ఒంగోలు టౌన్ : ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని జిల్లా రోల్ అబ్జర్వర్, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ బీ ఉదయలక్ష్మి ఆదేశించారు. జిల్లాలో ఓటర్ల నమోదు ప్రక్రియపై నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో బుధవారం సాయంత్రం స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2015 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు.
ఇందుకోసం నాలుగు ఆదివారాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటికే ఈనెల 16వ తేదీ ఈ కార్యక్రమం జరిగిందని, మిగిలిన మూడు ఆదివారాలు(ఈనెల 23, 30, డిసెంబర్ 7వ తేదీ) ఓటరు నమోదు ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు ఓటర్ల జాబితాలతో అందుబాటులో ఉంటారన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, తప్పులు దొర్లినవారు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ కావలసినవారు సంబంధిత ఫారాలు అందించాలని సూచించారు.
డిసెంబర్ 22వ తేదీ నాటికి క్లెయిమ్‌లన్నింటినీ విచారిస్తామని చెప్పారు. జనవరి 5వ తేదీ ఓటర్లకు సంబంధించి సప్లిమెంటరీ జాబితా విడుదల చేస్తారని, 15వ తేదీ ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారని ఉదయలక్ష్మి వివరించారు. సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక నమోదు కార్యక్రమంలో పోలింగ్ కేంద్రాల వారీగా రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటుచేసి మినిట్స్ బుక్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఓటర్ల తొలగింపుకు సంబంధించిన కారణాలను అందులో పొందుపరచాలన్నారు.
మండలానికో పీఎస్‌ను క్రాస్ చెక్ చేయాలి : 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో జండర్ రేషియో 981 మంది ఉండగా, ఎలక్ట్రోరల్ రోల్స్‌కు సంబంధించి 1012 మందిని చూపించడంపై కలెక్టర్ విజయకుమార్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ రెండు కేటగిరీలకు సంబంధించి వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున ఎలక్ట్రోరల్ రిటర్నింగ్ అధికారి ప్రతి మండలంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఎంపిక చేసుకొని క్రాస్ చెక్ చేయాలని ఆయన ఆదేశించారు. మూడు నాలుగు పోలింగ్ కేంద్రాలను కూడా స్వయంగా పరిశీలించాలన్నారు.
ఓటర్ల నమోదుకు సంబంధించి ఒకేసారి కట్టలు కట్టలుగా ఫారాలు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని ఆదేశించారు. సర్వీస్ ఓటర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఎక్కువ సంఖ్యలో ఓటర్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై సంబంధిత అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
ఓటు వేస్తే సాంఘిక బహిష్కరణా?
జిల్లా రోల్ అబ్జర్వర్ దృష్టికి రామాయపాలెం ఘటన
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కొన్ని దశాబ్దాల తరువాత వినియోగించుకున్న వారికి ఇచ్చే బహుమానం సాంఘిక బహిష్కరణా అని సీపీఎం జిల్లా నాయకుడు పెంట్యాల హనుమంతరావు ప్రశ్నించారు. స్థానిక సీపీవో కాన్పరెన్స్ హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు నమోదు ప్రక్రియ, తదితర అంశాలపై జిల్లా అబ్జర్వర్ ఉదయలక్ష్మి బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో మర్రిపూడి మండలం రామాయపాలెంలో జరిగిన ఘటనను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కలెక్టర్ విజయకుమార్ రామాయపాలెం గ్రామాన్ని సందర్శించారని, అక్కడి ఎస్సీలు కొన్ని దశాబ్దాల నుంచి తాము ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని చెప్పడంతో కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకొని ఓటు హక్కు అవకాశాన్ని కల్పించారన్నారు. గ్రామంలో ఉండే పెత్తందారులు దానిని జీర్ణించుకోలేక వారిని సాంఘిక బహిష్కరణకు గురిచేశారన్నారు. మంచినీళ్లు ఇవ్వకపోగా పనులకు కూడా వారిని పిలవడం లేదన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్‌కు మూడు లక్షలు మంజూరు చేశారని, అయితే ఆ గ్రామ సర్పంచ్ స్థలం ఇవ్వకుండా ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.
ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలి
Published Thu, Nov 20 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM
Advertisement
Advertisement