బతుకు బొగ్గు | Settlement between the coalyard | Sakshi
Sakshi News home page

బతుకు బొగ్గు

Published Thu, Jan 9 2014 3:39 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

బతుకు బొగ్గు - Sakshi

బతుకు బొగ్గు

అక్కడి ప్రజల బతుకులు దుమ్ము, ధూళితో పెనవేసుకుపోయాయి. ఏడాది కాదు.. రెండేళ్లు కాదు..  ఏళ్ల తరబడి నుంచి రాకాసి దుమ్ము, ధూళీని మింగుతూనే ఉన్నారు. పాలుతాగే పసిగుడ్డు నుంచి మొదలుకొని కాటికి కాలుజాచిన ముసలి వరకు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. పంట పొలాలు పనికిరాకుండా పోతున్నాయి. మామిడి చెట్లు మసిబారుతున్నాయి. వాయు కాలుష్యంతో ఏటా కాపు పడిపోతోంది. చెట్ల ఆకులు పచ్చని రంగు కోల్పోయి నలుపుదనాన్ని సంతరించుకుంటున్నాయి. రాకాసి బొగ్గు దుమ్ము జల, వాయుకాలుష్యాన్ని వెదజల్లుతోంది. రోజు వందలాది టిప్పర్లు, లారీలు రాకపోకలు సాగిస్తుండటంతో శబ్ద కాలుష్యం ఏర్పడుతోంది. దుమ్ము, ధూళీని భరించలేక ఇళ్లు ఖాళీ అవుతున్నాయి. వీటన్నింటికీ కారణం ‘కిల్’ యార్డులు.. అవేనండీ కోల్‌యార్డులు. జన ఆవాసం లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన కోల్‌యార్డులు ప్రజల మధ్యే విచ్చలవిడిగా ఏర్పాటయ్యాయి. కాలుష్య నియంత్రణ మండలి ఏనాడూ పట్టించుకున్నది లేదు. ప్రజాభిప్రాయం సేకరించిందీ లేదు. కోల్‌యార్డులు మాత్రం ఏర్పాటవుతూనే ఉన్నాయి. బొగ్గు దుమ్ముతో తాండూర్ మండలం రేచిని రోడ్ రైల్వే కాలనీ, స్టేషన్ కాలనీ, వేణునగర్, బోయపల్లి బోర్డు మార్గాన రోజూ రాకపోకలు సాగించే కాసిపేట, ద్వారకాపూర్, చంద్రపల్లి గ్రామాల ప్రజలు పడుతున్న వేదనపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం.
 - న్యూస్‌లైన్, బెల్లంపల్లి/తాండూర్
 
 వ్యాధుల బారిన ప్రజలు..
 దుమ్ము ప్రభావంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. విషపూరితమైన బొగ్గు దుమ్మును పీల్చి ప్రజలు ప్రాణాంతకమైన వ్యాధులకు గురవుతున్నారు. శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులకు లోనవుతున్నారు. చర్మవ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు వదలడం లేదు. ప్రాణాలను పణంగా పెట్టి జీవించాల్సి వస్తోంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా అనారోగ్యం పాలవుతున్నారు.
 
 నిబంధనలకు విరుద్ధంగా కోల్‌యార్డులు..
 ప్రభుత్వ నిబంధనలకు విరుద ్ధంగా కోల్‌యార్డులు ఏర్పాటయ్యాయి. సుమారు 20 ఎకరాల్లో కోల్‌యార్డులు విస్తరించాయి. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూముల్లో ఇవి ఏర్పాటయ్యాయి. అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు చేయరాదనే నిబంధనలు ఉన్నా అవేమి పట్టించుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు ఈ విషయాలను ‘మామూలు’గానే తీసుకుంటున్నారు. ద్వారకాపూర్, బోయపల్లి, కాసిపేట గ్రామాల ప్రజలకు సర్వే నం.612, 37లలో దశాబ్ద కాలం క్రితమే ప్రభుత్వం నిరుపేదలకు భూ పంపిణీ చేసింది. ప్రస్తుతం ఆ సర్వే నంబర్ల భూముల్లోనే కోల్‌యార్డులు ఏర్పాటయ్యాయి. కొంత మంది యజమానులు అసైన్డ్ భూములను కొనుగోలు చేసి కోల్‌యార్డుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని ప్రభుత్వం ఓ పక్క చెబుతున్నా స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు  స్పందించి నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన కోల్‌యార్డులను ఎత్తివేయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.
 
 
 
 నిస్సారంగా మామిడి తోటలు..
 
 కోల్‌యార్డులను ఆనుకుని ఉన్న మామిడి తోటలు నిస్సారంగా త యారయ్యాయి. మామిడి చెట్లు సహజత్వాన్ని కోల్పోతున్నాయి. ఆ కుల రంగు మారి, విపరీతమైన దుమ్ము, ధూళి పేరుకుపోతోంది. చి గురు రాక పూత పడిపోతోంది. ఆ ప్రభావం మామిడి కాపుపై పడుతోంది. మామిడి పంటలను ఆధారంగా కుటుంబాలను పోషించుకుంటున్న రైతులు కోల్‌యార్డుల మూలంగా నష్టాలపాలై దిక్కులేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పంటలు కోల్పోతున్న  రైతులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం, కోల్‌యార్డుల నిర్వాహకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
 
 టిప్పర్ల మాటున దుమ్ము రాకాసి..
 కోల్‌యార్డుల మీదుగా వెళ్లే ప్రధాన రహదారులు దుమ్ము, ధూళికి నిలయంగా మారాయి. కోల్‌యార్డుల పక్క నుంచి చంద్రపల్లి, ద్వారకాపూర్, కాసిపేట గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలు పడి దుమ్ము పట్టి అధ్వానంగా తయారైంది. బొగ్గు టిప్పర్లు, లారీలు ఆ మార్గాన రోజూ వందలాదిగా రాకపోకలు సాగిస్తుండటంతో దుమ్ము పైకి లేస్తోంది. కాలినడకన వెళ్లే వారు, సమీపంలోని ప్రజలు ఆ ధాటి కి విలవిల్లాడుతున్నారు. ప్రధాన రహదారిపై వాహనచోదకులు ఎదురుగా వాహనాలను గుర్తించక ప్రమాదాల బారిన పడుతున్నారు.
 
 దుమ్ము, ధూళిలోనే రైల్వేస్టేషన్..
 బోయపల్లి బోర్డు, రైల్వేస్టేషన్ సమీపంలో దశాబ్ద కాలం క్రితం ఓ కోల్‌యార్డు ఏర్పాటు చేశారు. దాంతో విపరీతమైన దుమ్ము, ధూళి వచ్చి ప్రజలు భరించలేకపోయారు. ఎప్పుడు ఎత్తివేస్తారా అని ఎదురుచూశారు. ఎన్నోమార్లు ఆందోళనలు చేశారు. ఆ ఒక్క కోల్‌యార్డు తర్వాత వరుసగా ఐదు ఏర్పాటయ్యాయి. పక్కపక్కనే వీటిని ప్రారంభించడంతో ఇంకేముంది భరించలేని దుమ్ము, ధూళి అక్కడి వారిని వేధిస్తోంది. రేచిని రైల్వేస్టేషన్‌కు రోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రాష్ట్రీయ ప్రధాన రహదారికి 100 మీటర్ల దూరంలో రైల్వేస్టేషన్ ఉంది. రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ఇరుపక్కల ఎత్తై బొగ్గు కుప్పలు ఉన్నాయి. ఆ కుప్పలను దాటుకొని వెళ్తేనే రైల్వేస్టేషన్‌కు చేరుకోగలరు. నేరుగా వెళ్లేందుకు వీలు లేక పలువురు బొగ్గు లోడ్‌ను తీసుకెళ్లే రైల్వే వ్యాగన్ల కింద నుంచి దూరి పట్టాలు దాటి ప్లాట్‌ఫాంపైకి చేరుకుంటున్నారు. అన్నీ ఇబ్బందులు ఒక ఎత్తై.. ప్రధాన రహదారి నుంచి రైల్వేస్టేషన్‌కు చేరుకోవడం మరో ఎత్తు. ఎందుకంటే రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గానికి ఇరువైపుల ఉన్న బొగ్గు కుప్పల నుంచి విపరీతమైన దుమ్ము, ధూళి వస్తుంటుంది. మహిళలు చీరకొంగును, పురుషులు దస్తీని ముక్కుకు అడ్డంగా పెట్టుకున్నా రైల్వేస్టేషన్‌కు చేరుకోలేని పరిస్థితి. కొంత మంది ప్రయాణికులు ఆ బాధలు తట్టుకోలేక రైళ్ల కోసం 12 కిలోమీటర్ల దూరంలోని బెల్లంపల్లికి రైల్వేస్టేషన్‌కు తరలుతున్నారు.
 
 బీళ్లుగా పంట పొలాలు..
 కోల్‌యార్డుల ఏర్పాటుతో పంట పొలాలు నిస్సారంగా తయారయ్యాయి. విపరీతమైన దుమ్ము పొలాలపై పడుతుండటంతో సేద్యానికి పనికిరాకుండా పోతున్నాయి. కోల్‌యార్డుల పక్కన ఉన్న పంట పొలాలు 100 ఎకరాల వరకు ఖాళీగా మారాయి. ఇదివరలో వీటిలో ఖరీఫ్ సీజన్‌లో ఏటా వరి, పత్తి సాగు చేసేవారు. కొద్ది మంది రైతులు పంటల సాగు చేస్తున్నా దుమ్ముతో భూసారం దెబ్బతిని దిగుబడులు రాకుండాపోతున్నాయి. ఫలితంగా రైతులు సాగుపై ఆసక్తి చూపడంలేదు. కోల్‌యార్డుల పుణ్యమా అని ఎటుచూసినా భూములు బీడుపోయి కనిపిస్తున్నాయి. కొద్దోగొప్పో సాగువుతున్న పంటలపైనా దుమ్ము ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తోంది.
 
 రైల్వే క్వార్టర్లను నింపుతున్న దుమ్ము
 రైల్వే క్వార్టర్లకు చేరువలో కోల్‌యార్డులు ఏర్పాటు చేయడంతో దుమ్ము ఎగసిపడుతోంది. ఎంత సేపు ఊడ్చినా దుమ్ము ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రేచిని రైల్వేస్టేషన్‌కు అనుబంధంగా ఉద్యోగులు, సిబ్బంది కోసం 35 క్వార్టర్లను నిర్మించారు. దశాబ్ద కాలం వరకు ఆ క్వార్టర్లు సిబ్బందితో కళకళలాడాయి. కోల్‌యార్డులు ఎప్పుడు ఏర్పాటయ్యాయో అప్పటి నుంచి క్వార్టర్లలో నివాసం ఉంటున్న సిబ్బందికి యాతన మొదలైంది. బొగ్గు దుమ్ము, ధూళిని భరించలేక అనేక మంది ఖాళీ చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం పది క్వార్టర్లలోనే నివాసం ఉంటున్నారు. దీంతో రైల్వే క్వార్టర్లు ఖాళీగా మారి జనసందడి లేకుండాపోయింది. ప్రస్తుతం నివాసం ఉన్న సిబ్బంది దుమ్ము బాధను తట్టుకోలేక ఇళ్ల ఎదుట తలుపులు, కిటికీలకు అడ్డంగా టార్పాలిన్ కవర్లు కప్పుకొని జీవిస్తున్నారు. అయినా వారిని వీడడం లేదు.
 
