సాక్షి ప్రతినిధి, ఏలూరు(పశ్చిమగోదావరి): పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి మూడోసారి నీటి విడుదల రెండుగంటల ముచ్చటగానే ముగిసింది. ఈ ప్రాజెక్ట్‌ను ఏడాదిలో పూర్తి చేయడం తనకు కిక్కు ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన కొద్దిసేపటికే ఆ కిక్కు దిగిపోయేలా అధికారులు మోటార్లు నిలిపివేశారు. ముఖ్యమంత్రి లాంఛనంగా 24 మోటార్లను ఆన్‌చేసి, ఇటుకులకుంట వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి, గోదావరి జలాల్లో పూలు చల్లి వెళ్లిన కొద్దిసేపటికే మోటార్లను అధికారులు ఆపివేశారు. ఆయన పోలవరంలో సమీక్షలో ఉండగానే పట్టిసీమ నీటి విడుదల ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ పనులు పూర్తికాకపోయినా గోదావరిలోకి వరద నీరు రావడంతో పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలోని ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకున్నారు.
శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 24 మోటార్లను ఆన్ చేశారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి నేరుగా ఇటుకులకుంట వద్ద పోలవరం కుడి కాలువలో గోదావరి జలాలు కలిసే పాయింట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నీటిప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం పూజలు చేసి కాలువలో పూలు చల్లారు. ముఖ్యమంత్రి అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు వెళ్లిన కొద్దిసేపటికే అధికారులు ఎత్తిపోతల పథకం మోటార్ల స్విచ్ ఆఫ్ చేశారు. ముచ్చటగా మూడోసారి బుధవారం నిర్వహించిన ట్రయల్ రన్ కూడా రెండు గంటలకే ఆగిపోయిందని మీడియాలో వార్తలు రావడంతో రాత్రి పొద్దుపోయిన తరువాత రెండు మోటార్లను పాక్షికంగా ఆన్ చేశారు. గతేడాది ఆగస్టు 15న పట్టిసీమను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి, ఈ ఏడాది మార్చి 28న పట్టిసీమ పంపులకు ట్రయల్ రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
మూడోసారీ రెండు గంటల ముచ్చటే
Published Thu, Jul 7 2016 12:10 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM
Advertisement