
నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి వీరంగం
కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి.
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్‌ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిపై హత్యాయత్నం ఘటన మరవక ముందే.. తాజాగా భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి వీరంగం సృష్టించారు. నూనెపల్లెలో ఇద్దరు మహిళలపై ఆయన దాడి చేశారు.
వినాయక విగ్రహ ఏర్పాటు విషయంలో మహిళలపై దాడికి తెగబడ్డాడు. అనుచరులతో కలిసి వచ్చి ఏవీ సుబ్బారెడ్డి తమను విచక్షణారహితంగా కొట్టాడని దళిత మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. అధికార పార్టీ నేతల దాడిలో పలువురు మహిళలు గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను శిల్పామోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ గూండాల దాడులను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో అలజడి సృష్టించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరిగినా అందుకు టీడీపీ నేతలదే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.
కాగా నంద్యాలోని విశ్వనగర్‌కు చెందిన రాములమ్మ కుటుంబీకులు టీడీపీకి ఓటు వేయలేదన్న కోపంతో టీడీపీ వర్గీయుడు సుబ్బయ్య దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే. ఇక బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల వ్యవహారశైలి, అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు అందరికి తెలిసిందే.