ప్రాణాలు తీసిన ఎడబాటు
ఇరువురు కానిస్టేబుళ్ల ఆత్మహత్య
కర్నూలులో కలకలం రేపిన ఘటన
మృతుల్లో ఒకరికి పెళ్లి నిశ్చయం
మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
నేడు పోస్టుమార్టం
కర్నూలు : ఇరువురు కానిస్టేబుళ్ల బలవన్మరణం ఘటన జిల్లా కేంద్రం కర్నూలులో కలకలం రేపింది. వీరిలో ఒకరికి పెళ్లి నిశ్చయం కావడంతో ఎడబాటును జీర్ణించుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి గన్‌మ్యాన్‌గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ మురళీకృష్ణ(పీసీ 2435), క్రిష్ణగిరి పోలీసుస్టేషన్‌లో పని చేస్తున్న సివిల్ కానిస్టేబుల్ వీరేష్(పీసీ 1468)లు నగరంలోని కొత్తపేట ఏఆర్ పోలీసుక్వార్టర్స్ పిండి జిన్ను లైన్‌లోని ఓ గది పై అంతస్తులో సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్రిష్ణగిరి మండలం రామాపురం గ్రామానికి చెందిన వీరేష్ 2013లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం అదే మండలం గోకులపాడులో పోలీసు పికెట్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను ఏఆర్ కానిస్టేబుల్ మురళీకృష్ణతో సహజీవనం చేస్తున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. వెల్దుర్తి మండలం గోవర్దనగిరి గ్రామానికి చెందిన మురళీకృష్ణ కూడా 2013లో ఆర్మ్‌డ్ రిజర్వు విభాగంలో కానిస్టేబుల్‌గా చేరాడు. కలుగొట్ల గ్రామానికి చెందిన మేనకోడలితో ఈనెల 30, 31 తేదీల్లో పెళ్లి జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. సన్నిహితంగా ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకుని దూరమవుతుండటాన్ని జీర్ణించుకోలేక వీరేష్.. మురళీకృష్ణతో గొడవ పడినట్లు సమాచారం. ఆ సందర్భంగా అతడిని కాల్చడంతో పాటు తనూ కాల్చుకుని చనిపోయినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. మృతదేహాల పక్కన తుపాకీ ఉండటంతో ఆ మేరకు నిర్ధారణకు వచ్చారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి గన్‌మ్యాన్‌గా ఉన్న మురళీకృష్ణ తన తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని అనుమతి తీసుకుని కర్నూలుకు చేరుకున్నాడు. ఈ విషయం వీరేష్ తెలుసుకుని అతని గదికి వెళ్లి ఒకరినొకరు నిందించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలపై రక్తం గడ్డకట్టి ఉండటంతో మధ్యాహ్నం ఆ ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఐజీ, ఎస్పీ
సీఎం బందోబస్తు ఏర్పాట్ల నిమిత్తం అవుకు ప్రాం తానికి వెళ్లిన ఎస్పీ ఆకే రవికృష్ణ రాత్రి 10:30 గంటల సమయంలో కర్నూలు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాబుప్రసాద్‌తో పాటు పట్టణంలోని పలువురు సీఐలు, పోలీసుల అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, కోశాధికారి శేఖర్‌బాబు తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వేలిముద్రల నిపుణులు, ఫోరెన్సిక్ అధికారులను రప్పించి ఆధారాలను సేకరించారు.
పోలీసుల అదుపులో శ్యామ్
ఎల్‌బీఎస్ నగర్‌లో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న శ్యామ్ అనే వ్యక్తి సాయంత్రం తన స్నేహితుడైన మురళీకృష్ణ నివాసముంటున్న గదికి వెళ్లాడు. మూసి ఉన్న తలుపులను తెరిచి చూడగా కానిస్టేబుళ్లు ఇద్దరూ చనిపోయి ఉండటంతో రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అతడిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎడబాటును జీర్ణించుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
మిన్నంటిన రోదనలు
కానిస్టేబుళ్ల ఆత్మహత్య ఘటన తెలిసి జనం పెద్ద ఎత్తున గుమికూడటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు అంతరాయం కలిగింది. మృతదేహాలను గదిలోనే ఉంచి తాళం వేశారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.