వలసలతో కాంగ్రెస్ కుదేలు! | Senior Congress leaders join Other party in vizianagaram | Sakshi
Sakshi News home page

వలసలతో కాంగ్రెస్ కుదేలు!

Published Sun, Mar 16 2014 1:54 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

Senior Congress leaders join  Other party in vizianagaram

సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో 1994లో జరిగిన ఎన్నికలు కాంగ్రెస్‌కు పీడకలగా చెప్పుకోవాలి. జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలుండగా ఆ ఎన్నికల్లో ఒక్కచోట కూడా కాంగ్రెస్ గెలవలేదు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన దగ్గరి నుంచి ఎప్పుడూ చూడని చేదు అనుభవాన్ని చూసింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో ఆ పార్టీ క్రమేపి పుంజుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రతో 2004లో మెజార్టీ స్థానాలను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.  ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేసిన అభివృద్ధి, అమలుచేసిన సంక్షేమ పథకాలే  2009లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలిపించాయి. ఆయన మరణానంతరం రాష్ట్రం మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.
 
 విశ్వాసం లేకపోవడమే ..
 వైఎస్సార్ దయతో ఎమ్మెల్యే, మంత్రులైన అనేక మందికి విశ్వాసం లేకపోవడమే ఆ పార్టీకి దయనీయ పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ కుటుంబీకులు....తమకు పలుపదవులు కట్టబెట్టిన  వైఎస్సార్‌పైనే  ఆయన మరణానంతరం విషం చిమ్మారు.   వైఎస్‌ఆర్  కుటుంబంపై కక్షపూరిత చర్యలకు దిగడంతో జిల్లా ప్రజానీకం తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచే బొత్స కుటుంబం రాజకీయ ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. ఇంతలోనే వైఎస్సార్ సీపీ ఆవిర్భవించడం, కాంగ్రెస్ నేతల్లో అనేక మంది ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.    అధికార బలంతో కాంగ్రెస్ మంత్రులు వైఎస్సార్ సీపీ నాయకులను అనేక ఇబ్బందులకు గురి చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నాయకులనైతే అభివృద్ధి పథకాలు దూరం చేసి అడ్డగోలుగా వ్యవహరించారు. అన్యాయంగా కేసులు బనాయించి నరక యాతన పెట్టారు. 
 
 ప్రజా వ్యతిరేకత పాలనతో విసుగు 
 కాంగ్రెస్ నేతల ప్రజావ్యతిరేక పాలనతో జిల్లా వాసులు విసిగిపోయారు. ఆ పార్టీ నాయకులంటే అసహ్యించుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయి.. ఎన్నికలెప్పుడు వచ్చినా బుద్ధి చెప్పాలని ఆనాడే నిర్ణయించుకున్నారు.  ఈ నేపథ్యంలో ప్రజల వ్యతిరేకతను గమనించిన కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరూ జారుకోవడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేలు సైతం పార్టీకి రాజీనామా చేసి, పదవులను కూడా త్యాగం చేసి వైఎస్సార్‌సీపీలోకి చేరారు.   ప్రలోభాలతో, బెదిరింపులతో వలసలను నియంత్రించేందు బొత్స కుటుంబీకులు ప్రయత్నం చేశారు. అధికారం చేతిలో ఉన్న వారితో పోరాడటం కష్టమని అయిష్టంతోనే చాలా మంది నాయకులు కొనసాగుతూ వచ్చారు. 
 
 పాపం పండింది ...
 రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం పాపం పండింది. ప్రజలు తిరగబడ్డారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబమే లక్ష్యంగా దాడులకు దిగారు. రాష్ట్రాన్ని, ప్రజలను నట్టేట ముంచేసిన కాంగ్రెస్ పార్టీకి చరమ గీతం పాడతామని శపథం చేశారు.  ఈ క్రమంలోనే ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక, ఇంకా కాంగ్రెస్‌లో ఉండటం మంచిది కాదని చాలా మంది వైఎస్సార్ సీపీలోకి చేరారు. ఇక్కడి నుంచి వలసల జోరు ప్రారంభమైంది. 
 
 రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదించడం, రాష్ట్రపతి పాలన అమల్లోకి రావడం, నేతల పదవులు పోవడంతో జిల్లా ప్రజలు, చాలా మంది నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. ఒంటెద్దు పోకడలు, నియంతృత్వ ధోరణితో విసిగిపోయిన నాయకులంతా అధినేతల కబంధ హస్తాల నుంచి విముక్తి పొందడానికి ఇదే సరైన సమయంగా ఎంచుకున్నారు. ఇంకేముంది వలసల జోరు పెంచారు.  సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, ఎస్.కోట నాయకులు అల్లు కేశవ వెంకట జోగినాయుడు, జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ తదితర నేతలతో పాటు పెద్ద సంఖ్యలో సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, పీఏసీఎస్ అధ్యక్షులు వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. 
 
 అంతకు రెండింతల మంది రెండు మూడు రోజుల్లో నియోజకవర్గాలకు చెందిన క్యాడర్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు.   వైఎస్సార్ సీపీలో బెర్త్ ఖాళీ లేని ప్రాంతాల్లో నాయకులు తెలుగుదేశంలోకి వెళ్తున్నారు. అలా వెళ్లినవారిలో శత్రుచర్ల విజయరామరాజు, వి.టి.జనార్దన్ థాట్రాజ్ ఉన్నారు. మొత్తానికి అటు వైఎస్సార్ సీపీ, ఇటు టీడీపీలోకి వలసలు జోరందుకోవడంతో కాంగ్రెస్ నాయకత్వం కలవరపడుతోంది.  ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంది.   ఈ క్రమంలో మున్సిపల్, ప్రాదేశిక , సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కోవడం నాయకత్వానికి తలనొప్పిగా మారింది.  పట్టు ఉన్న నేతలంతా ఇతర పార్టీలోకి వలస పోవడంతో అభ్యర్థులు నిలబెట్టలేక సతమతమవుతోంది. 1994కన్నా ఘోరమైన దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement