కనీస వేతనం రూ.15 వేలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 15 వేలుగా, గరిష్ట వేతనం రూ.1.35 లక్షలుగా నిర్ధారించాలని ఏపీఎన్జీవోలు పదో వేతన సవరణ సంఘానికి ప్రతిపాదించా రు. ఉద్యోగులందరికీ 50 శాతం మధ్యంతర భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తాము పంపిన నివేదికలపై వివరణ ఇచ్చేందుకు వారు సోమవారం సచివాలయంలో పీఆర్సీ చైర్మన్ పీకే అగర్వాల్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. 80 అంచెలు, 32 గ్రేడుల విధానంలో వేతనాలు చెల్లించాలని, వచ్చే నెల 15లోగా పీఆర్సీని అమలు చేయాలని కోరారు.
ఉద్యోగులకు ఇస్తున్న రాయితీలను పెంచాలని, హెచ్‌ఆర్‌ఏను హైదరాబాద్‌లో 30 శాతం, జిల్లా కేంద్రాల్లో 20 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఐదు రోజుల పనిదినాల విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా ఇంకా ఉత్తర్వులు రాలేదన్నారు. పింఛను చెల్లింపులో కేంద్ర విధానాన్ని అనుసరించాలని, ఉద్యోగుల పిల్లలకు ఎడ్యుకేషన్ రీయింబర్స్‌మెంట్ కింద నెలకు రూ.100 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో కచ్చితంగా పనిచేయాల్సిన కాలవ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించాలని, మహిళా ఉద్యోగులకు 5 రోజుల ప్రత్యేక సెలవులు ప్రకటించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను బేషరతుగా వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఉ ద్యోగ సంఘాలతో భేటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అశోక్‌బాబు డిమాండ్ చేశారు.
డిప్యూటీ తహసీల్దార్‌కు గెజిటెడ్ హోదా ఇవ్వాలి
రాష్ట్రంలోని డిప్యూటీ తహసీల్దార్లకు గెజిటెడ్ హోదా కల్పించాలని ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ పదో పీఆర్సీని కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో సంఘం ప్రతినిధులు సోమవారం సచివాలయంలో పీఆర్సీ అధ్యక్షుడు అగర్వాల్‌ను కలిశారు. అనంతరం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ... 20 శాఖల విధులను నిర్వర్తిస్తున్న రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక అలవెన్సు చెల్లించాలని పీఆర్సీకి విన్నవించినట్టు చెప్పారు. ఇంటర్, ఆపై విద్యార్హత కలిగిన వీఆర్వోలను గ్రేడ్- 1 గా గుర్తించి జూనియర్ అసిస్టెంట్ స్కేలు వర్తింపజేయాలని కోరామన్నారు. పీఆర్సీని కలిసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి వి.ఎస్ శివకుమార్, కోశాధికారి అంజి ప్రసాదరావు, కె. ఎల్.నరసింహారావు, బి. వెంకయ్య తదితరులున్నారు.