సాక్షి ప్రతినిధి, కడప: కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడికి శల్యుడు సారథ్యం వహించినట్లుగా పుష్పగిరి పీఠం పట్ల దేవాదాయశాఖ అదే ధోరణి అవలంబిస్తోంది. ప్రభుత్వానికి ఏడాదికి రూ. 20 లక్షలు ఆదాయం సమకూరుస్తున్న వారిని కాదని, ప్రవేటు వ్యక్తులకు లోపాయికారిగా వత్తాసు పలుకుతోంది. పాత లీజుదారులు కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా మసలుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇవ్వాల్సిన అనుమతులను తాత్సారం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
పుష్పగిరి పీఠంవారు చెన్నూరు మండలం శివాల్‌పల్లెలో భూములకు వేలం పాటలు నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. అందుకోసం జూన్ 12న అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) మల్లికార్జునప్రసాద్‌కు లేఖ రాశారు. ఆ మేరకు ఈనెల 26, 27 వ తేదీల్లో వేలం పాటలు నిర్వహించాల్సిందిగా ఏసీ అంగీకరించారు. ఆ మేరకు 23న వేలం పాటలకు బందోబస్తు నిర్వహించాలని పోలీసులకు సైతం పుష్పగిరి పీఠం లేఖ రాసింది. అనుకున్నట్లుగానే 26వతేది పుష్పగిరి పీఠం కార్యాలయంలో వేలం పాటలకు సమాయత్తమయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన దేవాదాయశాఖ అధికారులు డుమ్మా కొట్టారు.
స్పందించని అసిస్టెంట్ కమిషనర్....
భూముల వేలం పాటలు నిర్వహిస్తామని ముందే అనుమతి తీసుకున్న పుష్పగిరి పీఠం, వేలం పాటలకు దేవాదాయశాఖ ప్రతినిధిని పంపాలంటూ ఈనెల 26న అసిస్టెంట్ కమిషనర్‌ను సంప్రదించినట్లు సమాచారం. పలుమార్లు ఫోన్‌చేసి పుష్పగిరి పీఠం ప్రతి నిధులు కోరినట్లు ధృవీకరిస్తున్నారు. వేలం పాటలను కొనసాగించండని సూచించినట్లు సమాచారం. ఆ మేరకు 26వ తేదిన 25.44 ఎకరాలను వేలం పాటలు నిర్వహించారు. గతంతో ఆ భూములకు 191 బస్తాలు ధాన్యం, రూ.14,800 నగదు వేలం పాటల ద్వా రా ఆదాయం ఉండేది. ప్రస్తుతం రూ. 4.05లక్షల నగదుకు వేలం పాటలను ఖరారు చేశారు. ఆ మేరకు పుష్పగిరి పీఠంకు అదనంగా ఆదాయం లభించింది.
అయితే వేలం పాటలు నిర్వహించే ముందే దేవాదాయశాఖ అధికారుల నుంచి అనుమతులు ఇప్పించాలని పాటదారులు కోరారు. అప్పుడే పాట లకు చెందిన మొత్తం చెల్లిస్తామని చెప్పా రు. అందుకు అంగీకరించి పాటలు కొనసాగించారు. అధిక ఆదాయం వచ్చినప్పటికీ దేవాదాయశాఖ ఏ మాత్రం పుష్పగిరి పీఠంకు సహకరించడం లేదని సమాచారం. కారణం మునపటి వేలం పాటదారులు భూమి లేని నిరుపేదలమని కోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమేరకు కోర్టునుంచి స్టేటస్‌కో ఆర్డర్ తెచ్చుకునేందుకు వీలుగా గడువు ఇస్తూ వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది.
అందుకు జిల్లా దేవాదాయశాఖ సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు సమాచారం. 27వతేది నిర్వహించిన 28.62 ఎకరాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్‌ను పంపారు. ఆ మేరకు వేలం పాటలు నిర్వహించారు. 26వ తేది నిర్వహించిన వేలం పాటలకు సైతం ధృవీకరించాలని కోరితే తనకు సంబంధం లేదని ఈఓ శ్రీధర్ పేర్కొన్నట్లు సమాచారం. అదే విధంగా భూమి లేని నిరుపేదలుగా గుర్తించాల్సిన సర్టిఫికెట్ నెలలోపు ఇవ్వాల్సి ఉండగా ఐదేళ్లు గడుస్తున్నా అధికారులు స్పందించలేదని సమాచారం. ఆకారణంగానే వారు కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
శల్య సారథ్యం!
Published Sun, Jun 29 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM
Advertisement