
'అఖిలప్రియ అప్పుడు ఓట్లు అడగాలి'
నంద్యాల: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నానని వైఎస్సార్ సీపీ నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజీనామా కోరారని వెల్లడించారు. మంగళవారం ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడుతూ.. విలువలకు తమ కుటుంబం కట్టుబడివుంటుందని, తన రాజీనామాతో ఈ విషయం నిరూపితమైందని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి భూమా అఖిలప్రియ ముందు రాజీనామా చేసి తర్వాత ఓట్లు అడిగితే గౌరవంగా ఉంటుందని అన్నారు. నైతిక విలువలు ఎవరికున్నాయో తన రాజీనామాతో తేలిందని చక్రపాణిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారానికి రాజీనామాతో సరైన సమాధానం చెప్పామన్నారు. తన రాజీనామాతో వైఎస్సార్ సీపీ నాయకుల విలువ మరింత పెరిగిందని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆమోదింపజేసుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు.