
రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయి?
నంద్యాల: విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదింప చేసుకున్నానని వైఎస్సార్ సీపీ నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. తన రాజీనామాను ఆమోదించినందుకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకుని పార్టీ మారిన వారు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
శిల్పా కుటుంబం నైతిక విలువలకు కట్టుబడివుంటుందని, మైనార్టీలు తమ కుటుంబ సభ్యులాంటివారని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబానికి కార్యకర్తలే బలమని, వారికి కాపాడుకుంటామని భరోసాయిచ్చారు. తమ మాటలను వక్రీకరిస్తూ అధికార పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి మాటను వక్రీకరిస్తున్నారు, రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ సభలకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలకు దిక్కుతోచడం లేదని, ఒక్కొక్కరికీ రూ. 300 ఇచ్చి జగన్ వెంట వెళ్లొద్దని బతిమాలుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తుపై టీడీపీ నేతలు రోజుకోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పొత్తు లేకపోతే బీజేపీ మంత్రులతో రాజీనామా చేయించాలన్నారు. మైనార్టీ ఓట్ల కోసం టీడీపీ నాయకులు డ్రామాలాడుతున్నారని, నంద్యాలలో మైనార్టీలకు అన్ని విషయాలు తెలుసునని అన్నారు. ఉప ఎన్నిక ద్వారా టీడీపీకి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని చక్రపాణిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.