చిన్నప్పటి నుంచి తాను ఎంతగానో ఇష్టపడే వ్యక్తిని కలవాలనుకున్న అతడు.. ఇంట్లో చెప్పాపెట్టకుండా రైలెక్కేసి..
హైదరాబాద్ : జననేత పట్ల ఓ విద్యార్థి అభిమానం ఊళ్లు దాటేలా చేసింది. చిన్నప్పటి నుంచి తాను ఎంతగానో ఇష్టపడే వ్యక్తిని కలవాలనుకున్న అతడు.. ఇంట్లో చెప్పాపెట్టకుండా రైలెక్కేసి హైదరాబాద్ చేరుకున్నాడు. కర్నూలు జిల్లా బేతంచలర్ల మండలం ముద్దవరంకు చెందిన ఏడో తరగతి విద్యార్థి ప్రసాద్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం.
వైఎస్ జగన్‌ను కలిసి, మాట్లాడి ఫోటో దిగాలని కోరిక. స్కూల్‌కు వేసవి సెలవులు కావడంతో ప్రసాద్... ఎలాగైనా వైఎస్ జగన్‌ను కలవాలని ఇంట్లో ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ రైలు ఎక్కాడు. కాచిగూడా స్టేషన్‌లో దిగిన అతడు అక్కడి నుంచి వాళ్లను, వీళ్లను అడుగుతూ వైఎస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యాలయం చేరుకున్నాడు.
కార్యాలయం వరకు వచ్చాడు కాని తన అభిమాన నేతను ఎలా కలవాలో తెలియని పరిస్థితి ప్రసాద్‌ది. చివరికి ధైర్యం చేసి తానెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయ సెక్యూరిటీ సిబ్బందికి తెలిపాడు. ఎలాగైనా వైఎస్ జగన్‌ను కలిసే అవకాశం కల్పించాలని ప్రాధేయపడ్డాడు. అది సాధ్యం కాదని చెప్పినా వినకుండా కార్యాలయం బయటే కూర్చుండిపోయాడు.
అయితే ప్రసాద్ విషయం తెలుసుకున్న వైఎస్‌జగన్ వెంటనే స్పందించి, అతడిని పిలిపించుకుని మాట్లాడారు. అంతేకాకుండా ప్రసాద్ ఉండేందుకు ఏర్పాట్లు చేసి భోజనం కూడా పెట్టించారు. అతనితో ఫొటో దిగడమే కాకుండా ఆ ఫొటో ఫ్రేమ్ కట్టించి మరీ ఇచ్చారు. అయితే ఇంట్లో చెప్పకుండా వచ్చాడన్న విషయం తెలుసుకున్న వైఎస్ జగన్...అతడి క్షేమసమాచారాలు ప్రసాద్ కుటుంబసభ్యులకు తెలియచేశారు.
రెండు రోజుల పాటు పార్టీ కార్యాయంలో గడిపిన ప్రసాద్ అనుకోని ఆతిధ్యానికి మురిసిపోయాడు. పలకరిస్తే చాలని వస్తే ఇంతటి ఆప్యాయత దక్కుతుందని ఊహించలేదని తెలిపాడు. అనంతరం అతడిని క్షేమంగా ఇంటికి చేర్చే ఏర్పాటు చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీంతో తాను అభిమానించే నాయకుడు తనపై ఇంత అభిమానం చూపుతాడని అసలు ఊహించలేదని ఇంటికి బయల్దేరాడు ప్రసాద్.