బాబు గారు ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి | Story on Andhra Pradesh chief minister ChandraBabu Naidu | Sakshi
Sakshi News home page

బాబు గారు ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి

Published Tue, Jul 15 2014 1:39 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

బాబు గారు ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి - Sakshi

బాబు గారు ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి

అధికారాన్ని 'విషం'గా అభివర్ణించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ముఖ్యమంత్రి పీఠం ముళ్లకిరీటం అంటూ సచివాలయ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నిజమే అధికారం ముళ్ల కిరీటమే. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. తెలిసినప్పుడు మళ్లీ ముళ్లకిరీటం అందుకోవాలని ఎందుకు తహతహలాడినట్లు?

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా గతంలో లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని ఆయన భావించినట్లు ఉన్నారు. అందుకే శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లు కైవనం చేసుకోగా బాబు తెగ ఖుషీ ఖుషీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఆయనకు మెల్లగా అర్థమవుతున్నాయి.  దాంతో బాబులోని వేదాంతి బయటకు తన్నుకొచ్చినట్లు ఉన్నాడు. అందుకే సీఎం పీఠం ముళ్ల కిరీటం అంటూ వేదాంతాలు పలుకుతున్నారు.

చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు నెలన్నర అయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాలన ప్రారంభమైంది లేదు. అదికాక ఇప్పటివరకు రాష్ట్ర రాజధాని ఎక్కడో నిర్ణయం కాలేదు. ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ చేస్తామంటూ ఇచ్చిన హమీపై నేటికి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇవాళో రేపో రుణమాఫీపై బాబు ప్రకటన చేస్తారంటూ రైతులు ఎదురు చూస్తున్నారు. ఆ అంశంపై కమిటీ వేశాం... నివేదిక వస్తుంది... అంటూ చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు. దాంతో రైతులకు రుణమాఫీ చేయాలంటూ చంద్రబాబును ప్రతిపక్షాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. అదే అంశంపై ప్రతిపక్షాలు చంద్రబాబుపై రోజురోజూకు ఒత్తిడి పెంచుతున్నాయి. మరో పక్క మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పుడు రుణమాఫీపై మీ నాయకుడు ఏం చేశారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.

దాంతో సదరు నాయకులు తమతమ నియోజకవర్గాల్లో ప్రజలకు మోహం చూపించలేక పోతున్నామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారు. రోలు వచ్చి మద్దెలతో దరువు పెట్టుకున్నట్లుగా చంద్రబాబు పరిస్థితి తయారైంది. రైతులు, సొంత పార్టీ నాయకులు, ప్రతిపక్షాలకు రైతు రుణమాఫీపై ఏం చెప్పాలో అర్థం కాక చంద్రబాబు తలను గోడకు బాదుకుంటున్నారు. సీఎంగా మరోమారు ఎన్నికైనందుకు నవ్వాలో లేక ఏడవాలా తెలియని పరిస్థితి బాబులో నెలకొంది.

అందుకే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న ఠీవీ ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆ విషయం చంద్రబాబు తీరులోనే ఇట్టే స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం పీఠంపై అధిష్టించిన ఆయనకు ముళ్ల మీద కుర్చునట్లుంది. ఆ విషయాన్ని వెల్లడిస్తే బాగోదని అనుకున్నారో ఏమో పాపం చంద్రబాబు సీఎం పీఠం బంగారమని అందరూ అనుకుంటారు కానీ ... ముళ్ల కిరీటం అంటూ బాబు సెలవిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు శనివారం విజయవాడలో ఏపీఎన్జీవోలు ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు 'సీఎం పీఠం'పై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement