
వృద్ధురాలి హత్య
ఏలూరు (వన్‌టౌన్/ఫైర్‌స్టేషన్ సెంటర్) : ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలి మెడలో బంగారు నగలపై కన్నేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కిరాతకంగా హత్య చేసి నగలు కాజేశారు. నగరంలోని వన్‌టౌన్‌లో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిజేసింది. తూర్పువీధిలోని వేణుగోపాలస్వామి గుడి వద్ద కొప్పు సత్యవతి (75) ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈమె ఎవరితో మాట్లాడకుండా తన పనులు తాను చేసుకుంటుంది. భర్త వాసుదేవరావు ఆరేళ్ల క్రితమే మరణించాడు. కాగా ఈమె ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహం కాగా, మరొక కుమార్తె చనిపోయింది. కుమారుడు చెన్నైలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయి ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.
ఎప్పుడూ తెల్లవారుఝామునే నిద్రలేచి పూజలు చేసుకునే సత్యవతి గురువారం తెల్లవారినా ఇంట్లో అలికిడి లేకపోవడంతో సందులో నుంచి చూసిన స్థానికులకు గుమ్మం బయటకు కాళ్లు కనబడటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలు హత్యకు గురైనట్టు నిర్ధారించారు. బండరాతితో తలపై మోది హత్య చేసి భావిస్తున్నారు. ఒంటిపై ఉన్న సుమారు 15 కాసుల బంగారు ఆభరణాలు అపహరించారని అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలాన్ని రప్పించి గాలించగా ఇంటి నుంచి రెండు వీధుల వరకూ వెళ్లి ఆగింది. ఘటనాస్థలాన్ని ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి, డీఎస్పీ ఎం.సత్తిబాబు పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్‌టౌన్ ఇన్‌చార్జి సీఐ వై.సత్యకిషోర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నగల కోసమే పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడి ఉండవచ్చని సీఐ చెప్పారు.