సాక్షి, నంద్యాల: ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని వైఎస్సార్ సీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత తన సోదరుడితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నికను కురుక్షేత్ర మహా సంగ్రామంగా ఆయన వర్ణించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేశారని, శ్రేయోభిలాషులు వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. తమ కార్యకర్తలు బంగారమని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేశారని మెచ్చుకున్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కష్టపడి పనిచేశారని, కార్యకర్తలు చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. సీఎం, మంత్రులు మకాం వేసి ప్రలోభాలు పెట్టినా తమకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. సీఎం ఆరు రోజులు, ఆయన తనయుడు రెండ్రోజులు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు నెల రోజులు ఇక్కడే మకాం వేశారని వెల్లడించారు.
నామినేషన్ నుంచి పోలింగ్ ఎన్నోకుట్రలు పన్నారని ఆరోపించారు. తన సోదరుడు నామినేషన్ చెల్లకుండా చేయాలని చూశారన్నారు. ఎన్నోరకాల దుష్ప్రచారాలు చేశారని.. కుల, మతాలు అడ్డుపెట్టుకుని రాజకీయం చేశారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేసినా భయపడకుండా నంద్యాల ప్రజలు ఓటు వేశారని తెలిపారు. తనను ఇక్కడి నుంచి ఆత్మకూరుకు వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చారని, స్థానికేతర టీడీపీ నాయకులు తిష్ట వేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్ని కుట్రలు దాడులు చేసినా ధైర్యంగా ఎదుర్కొన్నామని చెప్పారు. కార్యకర్తలు తమ కుటుంబం వెన్నంటి నిలిచి, ఎంతో శాంతితో పనిచేసి గెలుపునకు కారణం కాబోతున్నారని చక్రపాణిరెడ్డి అన్నారు.
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం
నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు డబ్బులు పంచుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు.