పనులు చేయకుంటే పని పడతాం
కాలువల పనులు పూర్తిచేయండి
కాంట్రాక్టర్లకు సీఎం క్లాస్
‘పోలవరం- పట్టిసీమ’పై సమీక్ష
విజయవాడ : కాలువల పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామనిహెచ్చరించారు. నగరంలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి ఆయన పోలవరం-పట్టిసీమ పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగేలా ప్రవర్తించే ఏజెన్సీలు ఎంతటివైనా, వాటి వెనుక ఎంతటివారున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఈనెల 20వ తేదీలోపు పోలవరం కుడికాలువ ప్రధాన కాలువ పనులు పూర్తి కావాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వ యంత్రాంగమంతా సహకార ధోరణితో వ్యవహరిస్తోందని చెప్పారు. భూసేకరణ సమస్యలు కలెక్టర్లు సమర్థవంతంగా పరిష్కరిస్తున్నారని, వారానికి ఒకసారి బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇదంతా రైతు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం చేస్తోందని పేర్కొన్నారు. కుడి ప్రధాన కాలువ పనుల్లో భాగంగా దేవరపల్లి వద్ద కఠినమైన శిలలతో కూడిన నేల ఉందని, 25 మీటర్ల లోతుకు డీప్ కట్ తవ్వకం పనులు చేపట్టేందుకు గానూ అధిక సామర్థ్యం ఉన్న పొక్లెయిన్లను ఉపయోగించాలని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యాదాస్‌కు సీఎం సూచించారు.
తాటిపూడి ఎత్తిపోతల నుంచి నీటి మళ్లింపు
రెండువేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకునే సామర్థ్యంతో పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మించిన తాటిపూడి ఎత్తిపోతల పథకం నీటిని కూడా పోలవరం కుడి కాలువలోకి మళ్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పథకం ద్వారా ఆగస్టు ఒకటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆయకట్టుకు నీటిని వినియోగించనున్న దృష్ట్యా అప్పటివరకు మొత్తం రెండువేల క్యూసెక్కులను ప్రధాన కాలువలోకి మళ్లించాలని ముఖ్యమంత్రి సూచిం చారు. కుడి ప్రధాన కాలువకు 14.8 కిలోమీటర్ల వద్ద ఈ నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు ఎంపీ కొనకొళ్ల నారాయణరావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు బాబు.ఏ, కె.భాస్కర్, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రితో జపాన్ బృందం భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబుతో జపాన్ ప్రతినిధులు శుక్రవారం భేటీ అయ్యారు. నగరంలోని ఇరిగేషన్ కార్యాలయంలో జపాన్‌కు చెందిన జైకా, జెబిక్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగువేల మెగావాట్లతో సూపర్ పవర్ యూనిట్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఫుడ్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి కూడా జపాన్ బృందం సీఎంతో చర్చలు జరిపినట్లు సమాచారం.
పరిహారం కోసం పామాయిల్ రైతుల మెర
పోలవరం కుడి కాలువ నిర్మాణంలో నష్టపోతున్న పామాయిల్ రైతులు, రైతు నాయకులు సీఎంను క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలిశారు. తాము కోల్పోయే ప్రతి చెట్టుకూ ఇప్పుడు ఇస్తున్న ధరకు రెట్టింపు చేసి రూ.1,280 చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. స్పందించిన ముఖ్యమంత్రి పామాయిల్ రైతులకు అనుకూలమైన ధర చెల్లించేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతు నాయకులు చలసాని ఆంజనేయులు, ఆళ్ల గోపాలకృష్ణ, గుండపనేని ఉమా వరప్రసాద్ తదితరులు సీఎంను కలిశారు. విజయవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన జాలిపర్తి గోపాలకృష్ణ ముఖ్యమంత్రిని కలిసి శాలువాతో సత్కరించారు.
ఎయిర్‌పోర్టులో సీఎంకు వీడ్కోలు
విమానాశ్రయం (గన్నవరం) : సీఎం చంద్రబాబుకు శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలికారు. విజయవాడ పర్యటనను పూర్తి చేసుకున్న ఆయన అనంతపురం వెళ్లేందుకు రోడ్డుమార్గం ద్వారా ఉదయం 9.45 గంటలకు ఇక్కడికి వచ్చారు. అనంతరం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లారు. విమానాశ్రయంలో సీఎంకు మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాబు.ఎ, నగర పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మునిసిపల్ కమిషనర్ వీరపాండియన్‌న్, మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకటబాలవర్ధనరావు, ఆర్డీవో చెరుకూరి రంగయ్య తదితరులు వీడ్కోలు పలికారు.