సీమాంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి:డీఎస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. విభజన వల్ల సీమాంధ్ర రాష్ట్రంలో విద్యుత్ రంగానికి నిధులు సమకురుతాయన్నారు. అలాగే నీటి సమస్య తలెత్తకుండా ఇరు ప్రాంతాల మధ్య కచ్చితమైన ఒప్పందాలు జరుగుతాయని తెలిపారు. అలాగే సీమాంధ్రలో ఐదు ప్రధాన నగరాలను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇక వెనక్కి తగ్గబోదన్నారు. సమన్యాయం కోసం కావాల్సిన కృషి జరుగుతుందని చెప్పారు.
సీమాంధ్ర ప్రాంతంలో మంచి ఉద్దేశ్యంతోనే సీమాంధ్రలు సమైక్యాంధ్ర అంటున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై కలిసి చర్చించేందుకు ఏపీ ఎన్జీవో, టీఎన్జీవోలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా డీఎస్ గుర్తు చేశారు. రాష్ట్ర విజభనలో హైదరాబాద్ నగర సమస్య అసలు సమస్యకాదని అన్నారు. స్థానికంగా ఎవ్వరికి ద్వితీయ పౌరసత్వం ఉండదని డీఎస్ సుస్పష్టంగా చెప్పారు.