సీమాంధ్ర కేంద్ర మంత్రులు దద్దమ్మలు: మేకపాటి
హైదరాబాద్: సీమాంధ్ర కేంద్ర మంత్రులు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని చెప్పి ఇప్పుడు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని అన్నారు. మెజార్టీ ప్రజల మనోభావాలను పట్టించుకోవడంలేదన్నారు. త్వరగా రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రాన్ని కోరుతున్నారని ఆరోపించారు.
ఇది ప్రజాస్వామ్యమా లేక నియంత పాలనా అని మేకపాటి ప్రశ్నించారు. రాజకీయలబ్దికోసం సీమాంధ్ర నేతలు ఇలాగే వ్యవహరిస్తే వారిని సీమాంధ్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని హెచ్చరించారు. అడ్డగోలు విభజనను తమ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ ప్రధాన ఎజెండా అని అన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలని మేకపాటి కోరారు.