సీనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య
జి.సిగడాం, న్యూస్‌లైన్ :జి.సిగడాం మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గొర్లె ఉమామహేశ్వరరావు (45) సోమవారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. జి.సిగడాంలో విధులు నిర్వహిస్తున్న ఈయన పొందూరులో కార్యాలయ పని నిమిత్తం వెళ్తున్నట్టు చెప్పి వెళ్లారు. పొందూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద విషం తాగారు. అక్కడ నుంచి జి.సిగడాం మండల పరిధిలోని వాండ్రంగి సెంటర్ వద్దకు వచ్చి ఉమామహేశ్వరరావు కుప్పకూలిపోయినట్టు స్థానికులు తెలిపారు. బ్యాంకు పనిపై అటుగా వెళ్తున్న జి.సిగడాం ఎంఈవో ఎం.వి.ప్రసాదరావు ఉమామహేశ్వరరావును చూసి.. పరిస్థితిని గమనించి 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ పది నిమిషాలు చికిత్స పొందుతూ చనిపోయారు. ఉమామహేశ్వరరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు
ఉమామహేశ్వరరావు విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో సమాచారం తెలుసుకున్న జి.సిగడాం పరిషత్ కార్యాలయ సిబ్బంది బాసూరి శంకరరావు, రాజశేఖరం, రమణ, తహశీల్దారు జె దుర్గారవీంద్రనాథ్, డిప్యూటీ తహశీల్దారు డి.రమేష్‌బాబు, కార్యదర్శులు, వీఆర్వోలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉమామహేశ్వరరావు మృతికి ఎచ్చెర్ల ఎంఎల్‌ఏ కిమిడి కళావెంకటరావు, మాజీ ఎంఎల్‌ఏ మీసాల నీలకంఠంనాయుడు, జెడ్‌పీటీసీ సభ్యురాలు టంకాల లక్ష్మి, మాజీ ఎంపీపీ మీసాల లక్ష్మి, స్థానిక సర్పంచ్ వెలది సాయిరాం సంతాపం వ్యక్తం చేశారు.
స్వగ్రామంలో విషాదం
రాజాం రూరల్: ఉమామహ్వేరరావు ఆత్మహత్యతో ఆయన స్వగ్రామమైన రాజాం మండలంలోని పొనుగుటివలసలో విషాదం నెలకొంది. అంబేద్కర్ కాలనీ సమీపంలో నివసిస్తున్న ఈయన గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవారని స్థానికులు తెలిపారు. ఈయన మృతిపై పోలీసులు సమగ్రమైన దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యులు కోరారు.