఉద్యోగులందరికీ 50 శాతం మధ్యంతర భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తాము పంపిన నివేదికలపై వివరణ ఇచ్చేందుకు వారు సోమవారం సచివాలయంలో పీఆర్సీ చైర్మన్ పీకే అగర్వాల్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. 80 అంచెలు, 32 గ్రేడుల విధానంలో వేతనాలు చెల్లించాలని, వచ్చే నెల 15లోగా పీఆర్సీని అమలు చేయాలని కోరారు. ఉద్యోగులకు ఇస్తున్న రాయితీలను పెంచాలని, హెచ్ఆర్ఏను హైదరాబాద్‌లో 30 శాతం, జిల్లా కేంద్రాల్లో 20 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఐదు రోజుల పనిదినాల విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా ఇంకా ఉత్తర్వులు రాలేదన్నారు. పింఛను చెల్లింపులో కేంద్ర విధానాన్ని అనుసరించాలని, ఉద్యోగుల పిల్లలకు ఎడ్యుకేషన్ రీయింబర్స్మెంట్ కింద నెలకు రూ.100 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో కచ్చితంగా పనిచేయాల్సిన కాలవ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించాలని, మహిళా ఉద్యోగులకు 5 రోజుల ప్రత్యేక సెలవులు ప్రకటించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను బేషరతుగా వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఉ ద్యోగ సంఘాలతో భేటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌కు గెజిటెడ్ హోదా ఇవ్వాలి రాష్ట్రంలోని డిప్యూటీ తహసీల్దార్లకు గెజిటెడ్ హోదా కల్పించాలని ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ పదో పీఆర్సీని కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో సంఘం ప్రతినిధులు సోమవారం సచివాలయంలో పీఆర్సీ అధ్యక్షుడు అగర్వాల్‌ను కలిశారు. అనంతరం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ... 20 శాఖల విధులను నిర్వర్తిస్తున్న రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక అలవెన్సు చెల్లించాలని పీఆర్సీకి విన్నవించినట్టు చెప్పారు. ఇంటర్, ఆపై విద్యార్హత కలిగిన వీఆర్వోలను గ్రేడ్- 1 గా గుర్తించి జూనియర్ అసిస్టెంట్ స్కేలు వర్తింపజేయాలని కోరామన్నారు. పీఆర్సీని కలిసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి వి.ఎస్ శివకుమార్, కోశాధికారి అంజి ప్రసాదరావు, కె. ఎల్.నరసింహారావు, బి. వెంకయ్య తదితరులున్నారు. -
జీవోఎం అసమగ్ర నివేదికిస్తే సుప్రీంను ఆశ్రయిస్తాం
బెంగళూరు, న్యూస్‌లైన్: జీవోఎంలో అన్ని అంశాలపై క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే నివేదిక ఇవ్వాలని, లేకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని యూపీఏ భాగస్వామ్య పార్టీలను కోరుతున్నామని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని మాజీ ప్రధాని దేవెగౌడను కోరడానికి బుధవారం ఇక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలు డ్రామాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 11 అంశాలపై సమగ్రమైన చర్చ జరగకుండానే జీవోఎం నివేదికను సిద్ధం చేస్తోందని ధ్వజమెత్తారు. విద్య, ఉద్యోగాలు, నీటి పంపకం, రాష్ర్ట సరిహదులపై చర్చించకుండానే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, కర్ణాటకలో ప్రవాసాంధ్రులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏపీ రెవెన్యూ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రైవేటు విద్యా సంస్థల అధ్యక్షుడు చిరంజీవిరెడ్డి, ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ గంగప్ప, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి, సీపీ. బ్రౌన్ సేవా సమితి అధ్యక్షుడు ఇడమకంటి లక్ష్మీ రెడ్డి పాల్గొన్నారు. -
అమ్ముడుపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఆరోపణ సిగ్గులేని కేంద్ర మంత్రులు ప్యాకేజీలు అడుగుతున్నారు తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ కాదు సాక్షి, ఏలూరు/విజయవాడ: సమైక్య ఉద్యమాలు ఉవ్వెత్తున జరుగుతుంటే సీమాంధ్ర ఎంపీలు ప్యాకేజీలకు అమ్ముడు పోయారని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఆరోపించారు. తాము కోరినప్పుడు రాజీనామాలు చేయకుండా పార్లమెంటులో పోరాడతామని చెప్పి మోసం చేశారన్నారు. సిగ్గులేని సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్యాకేజీలు అడుగుతున్నారని విమర్శించారు. కొందరు ఎమ్మెల్యేలు సైతం అధిష్టానానికి అమ్ముడుపోయారని, పైకిమాత్రం సమైక్య ముసుగు వేసుకున్నారన్నారు. అలాంటి వారిని వదలిపెట్టబోమన్నారు.ఎంపీలను, కేంద్ర మంత్రులను నిలదీయాలని, సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఉన్న ప్రజాప్రతినిధులను సాంఘికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన ఇప్పుడు జరగదన్నారు. 2014 ఎన్నికలు కీలకమన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా ఉయ్యూరులో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సమైక్యాంధ్ర సకల జనుల రైతు గర్జన సభలో అశోక్‌బాబు మాట్లాడారు. విభజన చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పదని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినా అది పాస్ కాదని చెప్పారు. బిల్లు పెడితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పారు. రాష్ట్ర విభజన అంశం అసెంబ్లీకి వస్తే సీమాంధ్రలోని ఎమ్మెల్యేలంతా దాన్ని వ్యతిరేకించాలన్నారు. జీవోఎంకు సంబంధించిన 11అంశాలూ రాజ్యాంగ విరుద్ధమైనవేనన్నారు. తెలంగాణవాదులు రాజకీయ రౌడీయిజం చేస్తున్నారని అశోక్‌బాబు ఆరోపించారు. హైదరాబాద్‌లో పొలిటికల్ రౌడీయిజం నడుస్తోందని, రాజధానిని వదులుకునే సమస్యేలేదని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా పర్వాలేదని, కానీ ఆంధ్రా వాళ్లు తమను దోచేశారని తెలంగాణవాళ్లు ప్రచారం చేస్తున్న సమయంలో విడిపోవడం దారుణమని పేర్కొన్నారు. విడిపోయిన తర్వాత ఆంధ్రాప్రాంతం తమను దోచేసిందని తెలంగాణ ప్రభుత్వం పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చితే చరిత్రలో విలన్లుగా మిగిలిపోతామన్నారు. తెలంగాణను కర్ణుడితో పోల్చుతూ సోనియాను కుంతీదేవిగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ అనే కర్ణుడిని బతికించుకునేందుకు సోనియా పాట్లు పడుతున్నారన్నారు. తెలుగుజాతిని విడగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి (కావూరు సాంబశివరావు) రెండు నెలలు ఉండే పదవి కావాలో, రెండుసార్లు గెలిపించిన ప్రజలు కావాలో తేల్చుకోవాలని, పదవే కావాలంటే ఆయన రాజకీయ జీవితానికి సమాధి కడతామని చెప్పారు. జీఓఎం నివేదిక కేంద్ర కేబినెట్‌కు వెళుతుందని అప్పుడు మన కేంద్ర మంత్రులు ఇద్దరు అక్కడే ఉంటారని, మన చావుకు శాసనం రాస్తుంటే వారు సంతకం ఎలా పెడతారో అడుగుతామని చెప్పారు. ఈ నెల 24వ తేదీన ఉద్యోగ, రైతు, విద్యార్థి సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంధ్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.