 బాధిత గ్రామాలు
 కోల్‌యార్డులకు అనుబంధంగా రైల్వేస్టేషన్ కాలనీ, స్టేషన్ కాలనీ, బోయపల్లిబోర్డు, వేణునగర్ గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 230 వరకు ఇళ్లు ఉండగా 1100లకు పైబడి జనాభా నివసిస్తోంది. బొగ్గు దుమ్ము, ధూళి మధ్యనే జీవనం సాగిస్తున్నారు. నిత్యం ధట్టంగా దుమ్ము వ్యాపిస్తుండటంతో ఇళ్లలోని నీరు కలుషితమవుతోంది. గత్యంతరం లేక ప్రజలు ఆ నీటినే తాగి అనారోగ్యం పాలవుతున్నారు. వీరితోపాటు రాష్ట్రీయ ప్రధాన రహదారిపై వెళ్లే ప్రయాణికులు, సమీప గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్రమైన వాయు, శబ్ద కాలుష్యం బారిన పడుతున్నారు.
 
 నీళ్లు కలుషితమైతన్నయ్..
 నీళ్లతోనే మస్తు రోగాలత్తయని సర్కారు ఒక దిక్కు ప్రచారం జేత్తంది. గట్లాంటిది మా బాధ మాత్రం పట్టించుకుంటలేదు. కోల్‌యార్డుల నుంచి దుమ్ము, ధూళి ఇళ్లలచ్చి జేరుతంది. గట్లజేయబట్టి మంచినీళ్లు సుత కలుషితమైతన్నయ్. నీళ్లుదాగి ఆరోగ్యాన్ని కరాబ్ చేసుకుంటన్నం.
 - బేల్‌మతి, స్టేషన్‌కాలనీ
 
 ఇండ్లల్ల ఉండేటట్టు లేదు..
 బొగ్గు దుమ్ము, ధూళితో వేగలేకపోతన్నం. ఇండ్లల్ల ఉండుడు కట్టమనిపిత్తంది. ఇంతకుముదుగాల ఎందరికో చెప్పుకున్నం మా బాధ. కోల్‌యార్డులను తీసేయాలని చెప్పిన చేస్తం, చూస్తం అన్నలు గని ఎవ్వలు పట్టించుకుంటలేరు. ఎక్కడికైనా పోతనే మంచిగుంటదేమో.             - సునాని తులసమ్మ, స్టేషన్‌కాలనీ
 
 రోగాలత్తన్నయ్..
 కోల్‌యార్డులల్ల అచ్చే దుమ్ము, ధూళితో రోగాలత్తన్నయ్. పొల్లగాళ్లకు చర్మవ్యాధులు సోకుతాన్నయ్. పడుసోళ్లు, ముసులోళ్లకు దగ్గు, దమ్ము అత్తంది. ఆస్పత్రికి పోతే మంచిగాలి పీల్చాలని చెప్తండ్లు. మేమెక్కడికి అని పోకట. కోల్‌యార్డులు లేకుండా జేసి మా పాణాలు గాపాడాలే.
 - అవారి సత్తమ్మ, స్టేషన్‌కాలనీ
 
 పొలాలు పండుతలేవు
 దుమ్ము, ధూళి జేబట్టి పంట పొలాలు సుత పండుతలేవు. రెండు, మూడేళ్ల నుంచి వరి, పత్తి పండిస్తలేం. దుమ్ము పొలాలల్ల ఎగబారిపోతంది. పత్తిచేళ్లన్నీ దుమ్ముతో నల్లబడిపోతన్నయ్. గిట్ల దుమ్ము అత్తే ఏ పంటలు పండుతయ్. పంటలు లేక ఇబ్బంది పడుతున్నం.
 - దుంపల తిరుపతమ్మ, వేణునగర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement