సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రశాంతంగా ఉండే విజయనగరం కర్ఫ్యూ నీడలోకి వెళ్లింది. వీధివీధినా పోలీసులు, కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. ఆందోళనకారులను తరిమికొట్టాయి. ఇల్లిల్లూ శోధించి యువకుడన్నవాడు కనిపిస్తే చాలు చితకబాదాయి. అయితే, ఉద్యమకారులు వీధుల సందుల్లోంచి వచ్చి రాళ్లవర్షం కురిపించారు. దీంతో ఇరువర్గాల మధ్య పలుమార్లు ఘర్షణ వాతావరణం నెల కొంది. శనివారం రాత్రే పోలీసులు పలు కాలనీల్లోకి ప్రవేశించి దాదాపు 35మందిని అరెస్టు చేశారు. అయితే, పోలీసుల నిర్బంధంలో ఇంతకన్నా ఎక్కువ మందే ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు పోలీసుల దౌర్జన్యాలను నిరసిస్తూ మహిళలు ఆందోళన చేశారు.
కర్ఫ్యూ ఉన్నప్పటికీ పలుమార్లు ఆందోళనకారులు పోలీసుల మీదకు రాళ్లు రువ్వారు. గాజులరేగ శివారు కాలనీలోకి వెళ్లిన భద్రతా బలగాలు కొందరు యువలకులను చితకబాదాయి. కోపోద్రిక్తులై స్థానికులు సమీపంలో ఉన్న సీతం ఇంజినీరింగ్ కళాశాలను ధ్వంసం చేశారు. ఇక్కడ పరిస్థితి అదుపు తప్పడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. తమ కాలనీ యువకుడ్ని పోలీసులు ఎత్తుకెళ్లిన విషయం తెలుసుకున్న తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్న తరుణంలో పోలీసులు కొట్టడంతో చేయి విరిగింది. కొత్తపేట లద్దెపల్లివారి వీధుల్లోకి బలగాలు జొరబడి దొరికినవారందర్నీ కొట్టాయి. దీంతో స్థానికులు రాళ్లు రువ్వారు. ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బాష్పవాయువును, రబ్బర్ బుల్లెట్లను వినియోగించారు. దాసన్నపేటలోనూ ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఆందోళనకారులు పలుమార్లు పోలీసులపై రాళ్లు రువ్వడంతో డీఐజీ విక్రమ్ మాన్ సింగ్ వెళ్లి పరిస్థితి చక్కదిద్దారు. అయితే, ఆయన వెనుదిరగ్గానే స్థానికులు వెళ్లి పోలీసుబీట్‌ను తగులబెట్టేశారు.
ఇక్కడా పలుమార్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద దాదాపు 300మంది యువకులు కాపుకాసి పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అదనపు బలగాలు వెళ్లి లాఠీచార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత ఉద్యమకారులు పోలీస్ బీట్‌ను తగులబెట్టారు. అనంతరం పోలీసులు వచ్చి ఉద్యమకారులను తరిమికొట్టారు. పట్టణ శివారు బీసీ కాలనీలోనూ పోలీసులు జులుం ప్రదర్శించారు. ఇళ్లలోకి దూరి చితకబాదడంతో స్థానికులు ఆందోళన చేశారు. ఓ యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్థానికులు ఆందోళన చేశారు. కాగా, ఇంటెలిజెన్‌స విభాగం ఐజీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితిని సమీక్షించారు. నేడూ కర్ఫ్యూ కొనసాగింపు: పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని కలెక్టర్ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కర్ఫ్యూను అమలు చేస్తామన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, అల్లరి మూకలు, అసాంఘిక శక్తులను అవకాశం ఇవ్వరాదని పిలుపునిచ్చారు.
సీమాంధ్ర పరిస్థితిపై డీజీపీ సమీక్ష: సీమాంధ్రలో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో శాంతిభద్రతల తాజా పరిస్థితిని డీజీపీ బి.ప్రసాదరావు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో సమీక్షించారు. ఉత్తరాంధ్ర శాంతిభద్రతల విభాగం ఐజీ ద్వారక తిరుమలరావు, విశాఖ రేంజ్ డీఐజీ ఉమాపతి, రాయలసీమ ఐజీ రాజీవ్ రతన్, ఆయా జిల్లాల ఎస్పీలతో ఆయన మాట్లాడారు. విజయనగరంలో పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా ఎస్పీ డీజీపీకి నివేదించినట్లు సమాచారం. అనంతపురం, కడప, కర్నూలు. చిత్తూరుతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పరిస్థితి మరింత ఉధృత రూపం దాల్చుతున్నట్లు ఆయా జిల్లాల ఎస్పీలు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అవసరమైన చోట్లకు అదనంగా కేంద్ర బలగాలను తరలించాలని డీజీపీ ఆదేశించారు.